ఆశలు పెట్టుకుంటున్న టిక్ టాకర్లు

by  |
ఆశలు పెట్టుకుంటున్న టిక్ టాకర్లు
X

భారత్ – చైనా వివాదాల కారణంగా ఎక్కువగా నష్టపోయిన టిక్ టాకర్లు, ఎప్పటికైనా ఈ వివాదాలు సద్ధుమణిగి టిక్ టాక్ మళ్లీ తిరిగొస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు. నిషేధానికి గురై దాదాపు 15 రోజులు దాటినప్పటికీ వారు ఆ ట్రోమా నుంచి కోలుకోలేకపోతున్నారు. టిక్ టాక్‌ను పూర్తిస్థాయి ఉద్యోగంగా మలచుకుని నెలకు 3 నుంచి 4 లక్షలు సంపాదించినవారు, ఇప్పుడు కనీసం ఇంటి ఖర్చులకు కూడా సంపాదించుకోలేకపోతున్నందుకు బాధపడుతున్నారు. టిక్ టాక్‌కు ప్రత్యామ్నాయంగా రోజుకొక యాప్ విడుదలవుతున్నప్పటికీ ఆ యాప్ లోటును ఇవేవీ తీర్చలేకపోతున్నాయి. టిక్ టాక్ అనేది మూడేళ్లలో పాపులర్‌గా మారి మహానగరాల్లోనే కాకుండా, మారుమూల పల్లెలకు కూడా పాకడమే ఇందుకు కారణం.

వీడియోల మీద వీడియోలు చేస్తూ రోజంతా బిజీగా ఉన్న టిక్ టాకర్లు.. ఇప్పుడు ఖాళీగా ఉండలేక పిచ్చెక్కుతోందని అంటున్నారు. ఏ రకంగా చూసినా కూడా వేరే యాప్‌లు టిక్‌టాక్‌కు సరితూగడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. తెలుగులో ‘ఫన్‌బకెట్ భార్గవ్‌’గా పేరు పొందిన భార్గవ్ చిన్నపాడ.. ప్రస్తుతం తను ఖాళీగా ఉన్నానని, వివాదాలు పోయి టిక్‌టాక్ మళ్లీ వస్తేనే తన లాంటి వాళ్లకి మంచి రోజులొస్తాయని అంటున్నారు. 2018లో టిక్ టాక్‌లో వీడియో పెట్టడానికి భార్గవ్ దగ్గర స్మార్ట్‌ఫోన్ కూడా లేదు, వేరే వాళ్ల ఫోన్ తీసుకుని అందులో వీడియోలు తీసి అప్‌లోడ్ చేసేవాడు. టిక్ టాక్ నిషేధానికి ముందు వరకు నెలకు 4 లక్షలు సంపాదించుకున్నాడు. కానీ ఇప్పుడు తన టీమ్‌కు డబ్బులు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నానని భార్గవ్ అంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఫీచర్ వచ్చినప్పటికీ అది చాలా ఉన్నతమైన యాప్ కావడం వల్ల మారుమూల గ్రామాలకు చేరడం లేదని, అందుకే రీచ్ రావడం లేదని అంటున్నాడు.

గతంలో ఒక వీడియో తీసి ఇన్‌స్టాగ్రాం, టిక్ టాక్‌లో ఒకేసారి పోస్ట్ చేస్తే, ఇన్‌స్టాలో 50వేల వ్యూస్ వచ్చేవని, అదే టిక్ టాక్‌లో లక్ష దాటిపోయేవని టిక్ టాకర్లు అంటున్నారు. ఇక కొంతమంది టిక్ టాకర్లు మాత్రం తమ ఫాలోవర్లను ఎందులో పెంచుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నారు. టిక్ టాక్ లాంటి యాప్‌లు ఎన్నొచ్చినా దానికి సాటి రావని ముంబైకి చెందిన నిధి కుమార్ అంటున్నారు. ఏదేమైనా తమకు పూర్వవైభవం తిరిగి రావాలంటే టిక్ టాక్ తిరిగి రాక తప్పదని వారు అభిప్రాయపడుతున్నారు.



Next Story

Most Viewed