తిరిగి రావడంలేదు.. ఆ ముచ్చటే ఇప్పుడు చర్చనీయాంశమైంది

by  |
తిరిగి రావడంలేదు.. ఆ ముచ్చటే ఇప్పుడు చర్చనీయాంశమైంది
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టించడమే కాదు.. పల్లెకు కొద్దిపాటి కళను తెచ్చిందనేది కాదనలేని వాస్తవం. బాధ్యతలను గుర్తుచేయడంతో పాటు బంధాలను బలపరచడంలోనూ ఈ లాక్‌డౌన్ బలమైన పాత్రను పోషించింది. రణగొణ ధ్వనుల నడుమ ఊపిరి సలపని పనులతో యాంత్రికంగా మారిన జీవితాలకు మళ్లొక్కసారి పాతరోజులను గుర్తుచేసింది. సంతోషమన్న పదాన్నే మరిచి, ఏదో తెలియని తాత్విక చింతనలో బతుకుతున్న దేహాలపై కొత్త వెలుగును ప్రసరింపజేసింది. పట్నం కష్టాలు పడలేక ఊరికి ఈ ఏడు పోదాం.. మళ్లొచ్చే ఏడు పోదాం.. అంటూ వెనక్కి లాగిన సమస్యలకు కరోనా బ్రేక్ వేసింది. ఇక ఏదున్నా.. పల్లె ఒడిలోనే అనే కథకు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇన్నిరోజులు పట్నం మెరుపుల నడుమ చిన్నబోయిన పల్లె.. నేడు మండు వేసవిలోనూ చల్లటి నీడనిస్తూ పట్నం గాయాలకు మందురాసే ప్రయత్నం చేస్తోంది.

‘మనోరోగానికి మందులేదనేది’ పెద్దలు చెప్పే మాట. అందుకే కాబోలు పల్లెల్లో నిత్యం మందుబిల్లలతో కాలమెల్లదీసే ముసలవ్వలు.. తమ మనుమలు, మనవరాళ్లను కళ్లముందున్నారనే ఆనందంతో వారి రోగాలన్నీ రాజీపడ్డాయి. కరోనా తెచ్చిన లాక్‌డౌన్‌తో పట్నం అంతా షట్‌డౌన్ అయింది. డ్రైవర్ల నుంచి సాఫ్ట్‌వేర్ దాకా పనులన్నీ బంద్ అయినయ్. కొందరికి వర్క్ ఫ్రమ్ హోం అవకాశమొచ్చింది. పట్నంలో కరోనా భయంతో నిత్యం భయపడే కంటే ఊర్లనే కలో గంజో తాగుదామంటూ తట్టాబుట్టా సదురుకొని వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌లో పల్లెకు వెళ్లిన అనేక కుటుంబాలు తిరిగి రావడం లేదు. ఆ ముచ్చటే ఇప్పుడు చర్చనీయాంశమైంది. రెండు నెలల లాక్‌డౌన్ టైమ్‌లో.. పట్నం కంటే పల్లె చాలా ఉత్తమమైందని గుర్తించారు. గ్రామాల్లోనే సుస్థిరాభివృద్ధి సాధ్యమని తేలింది. పండించిన పంట ఎంత కష్టం నుంచి వచ్చిందో నేర్పింది. జీవన దృక్పథాన్ని మార్చేసింది. అందుకే మొన్నటి వరకు ఊరొద్దని పేచీ పెట్టి, భర్తలపై ఒత్తిడి తీసుకొచ్చిన మహిళలు కూడా నేడు పల్లెల్లోనే ఆరోగ్యముందంటూ తిరుగు వలసలకు సై అంటున్నారు. పిల్లల చదువులు, ఉద్యోగం, సంపాదనే లక్ష్యంగా పట్నమొచ్చిన చాలా కుటుంబాలు ఆరోగ్య రక్షణకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. విద్యావంతులు కూడా మొన్నటి వరకు హైదరాబాద్ లో ప్రైవేటు కొలువుల్లో ఇబ్బంది పడ్డవారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వారంతా ఇప్పుడు పల్లె చౌరస్తాల్లో కనిపిస్తున్నారు. కొందరైతే కొత్తగా ఉపాధి హామీ పనులు చేయడంలోనూ ఆనందాన్ని వెతుక్కుంటున్నారు.

సాంఘిక జీవనమే పరిష్కారం

కరోనాతో సిటీలోనే భయమెక్కువ. అంతేకాదు పట్నంలో వ్యక్తిని వ్యక్తిగా కూడా చూడరు. అదే ఊళ్లల్లో పెనవేసుకున్న సాంఘిక జీవనంతో ప్రతీ మనిషి మధ్య అనుబంధం నెలకొని ఉంటుంది. ఏ ఒక్కరికి ఆపదొచ్చినా నలుగురు ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే 30 నుంచి 40 శాతం మంది అధిక సంపాదనను ఇప్పుడు అనివార్యంగా చూడడం లేదు. సర్దుబాటు జీవనానికే అలవాటు పడుతున్నారు. అందుకే చాలా మంది సొంతూళ్లోనే వ్యాపారానికి సిద్ధపడుతున్నారు. ఆటో డ్రైవర్లు, చిరుద్యోగాలు, ప్రైవేటు రంగంలో యజమానికి రోజూ చస్తూ భయపడి ఉద్యోగం చేసేవారు ఊరి వైపు వడివడిగా అడుగులేస్తున్నారు. పట్నంలో వారుండే అపార్టుమెంటులో ఏ ఒక్కరికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినా పొరుగు వారంతా వారి సొంతూర్లకు వెళ్లిపోతున్నారు. తాజాగా లింగోజిగూడలోని 60 ఫ్లాట్లు కలిగిన అపార్టుమెంటులో ఓ పోలీసు అధికారి కుటుంబానికి నిర్ధారణ అయ్యింది. అంతే.. దాదాపు సగం ఫ్లాట్లు ఖాళీ అయ్యాయి. కరోనా వైరస్ కుదుటపడే వరకు తిరిగి వచ్చేందుకు ఇష్టపడడం లేదు.

ఆర్గానిక్ సాగుకు జై కొట్టిన బాలరాజు: ఆవుల బాలరాజు, యాదాద్రి జిల్లా, పోచంపల్లి మండలం, జగత్‌పల్లి.

1991లోనే నగరానికొచ్చి రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించా. హయత్‌నగర్‌లో సొంతిల్లు కూడా కట్టుకున్నాను. డబ్బు సంపాదనే లక్ష్యంగా బతికిన నాకు కరోనా లాక్‌డౌన్ టైమ్ ఊరును గుర్తుచేసింది. దీంతో నగరాన్ని వదిలేసి సొంతూరుకు షిఫ్టయ్యాను. నాకున్న పొలంలో ఆర్గానిక్ వ్యవసాయంతో పాటు ఆవులను పెంచేందుకు సిద్ధమవుతున్నాను. ఇక్కడే మనశ్శాంతిగా ఉంది. ‘గోశాల ద్వారా నలుగురికి సేవ చేయాలనుకుంటున్న. పల్లెటూరు కన్నతల్లి వంటిది. లక్షలు సంపాదించినా సంతృప్తి లేదు. లక్షణంగా బంధుమితృల మధ్య గడుపుతూ జీవనం కొనసాగించాలని నిర్ణయించుకున్నా.

బెంగుళూరు నుంచి సొంతూరికి: బండి శ్రీనివాస్, నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం లోయపల్లికి

బెంగుళూరులో చాలా కాలం పాటు ఎలక్ట్రికల్ కాంట్రాక్టరుగా పని చేశా. లాక్‌డౌన్‌లో చాలా ఇబ్బంది ఎదుర్కొన్నా. ఎంత సంపాదించినా భయం భయంగా గడిపిన జీవితం కంటే సొంత మనుషుల మధ్య పని చేయడమే మంచిదని, తండ్రి జంగయ్య పిలుపు మేరకు తట్టా బుట్టా సర్దుకొని వచ్చేశాను. ఇప్పటి దాకా అలవడని వ్యవసాయం నేర్చుకుంటున్నాను. అంతేకాకుండా వారసత్వంగా వచ్చిన గీతవృత్తిని చేపట్టేందుకు సిద్ధమయ్యాను. ‘బెంగుళూరులో ఉన్నన్ని రోజులు ఎక్కడో పరాయి ప్రాంతంలో ఉన్నట్లు అనిపించింది. ఇప్పుడు హాయిగా ఉంది.

ఆరోగ్యం కోసం ఊరికి పయనం: పి. రమణారెడ్డిది వినాయక్ నగర్

చాలా ఏండ్ల కిందటే నగరంలో స్థిరపడ్డాం. మాకు ఆర్థికంగా ఏ ఇబ్బందీ లేదు. కరోనా వైరస్ దెబ్బకు ఊరిలోనే సొంతంగా వ్యవసాయం చేయించుకోవడం మంచిదని నిర్ణయానికి వచ్చా. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పల్లెలే మేలని స్పష్టమైంది. కాలుష్యం, జనాభా, ట్రాఫిక్ రద్దీ. ఇన్ని నగరంలో ఉండటం కంటే సొంతూరే మేలనిపించింది. ఇక్కడైతే కరోనా వైరస్ భయం లేదు. హాయిగా ఉండొచ్చు. సంపాదన కంటే ఆరోగ్యమే ప్రధానం కదా.

వాడకట్టతో సమిష్టితత్వం: ఎండీ డా.రమేష్ సాగర్, హయత్ నగర్ వివేకానంద మెడికల్ సెంటర్

ఊరిలో మా వాడకట్టంతా కలిసిమెలిసి ఉంటారు. ఏ ఒక్కరికి ఆపదొచ్చినా నలుగురు ఉన్నామని ధైర్యం ఉంటుంది. పట్నంలో 40 శాతం ఆదాయం ఎక్కువగా ఉంటుండొచ్చు. కానీ అంతకు మించిన ఆనందం, భరోసా ఊరిలోనే లభిస్తుంది. ఖర్చు కూడా తక్కువే కదా. వ్యక్తిని వ్యక్తిగా చూసే వ్యవస్థ పల్లెలోనే ఉంటుంది. ఇక్కడేమో పక్కోడికి కరోనా పాజిటివ్ వచ్చిందంటే దూరం పెట్టేవారే. ఏనాటికైనా పల్లె జీవనంలోనే ఆరోగ్యం ఉందని గుర్తించాల్సిందే. మానవ సంబంధాలతో మెరుగైన జీవనం గడపొచ్చు. అందుకే మా దగ్గరికి వచ్చే చాలా మంది రోగులు ఊరికి వెళ్లిపోతున్నామని, అక్కడే ఏదో ఒక పని చేసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.



Next Story