- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యాక్షన్‌కు రెడీ!.. త్రివిధ దళాలు హై అలర్ట్
దిశ, సెంట్రల్ డెస్క్: డ్రాగన్ దేశం బుసలు కొడుతోంది. ఒకవైపు శాంతి అంటూనే మరోవైపు తిరకాసు పెడుతోంది. కవ్వింపు చర్యలకు దిగుతూనే తప్పు మీదేనని ఆరోపిస్తోంది. బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. ఇరుదేశాల మధ్య ఒప్పందాలకు అనుగుణంగా శాంతిని పునఃస్థాపించాలని చెబుతూనే ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతం నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవడం లేదు. వెనక్కి మళ్లాలని చెప్పేందుకు వెళ్లిన దేశ సైనికులపై చైనా దాడి చేసింది. డ్రాగన్ జిత్తులకు అనుగుణంగా భారత్ దీటుగా స్పందించింది. పొరుగుదేశ సంక్షేమాన్ని కోరుకుంటాం కానీ, ఇండియాకు ప్రమాదకారిగా మారితే ఉపేక్షించేది లేదని ప్రధాని మోడీ హెచ్చరించారు. ప్రస్తుత కఠిన పరిస్థితుల్లోనూ తగిన రీతిలో జవాబు ఇచ్చే సామర్థ్యం భారత్‌కు ఉందని గుర్తుచేశారు. అందుకు అనుగుణంగానే చైనా సరిహద్దుల్లో త్రివిధ దళాలను హై అలర్ట్ చేశారు. ఏ క్షణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలిచ్చారు.
సరిహద్దు పొడువునా హై అలర్ట్
భారత్, చైనా సరిహద్దులో జరిగిన హింసాత్మక ఘర్షణలతో పరిస్థితులు క్షణక్షణానికి ఊహించని విధంగా మారుతుండటంతో భారత రక్షణ దళాలు అప్రమత్తమయ్యాయి. యుద్ధ సన్నద్ధతను పాటిస్తున్నాయి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్‌తో హై లెవనల్ మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత భారత ఆర్మీ, నేవీ, వైమానిక దళాలకు అలర్ట్‌గా ఉండాలనే సంకేతాలు వెళ్లడం గమనార్హం. చైనాతో సరిహద్దు వెంబడి ఆర్మీ, వైమానిక దళాలు మోహరించాయి. ఎటువంటి ఘటనలు ఎదురైనా ప్రతిదాడులకు సంసిద్ధంగా ఉండాలని చైనాతో ఉన్న సుమారు 3,500 కిలోమీటర్ల పొడువు సరిహద్దులోని రక్షణ దళాలకు హై అలర్ట్ సంకేతాలను ప్రభుత్వం జారీ చేసింది. భారత నదీ జలాల్లోకి తరుచూ చైనా నేవీ దూసుకొస్తున్న ప్రాంతాల్లో ఇండియా నావికా దళం మరింత అప్రమత్తమయ్యింది. నావికా దళాలు అదనంగా మోహరించి చైనా దళాలకు గట్టి హెచ్చరికలు పంపే యోచనలో ఉన్నట్టు సమాచారం. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లడాఖ్‌లలో చైనా సరిహద్దు గుండా భారత ఆర్మీ అదనపు బలగాలను మోహరింపజేస్తున్నట్టు సమాచారం అందింది. వైమానిక దళాలూ హై అలర్ట్‌లో ఉండి ఎల్ఏసీపై డేగ కన్నేసినట్టు సంబంధితవర్గాలు తెలిపాయి.
ఘర్షణలు.. చైనా ప్రీప్లాన్‌గా చేసినవే: భారత్
చైనా విదేశాంగ శాఖతో బుధవారం కేంద్ర మంత్రి ఎస్. జయశంకర్ మాట్లాడుతూ ఆ దేశానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. గాల్వన్ జరిగిన ఘర్షణలకు ఒక ప్రణాళిక ప్రకారం చేసినవేనని భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్ అన్నారు. చైనా ప్రీప్లాన్‌గా చేసిన దాడులేనని తెలిపారు. గాల్వన్ హింసాత్మక ఘర్షణలకు చైనానే బాధ్యత వహించాలని ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ చెప్పారు. ఈ హింసాత్మక అల్లర్లు భవిష్యత్తులో ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని వేస్తాయని హెచ్చరించారు. ప్రస్తుతం జరిగిన ఘటనలను చైనా సమీక్షించుకోవాలని సూచించారు. తప్పులను సరిదిద్దుకునేందుకు పూనుకోవాలన్నారు. అలాగే, చైనా సైన్యం కచ్చితంగా వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ని గౌరవించాలని, సరిహద్దుపట్ల ఉన్న ఒప్పందాలను తప్పక పాటించాలని సూచించారు. ఇవన్నీ హెచ్చరిస్తూనే చైనాతో శాంతిపూర్వకంగా మెలిగేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
కవ్వింపు చర్యలను చూస్తూ ఊరుకోం
సరిహద్దు ఘర్షణలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. పొరుగు దేశ సంక్షేమాన్ని కోరుకుంటాం కానీ, భారత్‌కు ప్రమాదకారిగా మారితే, దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగే పరిస్థితులుంటే మాత్రం ఉపేక్షింబోమని హెచ్చరించారు. ప్రస్తుతం కఠిన పరిస్థితుల్లోనూ తగిన రీతిలో జవాబిచ్చే సామర్థ్యం భారత్‌కు ఉన్నదని గుర్తుచేశారు. భారత్‌ను తప్పుగా తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు. అలాగే, హింసాత్మక ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల మరణాలు వృథాగాపోవని పరోక్షంగా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలనిచ్చారు. కాగా, వీర జవాన్ల మరణాలతో యావత్ దేశం అట్టుడికిపోయింది. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి అండగా నిలుస్తూ భవిష్యత్ కార్యచరణకు మద్దతు ఇవ్వనున్నట్టుగా సూచనలు చేశాయి.
ఇండియా సైనికులతే తప్పు: చైనా
భారత విదేశాంగ శాఖతో ఈ అల్లర్లపై చైనా కూడా కటువుగానే స్పందించింది. హింసాత్మక ఘర్షణలకు భారతే కారణమని మరోసారి ఆరోపించింది. భారత సైనికులే బార్డర్ దాటి వచ్చారని, ఘటన జరిగిందే చైనా వైపున అని చెప్పుకొచ్చింది. ఈ ఘర్షణలపై దర్యాప్తు జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని సూచించింది. ఈ ఘర్షణలు ఇరుదేశాల మధ్యనున్న ప్రాథమిక సంబంధాలను భంగపరుస్తున్నాయని తెలిపింది. ప్రస్తుత పరిస్థితులను తప్పుగా అంచనా వేయొద్దని పేర్కొంది. చైనా తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు వెనకాడబోదని తెలిపింది. చైనాను ఎట్టిపరిస్థితుల్లో తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించింది. అయితే, ఇరుదేశాల విదేశాంగ మంత్రులు పరిస్థితులు సద్దుమణిగేందుకే ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
వార్‌కు రెడీగా ఉండండి: మాజీ ఆర్మీ చీఫ్
చైనా కావాలనే కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని, దానికి దీటుగా జవాబిచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉండాలని ఆర్మీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. డ్రాగన్ కుట్రలను ఎదుర్కొనేందుకు రక్షణ దళాలు సన్నద్ధమవ్వాలని సూచిస్తున్నాయి. పరిస్థితులు ఊహించని విధంగా ఉన్నాయని, ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చు కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకొవడం మంచిదని అభిప్రాయపడ్డాయి. త్వరలో ఏర్పడబోయే చిన్నపాటి యుద్ధానికి భారత్ సిద్ధమవ్వాలని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ శంకర్ రాయ్ చౌదరి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఇది 1962లోని భారత్ కాదన్న విషయం గుర్తుంచుకోవాలని చెబుతూ.. చైనాతో చిన్నపాటి యుద్ధానికి దేశం సిద్ధమవ్వాలని అన్నారు.