- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోతుల దారిపట్టిన పులులు
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో పులుల సంచారం రోజురోజుకు పెరిగిపోతోంది. దట్టమైన అడవుల్లో ఉండాల్సిన వన్యమృగాలు.. క్రమంగా జనార్యణంలోకి అడుగు పెడుతున్నాయి. గడిచిన ఆరు నెలల్లో పదుల సంఖ్యలో పులుల సంచారం ఘటనలు వెలుగు చూశాయి. ఇప్పటికే కోతులు అడవులను వదిలి గ్రామాల బాట పట్టాయి. ఇప్పుడు పులులు సైతం కోతుల దారిలోనే నడుస్తున్నాయి. కోతులతో అంత అపాయం లేకపోయినా.. మాంసాహారి అయిన పులులతో మనుషులకు, మూగ జీవాల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది.
పులి ఒక్కటే కాదు..
హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చల్, నాగర్ కర్నూల్, కొమరంభీం, ములుగు, తిరుపతి, విశాఖ, కర్నూలు, శ్రీకాకులం తదితర జిల్లాల్లో పులులు, చిరుతలు, ఏనుగులు, హైనాల సంచారం పెరిగిపోయింది. వీటితోపాటు నక్కలు, అడవి దున్నలు, జింకలు, నెమళ్లు అడవులను వదిలి గ్రామాల బాట పట్టాయి. అడవులు, గుట్టలు విస్తరించి ఉన్న జిల్లాల్లో వీటి సంచారం రోజురోజుకు పెరిగి పోతోంది. ఇప్పటి వరకు స్వేచ్ఛగా తిరిగిన ప్రజలు వీటి రాకతో భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఓ పులి దాడి చేస్తుందోనని వణికిపోతున్నారు. కొమరంభీం జిల్లాలో 15 రోజుల వ్యవధిలోనే ఇద్దరిని పులులు మట్టుపెట్టాయి. రంగారెడ్డి జిల్లాలో పదుల సంఖ్యలో మూగజీవాలను తినేశాయి.
మచ్చుకు కొన్ని ఘటనలు
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి మిథిలానగర్‌లోనూ చిరుత పులి గాండ్రించింది. గతేడాది జులై 31న తెల్లవారు జామున మిథిలానగర్‌లో స్థానికులు పులిని గుర్తించారు. అది స్థానికంగా ఓ అపార్ట్ మెంట్ లో దూరి పలువురి గాయపర్చింది. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాలంతరీ వద్ద అర్థరాత్రి సమయంలో రెండు ఆవులపై చిరుత దాడి చేసి తినేసింది. ఒకే నెలలో చిరుత అదే స్థలంలో రెండు సార్లు దాడికి పాల్పడింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో కొత్తపల్లి, మేడిపల్లి, నందివనపర్తి, తాడిపర్తి అటవీ ప్రాంతాల్లోకి చిరుత ప్రవేశించింది. పశువులపై, మేకల మంద పై దాడులకు పాల్పడింది. గత ఆరు నెలల నుంచి ఈ ప్రాంతంలో చిరుత దాడులు పెరిగాయి. మేకలు, దూడలను పొట్టనపెట్టుకుంటున్నాయి. మైలార్‌దేవ్‌పల్లి సమీపంలోని కాటేదన్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై మిట్ట మధ్యాహ్నం వరకు చిరుత పడుకుంది. కాలికి గాయం కావడంతో అది రోడ్డుపైనే ఉండిపోయింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దానికి పట్టుకునే క్రమంలో అది ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపర్చింది. ఇలా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పదుల సంఖ్యలో చిరుతల దాడులు కొనసాగాయి.
ఆంధ్రలోనూ దాడులే..
నాగర్ కర్నూల్ జిల్లాలోనూ చిరుత ఉరుకులు పరుగులు పెట్టించింది. నలమల్ల అడవి మన్ననూర్ దర్గ ప్రాంతంలో చిరుతపులి సంచరించింది. శ్రీశైలం అంతరాష్ట్ర రహదారి కావడంతో ప్రయాణికులు హడలిపోయారు. రాత్రి వేళలో ప్రయాణిస్తున్న ఓ కారుకు చిరుత అడ్డంగా వచ్చి రోడ్డుపై పడుకున్నది. ఈ ఘటనతో కొద్దిరోజులు ఆ హైవేపై రాత్రి ప్రయాణాలను ఫారెస్ట్ అధికారులు నిషేధించారు. సెప్టెంబర్ 15న కర్నూలు జిల్లా శ్రీశైలం బీసీ స్కూల్ ఆవరణలోకి చిరుతపులి దూరింది. మూడు రోజులుపాటు చిరుతపులి ఆ ప్రాంతంలో సంచరించినట్లు ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు. స్కూల్ ఆవరణలో పులి పాదముద్రలను సైతం అధికారులు గుర్తించారు. అర్ధరాత్రి కాంపౌండ్ వాల్ దాటుకుని స్కూల్ వరండాలోకి వచ్చిన చిరుత.. కుక్కపై దాడి చేసి రక్తం తాగి వెళ్లిందని స్కూల్ సిబ్బంది తెలిపారు. ఇటీవల నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోనూ పులులు స్థానికుల కంటపడ్డాయి.
తిరుమల వేంకటేశ్వరడి సన్నిధిలోనూ..
జూన్ 2న తిరుమల వీధుల్లో చిరుత సంచారించింది. తిరుమల వీధుల్లో చిరుత తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలకు చిక్కాయి. రింగ్ రోడ్డు, కర్ణాటక సత్రం ప్రాంతంలో రెండు రోజులపాటు చిరుత సంచరించింది. అధికారులు అప్రమత్తమై.. చిరుత సంచారంపై నిఘా పెట్టారు. కానీ చిరుత అధికారులకు చిక్కలేదు.
కుమ్రం భీం జిల్లాలో ఇద్దరు బలి
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి ఇద్దరిని మట్టుబెట్టింది. దహెగాం మండలం పెద్ద వాగు సమీపంలో దిగిడ గ్రామానికి చెందిన సిడాం విఘ్నేష్(21) అనే ఆదివాసీ యువకుడిపై పులి దాడి చేసి హతమార్చింది. పశువులను మేపడానికి వెళ్లిన డిగ్రీ చదివే విద్యార్థిపై దాడి చేసి చంపేసింది. ఆ ఘటన జరిగిన 15 రోజుల్లోనే పెంచికల్‌పేట మండలం కొండపల్లి గ్రామంలో పత్తి చేనులో తోటి కూలీలతో పత్తి ఏరుతున్న నిర్మల(15) అనే బాలికపై పెద్దపులి దాడి చేసి చంపేసింది. తాజాగా రుద్రారం దగ్గర అక్కడ పనిచేసే రైతులకు పెద్దపులి కనిపించింది. పులి తారసపడడంతో రైతులు భయంతో పరుగులు తీశారు.ఇలా జన వాసాల్లోకి వన్య మృగాలు ప్రవేశించి మూగజీవాలు, మనుషులపై దాడులు చేస్తూ హతమర్చుతున్నాయి.
మానవ తప్పిదమేనా..?
ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. తెలుగు రాష్ట్రాల్లో లెక్కకు మించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓవైపు అడువులు అంతరించడం.. మరోవైపు అడవుల్లో స్మగ్లర్లు విచ్చలవిడిగా వేట కొనసాగిస్తుండడంతో వన్య ప్రాణులు, మృగాలు జనవాసాల్లోకి వస్తున్నాయి. దీంతో మూగజీవాలు, మనుషులు ప్రమాదాల బారిన పడుతున్నారు. 24 గంటలు జనసంచారం, వాహనాల రద్దీ ఉంటే ప్రాంతాల్లోనూ పులులు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి. అపార్ట్ మెంట్లు, ఇళ్లపై సంచరిస్తున్నాయి. మనిషి రక్తం కోసం మాటు వేసి చూస్తున్నాయి. అధికారులకు సమాచారం ఇస్తున్నా.. వాళ్లు తేరుకునే సరిగా జరగాల్సిన నష్టం జరుగుతోంది. ఇప్పటికైనా పులుల సంచారం ఎక్కువగా ఉన్న జిల్లాలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది.