ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం

by  |
ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం
X

దిశ, ఏపీ బ్యూరో: తొమ్మిది రోజుల పాటు జరిగిన తిరుమల శ్రీ‌వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడాళ్వార్ ఆహ్వానించిన దేవతలను తిరిగి సాగనంపే కార్యక్రమమే ధ్వజావరోహణం. తిరిగి వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా గరుడాళ్వార్ దేవతలను కోరతాడు. ఈ సందర్భంగా గరుడధ్యానం, భేరిపూజ, భేరితాడనం, గరుడగద్యం, దిక్పాలక గద్యం, గరుడ లగ్నాష్టకం, గరుడ చూర్ణిక అనే ఏడు మంత్రాలను అర్చకులు జపించారు. ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. అయిన మ‌హ‌ల్ ముఖ మండ‌పంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంత‌రం ప్రత్యేకంగా నిర్మించిన చిన్న పుష్కరిణిలో సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణీజలంలో స్నానం చేయించారు. ఈ ఉత్సవాలు చేసినవారికి, చేయించినవారికి, ఇందుకు సహకరించినవారికీ, దర్శించిన వారికీ ఈ ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుంది.

ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక యజ్ఞాంతంలో అవభృథ స్నానం చేస్తారు. యజ్ఞ నిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, అన్నీ సంపూర్ణ ఫలాలు చేకూరడం కోసం చేసే దీక్షాంతస్నానం అవభృథం. ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, చైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి, మండ‌లి స‌భ్యులు శేఖ‌ర్‌రెడ్డి, నిశ్చిత‌, శివ‌కుమార్‌, డీపీ అనంత పాల్గొన్నారు.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed