ముగ్గురు మావోలు అరెస్ట్.. విప్లవ సాహిత్యం స్వాధీనం

by  |
ముగ్గురు మావోలు అరెస్ట్.. విప్లవ సాహిత్యం స్వాధీనం
X

దిశ, మహబూబాబాద్:
ముగ్గురు మావోయిస్ట్ మిలిటెంట్లను అరెస్ట్ చేసి 414 తూటాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. దుబ్బగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని మామిడిగూడెం, మిర్యాలపేటకు చెందిన బండి సుధాకర్ అలియాస్ అశోక్, కల్తీ సమ్మయ్య, పోలేబోయిన సారయ్య కొంతకాలంగా నిషేధిత మావోయిస్టు పార్టీకి సహకరిస్తూ, బియ్యం కిరాణం సామాను చేరవేస్తున్నారు.

ముగ్గురు మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీకి చెందిన యాపనారాయణ అలియాస్ హరిభూషణ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్, కుర్సం మంగు అలియాస్ భద్రు, మడకం సింగ్ అలియాస్ అనిత, శాంతి, కర్ణాకర్ అలియాస్ క్రాంతి, కొవ్వాసి గంగ అలియాస్ మహేష్, వెట్టి బీమా,యాలం నరేందర్ అలియాస్ సంపత్ కొంతమంది మావోయిస్టు పార్టీ ముఖ్యనాయకులకు సహకరిస్తున్నారు. బండి సుధాకర్ 2003లో ఓ టీడీపీ నాయకున్ని హతమార్చాలని దళంతో కలిసాడని, 2009లో మావోయిస్టులు ఇచ్చిన ఆయుధాలు అతని వద్ద దొరికాయన్నారు.

సుధాకర్‌పై కొత్తగూడ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. కల్తీ సమ్మయ్య గతంలో లింగాల గ్రామ సర్పంచ్‌గా పనిచేశాడని తెలిపారు. ఇదే సమయంలో జనశక్తిలోనూ పనిచేశి, గొత్తికోయలను పురమాయిస్తూ మావోయిస్టులకు సహకరించాడని అన్నారు. వీరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎలాంటి భయబ్రాంతులకు గురికావొద్దని, పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటారని ధైర్యం చెప్పారు. ప్రజల సహకారంతో మావోయిస్టుల కార్యకలాపాలు అణిచివేస్తామని ఎస్పీ కోటిరెడ్డి స్పష్టం చేశారు.


Next Story

Most Viewed