- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆగం చేసినోళ్లు భుజాన గొడ్డలితో తిరుగుతున్నరు: CM KCR
దిశ బ్యూరో, మహబూబ్ నగర్/ నాగర్ కర్నూల్ ప్రతినిధి: ‘ఈ రాష్ట్రాన్ని ఆగం పట్టించినోళ్లు.. కొత్త వేషాలు వేసుకొని భుజాన గొడ్డలి పెట్టుకుని మన బతుకులను ఆగం చేయడానికి.. మన కళ్ళను మనమే పొడుచుకునేలా చేయడానికి వస్తున్నారు.. వారి పట్ల జాగ్రత్తగా లేకుంటే మల్ల ఆగమయిపోతాం’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 62 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సమీకృత జిల్లా అధికారుల భవన సముదాయం, 38.5 కోట్ల రూపాయలతో నిర్మించిన ఎస్పీ కార్యాలయం, 166 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాల, బీఆర్ఎస్ పార్టీ భవనాలను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్, టీడీపీ, బిజెపి ప్రభుత్వాలు 75 ఏళ్లు పాలించి ఈ రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించాయని ఆయన ఆరోపించారు.
కెసిఆర్ కన్నా లావుటోళ్లు.. పోడుగోళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించారు.. కానీ వాళ్ళు ఈ రాష్ట్రానికి చేసింది శూన్యం అని ముఖ్యమంత్రి ఆరోపించారు. పాలమూరు జిల్లా కరువు కాటకాలు.. వలసలు చూసి ఆనాడు కన్నీళ్లు కార్చామని ముఖ్యమంత్రి చెప్పారు. మహబూబ్ నగర్ ఎంపీగా పోరాటాలు చేసి తెలంగాణను సాధించుకున్నాం.. అధికారంలోకి వచ్చిన 9 ఏళ్ల కాలంలో సంవత్సరం కాలం నోట్ల రద్దు, ఒకటిన్నర సంవత్సరాలు కరోనాతో పోగా మిగిలిన ఆరున్నర సంవత్సరాల కాలంలో అద్భుతమైన ప్రగతిని సాధించామని కేసీఆర్ చెప్పారు. సగటు ఆదాయాలను సృష్టించుకోవడంలోనూ, విద్యుత్ వనరులను సృష్టించుకుని ఉపయోగించుకోవడంలో మనమే అగ్రగామిగా ఉన్నామని గుర్తు చేశారు.
కాకతీయులు కట్టిన 75 వేల చెరువులు ఎందుకూ పనికి రాకుండా పోగా.. మనం మిషన్ కాకతీయ ప్రవేశపెట్టి అద్భుతంగా వినియోగంలోకి తెచ్చుకున్నామన్నారు. చెక్ డ్యాంలను నిర్మించామని చెప్పారు. మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు తెచ్చుకున్నాం.. బీడువారిన పొలాలు పచ్చగా మారాయి.. పసిడి పంటలు పండుతున్నాయన్నారు. మన రాష్ట్రం అమలు చేస్తున్న అభివృద్ధి.. సంక్షేమ పథకాలు.. ప్రత్యేకించి రైతులకు సంబంధించిన పథకాలను మహా రాష్ట్రలో కూడా అమలు చేయాలని ఆ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలే ఈ రాష్ట్రానికి వచ్చి బతుకుదెరువు సాధించేలా మన రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు.
రైతులకు ధరణి అధికారం ఇచ్చింది..
‘భూములు అమ్ముకోవాలన్న.. కొనాలన్న ఒకప్పుడు రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడవలసి వచ్చేది. ధరణి వచ్చాక ఆ సమస్యలు లేకుండా పోయాయి.. లంచాలు చెల్లించుకోవాల్సిన అవసరం లేదు.. అటువంటి ఈ ధరణిని బంగాళాఖాతంలో వెయ్యాలని ఇటీవల జడ్చర్లలో జరిగిన ఓ సభలో ఒకడు అన్నాడు.. అలా అన్నవాణ్ణి బంగాళాఖాతంలో వెయ్యండి’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ధరణి వచ్చిన తర్వాత ప్రజలకు భూములపై అధికారం వచ్చిందని వెల్లడించారు. రైతు బొటన వేలుకు తప్ప.. ముఖ్యమంత్రికి కూడా ధరణిపై అధికారం లేకుండా పోయిందని వెల్లడించారు.
ధరణి వల్ల 99% మంచే జరుగుతుంది.. భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.. ఎకరా వేళల్లో నుంచి.. కోట్లకు చేరిందని ముఖ్యమంత్రి చెప్పారు. అక్కడక్కడ కొన్ని సమస్యలు రావచ్చు.. వాటిని మీ మంత్రులు, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింప చేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే.. రైతు ప్రభుత్వం.. రైతుల సంక్షేమం కోసం ఏమైనా చేస్తామని ఆయన చెప్పారు. ధరణి వల్లే.. రైతుబంధు, రైతు బీమాతో పాటు.. వరి ధాన్యం అమ్మితే నేరుగా ఆ డబ్బులు మీ ఖాతాలో జమ అవుతున్నాయి.. మరి అటువంటి ఈ ధరణిని తీసివేద్దామా..? అని సభలో ముఖ్యమంత్రి ప్రశ్నించగా ఉండాలని ప్రజలు ముక్తకంఠంతో సమాధానం ఇచ్చారు. ఒట్టేసి చెబుతున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సారధ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీలు రాములు, మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్ రెడ్డి, గోరేటి వెంకన్న, ఎమ్మెల్యేలు డాక్టర్ సి లక్ష్మారెడ్డి, జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, డాక్టర్ అబ్రహం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆయా జిల్లాల ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు.