బిల్లు కట్టలేదని.. బాలికకు ఆపరేషన్ చేసి కుట్లు వేయని వైద్యులు.. చివరకు!

by Shamantha N |   ( Updated:2021-03-06 11:12:32.0  )
బిల్లు కట్టలేదని.. బాలికకు ఆపరేషన్ చేసి కుట్లు వేయని వైద్యులు.. చివరకు!
X

దిశ, వెబ్‌డెస్క్ : మనిషి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన డాక్టర్లు నిండు ప్రాణాలను హరిస్తున్నారు. కాసుల వేటలో పడి రోగుల ప్రాణాలను గాలికొదిలేస్తున్నారు. ఆస్పత్రి బిల్లు చెల్లించలేదనే కారణంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి చికిత్స అందించకపోవడం, ఆపరేషన్ చేయకుండా బాధిత కుటుంబసభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డబ్బుల ఆర్జనే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల తీరుతో అటు వసతులు సరిగా లేక ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లలేని వారు చుక్కలు చూస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. కొన్ని సందర్భాల్లో బిల్లు చెల్లించలేదని డెడ్‌బాడీని సైతం బాధిత కుటుంబసభ్యులకు అందజేసేందుకు ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలు నిరాకరించిన ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా ఓ ఆస్పత్రి నిర్వాకం వలన మూడేండ్ల బాలిక ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

యూపీలోని ప్రయాగ్ రాజ్‌కు చెందిన మూడేండ్ల బాలిక కడుపునొప్పితో స్థానికంగా ఉన్న యునైటెడ్ ఆస్పత్రిలో చేరింది. 15రోజుల అబ్జర్వేషన్ తర్వాత వైద్యులు ఆమెకు ఆపరేషన్ నిర్వహించారు. అయితే, ఆస్పత్రి బిల్లు రూ.5లక్షలు చెల్లించని కారణంగా ఆమెకు కుట్లు వేసేందుకు వైద్యులు నిరాకరించినట్లు తెలుస్తోంది. బాలికను అలాగే ఇంటికి పంపించడంతో ఆమె మృతి చెందినదని బంధువులు ఆస్పత్రి ఎదుట తీవ్ర ఆందోళన చేపట్టారు. ప్రసార, సోషల్ మీడియా మాద్యమాల ద్వారా యునైటెడ్ ఆస్పత్రి వైద్యుల నిర్వాకం వైరల్ కావడంతో NCPCR (The National Commission for Protection of Child Rights) వేగంగా స్పందించింది.

ఈ ఘటనపై ఎసీపీసీఆర్ ప్రయాగ్ రాజ్ కలెక్టర్‌కు లేఖ రాసింది. ఈ కేసుపై విచారణ జరపాలని, సంబంధిత ఐపీసీ సెక్షన్ల కింద FIR నమోదు చేయాలని, వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరింది. అంతేకాకుండా, బాధిత కుటుంబానికి నష్టపరిహారం కూడా అందించాలని పేర్కొంది. 24 గంటల్లోపు ఏ చర్యలు తీసుకున్నారో నివేదికను సమర్పించాలని ఆదేశించింది. బాలిక మృతిపై విచారణ జరిపేందుకు జిల్లా మేజిస్ట్రేట్‌‌తో ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. నివేదికను డిస్టిక్ మెడికల్ ఆఫీసర్‌కు అందజేయనున్నారు. ఈ కేసులో విచారణ ప్రారంభం కాగా, మృతదేహానికి శనివారం పోస్టుమార్టం నిర్వహించారు.

ఆస్పత్రి వర్గాల వివరణ..

బాలిక కడుపునొప్పితో 15 రోజులు యునైటెడ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. ఆమె ఆరోగ్యం మరింత దిగజారడంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి కుట్లు కూడా వేశారు. బాధితులు పేదలు అని తెలియడంతో వారినుంచి ఎలాంటి డబ్బు వసూలు చేయలేదు. ఆపరేషన్ అనంతరం ఆమె ఇంకా కోలుకోకపోవడంతో మెడికల్ కాలేజీకి తరలించారు. మరుసటి రోజు కుటుంబ సభ్యులు ఆమెను అక్కడి నుండి బయటకు తీసుకువెళ్లారు. మరెక్కడైనా ఆమెను చూపించినప్పుడు అక్కడి వైద్యులు కుట్లను విప్పి ఉండవచ్చును. అంతేకానీ మా ఆస్పత్రి వైద్యులు ఎలాంటి తప్పు చేయలేదని యునైటెడ్ హాస్పిటల్స్ గ్రూప్ వైస్ చైర్మన్ సత్పాల్ గులాటి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed