కరోనాతో తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ కన్నుమూత

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ (64) కన్నుమూశారు. కరోనాతో ఇటీవలే చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతుండగా బుధవారం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన కుటుంబం మొత్తం ఇప్పుడు చెన్నైలోనే ఉంది. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో 1985లో రాజకీయాల్లోకి వచ్చిన బల్లి దుర్గప్రసాద్ తనదైన ముద్ర వేసుకున్నారు. 28ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాలుగు సార్లు (1985,1994,1999,2009) అసెంబ్లీకి, ఒకసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి తిరుపతి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. టీడీపీలో ఉన్న సమయంలో చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు.

ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి పట్ల సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, వైసీపీ, టీడీపీ శ్రేణులు ఆయన కుటుంబానికి సంతాపం తెలిపాయి. దుర్గాప్రసాద్ స్వస్థలం నాయుడుపేట మండలం భీమవరం. తల్లిదండ్రులు రామలక్ష్మమ్మ, పెంచలయ్య. దుర్గాప్రసాద్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement