తస్మాత్ జాగ్రత్త! ‘టిక్‌టాక్ ప్రో’ డౌన్‌లోడ్ చేయకండి

by  |
తస్మాత్ జాగ్రత్త! ‘టిక్‌టాక్ ప్రో’ డౌన్‌లోడ్ చేయకండి
X

దిశ, వెబ్‌డెస్క్ : చైనాకు సంబంధించిన టిక్‌టాక్ సహా.. మరో 58 యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇండియాలో కోట్లాదిమంది ఆదరణ పొందిన టిక్‌టాక్ బ్యాన్ కావడంతో.. దేశీ యాప్స్ హవా పెరిగింది. అయితే.. తాజాగా ‘టిక్‌టాక్ ప్రో’ అంటూ ఓ మెసేజ్ సోషల్ మీడియా వేదికల్లో, మెసేజింగ్ యాప్స్‌లో తెగ వైరల్ అవుతోంది. ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్ అయినప్పటికీ.. ‘టిక్‌టాక్ ప్రో’ అందుబాటులో ఉందంటూ డౌన్‌లోడ్ చేసుకుని మళ్లీ మీ వీడియోలు కంటిన్యూ చేయొచ్చని సైబర్ నేరస్థులు ఓ మెసేజ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఓపెన్ చేయద్దు. ఇలాంటి మెసేజ్ వస్తే ఎవరూ నమ్మొద్దు.

టిక్‌టాక్ నిషేధాన్ని.. స్కామర్స్ తెలివిగా తమ సైబర్ దాడులకు ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలో టిక్‌టాక్ యూజర్లను, నెటిజన్లను టార్గెట్ చేస్తున్న స్కామర్స్.. ఓ లింక్‌ను పంపిస్తున్నారు. ఈ లింక్ ఓపెన్ చేసి, ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే తిరిగి టిక్‌టాక్ వీడియోలు చేసుకోవచ్చంటూ.. వాట్సాప్, ట్విట్టర్‌లతో పాటు పలు మెసేజింగ్ యాప్స్‌లో మెసేజ్‌లు చేస్తూ.. సైబర్ దాడులకు పాల్పడుతున్నారు.

సదరు ఫేక్ మెసేజ్‌ను వాస్తవమనుకుని టిక్‌టాక్ ప్రో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే.. ఆ తర్వాత అది ఫోన్‌లోని కెమెరా, గ్యాలరీ, మైక్‌లతో పాటు మరికొన్నింటిని యాక్సెస్ చేసేందుకు పర్మిషన్స్ అడుగుతుంది. వాటిని యాక్సెప్ట్ చేసినట్టయితే ఇక అంతే.. ఆ టిక్‌టాక్ యాప్ వర్క్ చేయదు. కానీ, అది ఫోన్‌లోనే ఉండి.. సైబర్ క్రిమినల్స్‌కు కావాల్సిన సమాచారాన్ని అందిస్తుంది.

ఇలాంటి యాప్స్ సోషల్ మీడియా అకౌంట్లలో యూజర్ ఐడీలను హ్యాక్ చేస్తాయి. విలువైన ప్రైవసీ డేటాను దొంగిలిస్తాయి. సైబర్ దాడులకు పాల్పడి.. ఫోన్‌లో, డెస్క్, ల్యాప్‌టాప్‌లలో ఉన్న సమాచారాన్నంతా సేకరిస్తాయి. బ్యాంకు అకౌంట్ వివరాలు తెలిస్తే.. అందులోని డబ్బులను కూడా హ్యాకర్లు కాజేస్తారు. సో ఇలాంటి మెసేజ్‌లు వస్తే వెంటనే డిలీట్ చేయండి. టిక్‌టాక్ పేరుతోనే కాదు, ఇటీవల డిలీట్ చేసిన ఏ యాప్ పేరుతోనైనా మెసెజ్‌లు వచ్చినా.. వాటిని డిలీట్ చేయాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.


Next Story

Most Viewed