అతిచిన్న డైనోసార్ గుడ్లు.. కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు

డైనోసార్లు అనగానే పెద్ద పెద్ద ఆకారాలతో ఉండే జంతువులు మన మెదళ్లలో దర్శనమిస్తాయి. హాలీవుడ్ సినిమాల విజువల్ ఎఫెక్టుల పుణ్యమాని డైనోసార్ ఎలా ఉంటుందనే ఒక ఐడియా ఏర్పడింది. అయితే డైనోసార్లలో చిన్న డైనోసార్లు కూడా ఉంటాయనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. పెద్ద పెద్ద డైనోసార్ల అవశేషాల మధ్య ఈ చిన్న జీవుల అవశేషాలు కనుమరుగైపోయాయి. దీంతో వాటి గురించి పరిశోధన చేయడానికి ఎక్కువగా ఆధారాలు మిగల్లేదు. కానీ జపాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సుకుబా పరిశోధకులకు దొరికిన కొన్ని డైనోసార్ కాలం నాటి అవశేషాల్లో ఒక సెం.మీ. పొడవున్న చిన్న గుడ్ల శిథిలాలు దొరికాయి. దీన్ని బట్టి చిన్న డైనోసార్లు కూడా ఉన్నాయని, వాటి గురించి మరింత అధ్యయనం చేసే అవకాశం దొరికిందని ప్రొఫెసర్ కొహెయ్ తనాక తెలిపారు.

ఆగ్నేయ జపాన్‌లోని హ్యోగో ప్రదేశలో కమిటకీ ఎగ్ క్వారీలో ఈ గుడ్డు అవశేషం దొరికింది. క్రెటాషియస్ కాలానికి చెందిన ఈ సైటును 2015లో గుర్తించారు. 2019 నుంచి తవ్వకాలు మొదలుపెట్టి ఇప్పటివరకు ఇక్కడ 1300 డైనోసార్ గుడ్ల అవశేషాలను గుర్తించారు. వాటిలో అతి చిన్నది గత నెలలో దొరికినట్లు తనాక వెల్లడించారు. టాఫోనొమిక్ విశ్లేషణ ద్వారా తమకు దొరికిన గుడ్లు ఎక్కడి నుంచో కొట్టుకొచ్చినవి కావని, అవి చక్కగా పేర్చబడి ఉండటాన్ని బట్టి ఈ సైటులో ఒక చిన్న డైనోసార్ పెట్టినవని తేలినట్లు కొహెయ్ తనాక వివరించారు. ఇవి హిమియోలిథస్ మురాకమి అనే జాతికి చెందిన జంతువు గుడ్లని వారు కనిపెట్టారు.

Advertisement