బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది వీళ్లే..

by Anukaran |   ( Updated:2020-09-06 11:09:54.0  )
బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది వీళ్లే..
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొంది ప్రాంతీయ భాషల వరకు వ్యాపించి, తెలుగులో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ నాలుగో సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నాగార్జున వ్యాఖ్యాతగా ఈ కార్యక్రమం కొనసాగింది. 15 వారాల పాటు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా బిగ్‌బాస్ ఇంట్లో గడపబోయే ఒక్కొక్క కంటెస్టంట్‌ను నాగార్జున పరిచయం చేశారు.

ఈసారి కంటెస్టంట్ల విషయంలో చాలా వైవిధ్యత కనిపిస్తోంది. సినిమాలు, సీరియళ్ల నుంచి ఎక్కువ మందికి స్కోప్ ఇవ్వకుండా యూట్యూబ్, సోషల్ మీడియా, వార్తాఛానళ్ల ద్వారా పాపులర్ అయిన వారికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్లు కనిపిస్తోంది. ఇంతకీ ఆ కంటెస్టంట్‌లు ఎవరనే విషయం వారి ఎంట్రీ ఆర్డర్‌లో మీకోసం…

మొదటి కంటెస్టంట్‌గా సుడిగాడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి సినిమాల్లో నటించిన మోనాల్ గజ్జర్‌ను నాగార్జున ఆహ్వానించారు. తెలుగు మాట్లాడటానికి తడబడుతున్న ఈ గుజరాతీ పిల్ల, తెలుగు మాట్లాడకపోతే పనిష్మెంట్‌లు ఇచ్చే బిగ్‌బాస్ హౌస్‌లో ఎలా నెట్టుకొస్తుందో మరి! ఆమె తర్వాత సత్యం సినిమా డైరెక్టర్ సూర్య కిరణ్ ఎంట్రీ ఇచ్చారు. మూడో కంటెస్టంట్‌గా చీమ ఏనుగు జోకులతో ఫేమస్ అయిన యాంకర్ లాస్య ఇంట్లో అడుగుపెట్టారు.

తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నటించిన అభిజిత్ వచ్చారు. హౌస్‌లో ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇతనే అని నాగార్జున బాగానే హింట్లు ఇచ్చారనుకోండి అది వేరే విషయం. తర్వాత జోర్దార్ సుజాత, సోషల్ మీడియాలో ఫేమ్ అయిన మెహబూబ్ దిల్‌సే, టీవీ9 ట్రెండింగ్ యాంకర్ దేవీ నాగవల్లి, యూట్యూబర్ దేత్తడి హారికలు హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత తొమ్మిది, పదో కంటెస్టంట్‌లుగా ఎంట్రీ ఇచ్చిన సయ్యద్ సోహెల్, అరియానా గ్లోరీలను బిగ్‌బాస్‌హౌస్ పక్కనే ఉంచిన సీక్రెట్ హౌస్‌లోకి పంపించడం ఒక కొత్త కాన్సెప్ట్‌కు తెరదీయబోతున్నట్లు కనిపిస్తోంది.

పదకొండో కంటెస్టంట్‌గా కొరియోగ్రాఫర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్, ఆయన తర్వాత నటి కరాటే కల్యాణి, పదమూడో కంటెస్టంట్‌గా ర్యాపర్, సింగర్ నోయల్ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత నటి, మోడల్ దివి, టీవీ నటుడు అఖిల్ సార్ధక్ ఎంట్రీ ఇచ్చారు. చివరగా ఎంతోమంది ఊహించినట్లుగానే పదహారో కంటెస్టంట్‌గా, స్పెషల్ హౌస్‌మేట్‌గా గంగవ్వ ఎంట్రీ ఇచ్చింది. ఒక నలుగురు ఐదుగురు మినహా పెద్దగా పాపులర్ ఫేస్‌లు లేకపోవడం ఓ రకంగా నిరాశే కలిగిస్తోంది. మరి వీళ్లందరూ కలిసి ఎలాంటి రచ్చ చేస్తారో రానున్న వారాల్లో తెలిసిపోతుంది.

ఒక నలుగురు ఐదుగురు మినహా పాపులర్ ఫేస్ లు లేని ఈ సీజన్ లో.. పాపులర్ అయ్యేందుకు బిగ్ బాస్ ఇచ్చిన అవకాశాన్ని కంటెస్టెంట్ లు ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి మరి. కానీ ఇంటి సభ్యులను చూస్తే నెవర్ బిఫోర్ ఎంటర్టెన్మెంట్ ఇచ్చేందుకు మాత్రం రెడీగా ఉన్నట్లు అర్థం అవుతుంది. మరి బిగ్ బాస్ ఎలాంటి గేమ్స్ ప్లాన్ చేశాడు.. కరోనా టైమ్ కూడా లెక్క చేయకుండా స్టార్ట్ అయిన రియాలిటీ గేమ్ ఎంత సక్సెస్ అవుతుంది? తెలియాలంటే బిగ్ బాస్ హౌజ్ పై ఓ కన్నేయాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed