టిక్ టాక్ తరహాలో మరో యాప్

by Harish |
టిక్ టాక్ తరహాలో మరో యాప్
X

దిశ, ఫీచర్స్: భద్రతా ప్రమాణాల దృష్ట్యా భారత్‌లో నిషేధించిన చైనా యాప్స్ లిస్టులో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన టిక్‌టాక్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఈ చైనా యాప్‌ను తలదన్నేలా భారత్‌లో పలు దేశీ యాప్‌లు రూపొందినా అవి అంతగా పాపులర్ కాలేకపోయాయి. ఈ క్రమంలోనే టిక్‌టాక్ మాదిరి యాప్‌ను తయారు చేసిన ముగ్గురు అస్సాం స్టూడెంట్స్.. ‘టిప్ టియాపి (Tip Teapi)’గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.

అస్సాంలోని దిబ్రుగర్‌కు చెందిన సరస్వతి కొటొకి, అమర్‌జ్యోతి గౌతమ్, హిమంగ మధుకల్య ఎంసీఏ(MCA) హోల్డర్స్. జొర్హాట్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకునే రోజుల నుంచే వీరు ముగ్గురు ఏదైనా నూతన ఆవిష్కరణ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 2019లో చదువు పూర్తికాగానే స్టార్టప్ ప్రారంభించి, చిన్న చిన్న ప్రాజెక్టులు చేయటం మొదలుపెట్టారు. ఇక కొవిడ్ పాండమిక్ టైమ్‌లో టిక్ టాక్ బ్యాన్ కావడంతో దానికి ప్రత్యామ్నాయంగా కొత్త యాప్ రూపకల్పనకు సిద్ధమయ్యారు. తమ ఇంజినీరింగ్ కాలేజీ సీనియర్ల సహకారంతో 6 నెలల పాటు శ్రమించి యాప్‌ తయారు చేసి, జొర్హాట్ ప్రెస్ క్లబ్‌లో ఇటీవలే లాంచ్ చేశారు. యాప్‌లో యూజర్లు తమ టాలెంట్‌ను ప్రదర్శించేందుకు వీలుగా ఫన్, కుకింగ్, డ్రామా, మ్యూజిక్, ఆర్ట్, సైన్స్, ఎడ్యుకేషన్.. ఇలా మొత్తం 12 కేటగిరీలు ఏర్పాటు చేశారు. టిక్ టాక్ మాదిరి ఇందులో ఇతురులతో ఫ్రెండ్స్ కావొచ్చు. వారి వీడియోను ఫాలో, లైక్, షేర్ చేసుకోవచ్చు. యూజర్లు అప్‌లోడ్ చేసిన వీడియోలను అందరూ చూడొచ్చు.

కాగా యాప్‌లో అభ్యంతరకర కంటెంట్ గురించి ఎవరైనా రిపోర్ట్ చేస్తే వెంటనే వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని యాప్ మార్కెటింగ్, లీగల్, హెచ్‌ఆర్ ఇన్‌చార్జి సరస్వతి తెలిపారు. ‘టిప్ టియాపి’ యాప్ మేకింగ్‌లో హిమంగ డాటాబేస్ అండ్ సర్వీస్ ఇంజినీర్‌గా, అమర్‌జ్యోతి చీఫ్ ప్రొడక్ట్ ఇంజినీర్‌గా వర్క్ చేశారు.

Advertisement

Next Story