సారు వెళ్లారు.. వచ్చారు.. మళ్లీ వెళ్లి ఆ కండువే కప్పుకున్నారు..

by Shamantha N |
సారు వెళ్లారు.. వచ్చారు.. మళ్లీ వెళ్లి ఆ కండువే కప్పుకున్నారు..
X

కోల్‌కతా: దేశంలో ఎండల వేడి తీవ్రత ఇంకా మొదలుకాకున్నా.. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో మాత్రం రాజకీయ వేడి కాకరేపుతున్నది. సాధారణ సమయంలోనే ఒంటి మీద షర్ట్ తీసినంత తేలికగా పార్టీ కండువాలు మార్చే రాజకీయ నాయకులు ఉన్న ఈ రోజుల్లో.. ఎన్నికల టైం అంటే వారి హడావిడి అంతా ఇంతా కాదు. ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో వారికి కూడా తెలియదు. పశ్చిమబెంగాల్‌లో పేరు మోసిన రాజకీయ నాయకుడిగా ఉన్న ఎమ్మెల్యే జితేంద్ర తివారి కూడా ఏ రోజు ఏ పార్టీలో ఉంటున్నారో ఆయన అనుచరులకే అంతుచిక్కకుండా ఉంది.

వివరాల్లోకెళ్తే.. అసన్‌సోల్ జిల్లాలో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి చెందిన జితేంద్ర తివారి పండవేశ్వర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయ యవనికపై ఆయనో పేరు మోసిన నాయకుడు. కాగా.. బెంగాల్ లో కొద్దిరోజులుగా టీఎంసీ నుంచి చాలా మంది నాయకులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా బీజేపీలో చేరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జితేంద్ర తివారి కూడా గతేడాది డిసెంబర్‌ 18న టీఎంసీని వీడారు. ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినా.. తర్వాత ఒక్కరోజులోనే మళ్లీ టీఎంసీలోకి తిరిగి వచ్చారు. తాను తప్పు చేశానని కూడా సంజాయిషీ ఇచ్చుకున్నారు. బీజేపీలో చేరబోనని ప్రకటించారు. కానీ టీఎంసీలో ఉన్నా ఆయన ప్రచారానికి కూడా అంటీముట్టనట్టే ఉన్నారు. రెండు నెలల తర్వాత మళ్లీ టీఎంసీకి గుడ్ బై చెప్పి ఉన్నపళంగా బీజేపీ కండువా కప్పుకున్నారు.

హుగ్లీలో జరిగిన ఒక ఎన్నికల కార్యక్రమంలో బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ సమక్షంలో జితేంద్ర తివారి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే తనకు బలమున్న అసన్‌సోల్ లో కాకుండా హుగ్లీలో జరిగిన కార్యక్రమంలో బీజేపీలో చేరడం గమనార్హం. ఇదిలాఉండగా.. జితేంద్రను పార్టీలోకి ఆహ్వనించడాన్ని బీజేపీ సీనియర్ నాయకుడు, అసన్‌సోల్ ఎంపీ బబుల్ సుప్రియో వ్యతిరేకిస్తున్నారు. జితేంద్ర తివారి బొగ్గు కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై బీజేపీ కార్యకర్తలు కూడా కొంత అసంతృప్తిగానే ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed