‘క్వారంటైన్‌ చేసి కనెత్తి చూడలేదు’

by Anukaran |   ( Updated:2020-09-03 00:06:54.0  )
‘క్వారంటైన్‌ చేసి కనెత్తి చూడలేదు’
X

దిశ, అచ్చంపేట : మొన్నటి వరకు ఆ గ్రామం అంతా ప్రజలతో కళకళలాడుతూ కనిపించేంది. రోడ్లన్నీ గ్రామస్తులతో సందడిగా కనిపించేది. కానీ ఒక్కసారిగా కరోనా ఆ ఊరిని కమ్మేసింది. ఫలితంగా గ్రామస్తులు ఇండ్లకే పరిమితమయ్యారు. అడుగు బయటపెడితే ఎవరి నుంచి వైరస్ సోకుతుందో తెలియని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. కనీసం నిత్యావసర సరుకులు సైతం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకీ ఆ గ్రామం పేరేంటి? అది ఎక్కడుంది అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం తుర్కపల్లి ఇది ఒక చిన్న గ్రామం. అయినా, ఈ గ్రామంలో కరోనా పంజా విసురుతోంది. ఇక్కడ 181 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. గ్రామ జనాభా సుమారు 800. మొన్నటి వరకు సందడిగా ఉన్న ఆ ఊరు ఇప్పుడు కళతప్పింది. ఈ గ్రామానికి చెందిన ఐదు మందికి మొదటగా కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో ఇద్దరికి పాజిటివ్ అని తేలింది.
అప్రమత్తమైన వైద్యులు గ్రామంలో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసి నాలుగు రోజుల పాటు 270 మందికి కరోనా టెస్టులు చేశారు. రిపోర్టుల్లో 61 మందికి కరోనా వైరస్ సోకినట్టు వెల్లడైంది. దీంతో గ్రామంలోని ప్రజలు బయట అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు. ఎవరి ద్వారా వైరస్ సోకుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బాధితులు అందరూ హోం ఐసొలేషన్‌లో ఉండాలని వైద్య సిబ్బంది చెబుతున్నారు. కానీ ఒకరిద్దరు మాత్రం గ్రామంలో తిరుగుతూ అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నారు.

పట్టించుకోని ఉన్నతాధికారులు:

గ్రామంలో కరోనా విలయతాండవం చేస్తున్నా.. తమను ఆదుకునేందుకు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ సోకిన వారి కోసం ప్రత్యేకంగా ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇటీవలే కలెక్టర్ శర్మన్ పర్యటించినా.. సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

కేవలం డాక్టర్ అరుణ సమక్షంలో వైద్య పరీక్షలు చేసి ప్రజలకు తగిన సూచనలు చేస్తున్నారే తప్ప.. మిగతా అధికారులు కనీసం కన్నెతైనా చూడటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ప్రత్యేక చొరవ తీసుకొని బాధితులకు అండగా నిలవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గ్రామాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించడంతో గ్రామానికి చెందిన వారు అత్యవసర పరిస్థితుల నిమిత్తం మండల కేంద్రానికి, పలు గ్రామాలకు వాళితే వారిని కొందరు అంటరానివారిగా చులకనగా చూస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.

చిన్న నివాసాలే..

ఈ గ్రామంలో దాదాపు అందరివీ చిన్న నివాసాలే. వైరస్ సోకిన వారు హోం ఐసొటేషన్‌లో ఉండాలంటూ వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. కానీ వైరస్ సోకిన వారిని ప్రత్యేకంగా ఉంచడానికి ఆ ఇండ్లల్లో సపరేట్ గదులు లేవు. ఫలితంగా అందరూ ఒకే చోట ఉండటం వల్ల పాజిటివ్ వచ్చిన వ్యక్తి నుంచి అతని కుటుంబసభ్యులకు వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇక్కడ నివసించే వారిలో సుమారు 98 శాతం వరకు దళిత సామాజిక వర్గానికి చెందిన వారే.

నిత్యావసర సరుకులు దొరకడం లేదు

వారం రోజులుగా గ్రామంలో నిత్యావసర సరుకులు దొరక్క గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతు న్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకొని తమ గ్రామాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

అధికారులు స్పందించాలి :ఆలూరి కర్ణబాబు, ఉపసర్పంచ్, తుర్కపల్లి

గ్రామంలో ఆందోళన పరిస్థితులు నెలకొన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. గ్రామం చిన్నదే అయినా సమస్య మాత్రం పెద్దదని ఇలాంటప్పుడే అందరికీ అండగా నిలవాలి. కరోనా సోకిన వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించకపోతే బాధితులతో కలిసి ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తాం.

Advertisement

Next Story

Most Viewed