- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెడ్‌షెడ్‌లో అధికంగా టమాట దిగుబడి
దిశ, కుత్బుల్లాపూర్: ప్రయోగం చేయాలే కానీ విజయం దాసోహం అవ్వకతప్పదు. దీన్ని మరోసారి నిరూపించారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) శాస్త్రవేత్తలు. ప్రయోగాత్మకంగా రెడ్ షెడ్ నెట్ లో టమాట పండించి సక్సెస్ అయ్యారు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసి మొదటి క్రాప్ తీశారు. తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడి.., పెట్టుబడికి రెట్టింపు ఆదాయం సాధించే మార్గాన్ని కనిపెట్టారు. ఈ విధానంతో రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. మల్చింగ్ విధానంలో చేసే ఈ సాగులో టమాటతో పాటు అంతర్ పంటగా ఆకుకూరలు వేసి అదనపు లాభం పొందే అవకాశం ఉంది. ఈ సరికొత్త సాగు విధానం, పెట్టుబడి, లాభాల వివరాలు మీకోసం.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పైప్ లైన్ రోడ్డులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) మరో అరుదైన ప్రయోగానికి వేదికైంది. ఇప్పటి వరకు మనం తెలుపు, గ్రీన్ రంగు షేడ్ నెట్లలో మాత్రమే సాగును చూశాం. కానీ రైతులకు అధిక మేలు జరిగేలా చేసే రెడ్ షేడ్ నెట్ ను ఉపయోగించి చేసిన పంట సాగులో సక్సెస్ అయ్యారు. 1000 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో ఉన్న పాలీ హౌజ్‌కు రెడ్ షేడ్ నెట్ వేసి టమాట పండించారు. వెలుపల వేసే పంట, ఇందులో వేసిన పంటవల్ల రెండింతల లాభాలు వస్తున్నాయి. యూఎస్440 రకం పంట సాగుతో ఈ ఘనత సాధించినట్లు సంస్థ అధికారి రాజ్ కుమార్ తెలిపారు.
ప్రయోజనాలు
రెడ్ షేడ్ నెట్.. 40 డిగ్రీల ఎండలున్నా మొక్కకు కావాల్సిన వెలుతురును మాత్రమే అందిస్తుంది. కాండం రెండింతల లావుగా పెరిగి ఎక్కువ రోజులు చనిపోకుండా ఉంటుంది. ఆకులు పొడవుగా పెరిగి కాయలకు అవసరమైన బలాన్ని అందిస్తాయి. కాండం బలంగా ఉండడం వల్ల ఎక్కువ కాయలు కాసే అవకాశం ఉంది.
మల్చింగ్
మొక్క పెరిగిన తర్వాత దారం సాయంతో పైకి కట్టి వదిలేయాలి. దీని వల్ల మొక్క కింద పడకుండా ఉంటుంది. మొక్క పెట్టినప్పుడు మల్చింగ్ షీట్ కు రంధ్రాలు పెట్టి ఆకుకూరలు సాగు చేయవచ్చు. ఇలా 60 రోజులకు టమాట కాత వచ్చే వరకు కింది భాగంలో రెండుసార్లు ఆకు కూరలు కోయడం వల్ల ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. మల్చింగ్ లేకపోతే పిచ్చి మొక్కల తొలగింపు, ఇతర పనుల కోసం కూలీలకు సుమారు రూ.10 వేల ఖర్చవుతుంది. ఈ విస్తీర్ణంలో మల్చింగ్ వేసేందుకు కేవలం రూ.8 వేలవుతుంది. అదే విధంగా ఆకు కూరల సాగు వల్ల రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఆదాయం వస్తుంది.
దిగుబడి అధికం
రెడ్ షెడ్ నెట్ లో సాగు వల్ల అధిక దిగుబడి వస్తుంది. గతేడాది నవంబర్ 4న మొక్కలు నాటగా ఈ ఏడాది జనవరి 4వ తేదీన మొదటి కాపు వచ్చింది. వెలుపల చేసే సాగులో 3 కిలోల దిగుబడి వస్తే.. ఈ సాగులో 5 కిలోల వరకు దిగుబడి వచ్చింది. ఇలా 30 టన్నుల వరకు పంట తీయడం జరుగుతుంది. అది కూడా పూర్తిస్థాయిలో సేంద్రీయ ఎరువులతోనే మరి.
బంతితో లాభాలు
పాలీ హౌజ్ , బయట పంటలు వేసే సమయంలో చుట్టూరా బంతి పూల సాగు చేస్తుంటారు. కానీ అవి ఎందుకు వేస్తారో కొందరికి తెలియదు. బంతిసాగుతో క్రిమికీటకాలు కూరగాయలు, ఆకు కూరల వైపు రాకుండా బంతి పూలు ఆకర్షిస్తాయి. దీని వల్ల పంటకు తెగులు రాదు. బంతి పూలను వేయడం వల్ల పంటలో నష్టం రాకుండా చేసుకోవచ్చు. -శృతి రెడ్డి, హార్టికల్చర్ ఆఫీసర్, సీఓఈ
అద్భుతమైన సాగు
ఇప్పటి వరకు చేసిన వ్యవసాయంతో లాభాలున్నప్పటికీ రైతులు అధిక దిగుబడి సాగిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రెడ్ షెడ్ నెట్ పంట సాగు ప్రయోగం చేశాం. మా ప్రయోగం వల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. శిక్షణకు వచ్చే ప్రతి రైతుకూ సాగు విధానాన్ని వివరిస్తున్నాం. ప్రభుత్వ సహకారంతో చేస్తున్న పరిశోధన సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉంది. సందేహాలు, సలహాల కోసం సీఓఈలో లేదా.., 7997724956 ఫోన్ నెంబర్ లో గానీ సంప్రదించవచ్చు. -రాజ్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్, సీఓఈ