తెలంగాణ కోసం పోరాడిన వాళ్లనే చంపుతున్నారు..

by Shyam |
తెలంగాణ కోసం పోరాడిన వాళ్లనే చంపుతున్నారు..
X

దిశ, ముషీరాబాద్: న్యాయవాదులు కొట్లాడి తెచ్చిన తెలంగాణలో వారినే హత్యచేస్తున్నారని.. ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. న్యాయవాదులు వామన్ రావు, నాగమణి దంపతుల హత్యను ఖండిస్తూ న్యాయవాదుల రక్షణ చట్టసాధన కోసం ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్ రావ్, మాజీ ఎంపీ వివేక్ వారికి మద్దతు పలికారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని దోచుకుంటూ ఎదురు తిరిగితే హత్యలు చేస్తూ రౌడీ రాజ్యం నడిపిస్తున్నారని మండిపడ్డారు. న్యాయవాద దంపతుల హత్య జరిగి ఇన్ని రోజులైనా ముఖ్యమంత్రి హత్యను ఖండించకపోవడం దారుణమన్నారు. ఎవరి అండదండలు ఉంటే ఇంతటి దారుణం చేయవచ్చో అర్థం చేసుకోవచ్చని ఆరోపించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని న్యాయవాదులను బెదిరింపులకు గురిచేయడం సరికాదని.. హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మాజీమంత్రి చిన్నారెడ్డి మాట్లాడుతూ.. అడ్వకేట్ దంపతుల హత్య వెనక ఎవరున్నారో నిజానిజాలు బయటపెట్టాలన్నారు.

కేసు సీబీఐకి అప్పగించాలి: బీజేపీ నేత వివేక్

వామన్ రావు, నాగమణి దంపతుల హత్య జరిగిన తరువాత పోలీసులు ఆధారాలను లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అన్నారు. న్యాయవాదుల తరఫున కేంద్ర హోంశాఖ మంత్రికి రిప్రజెంటేషన్ అందజేస్తానని చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు అల్లిపురం అనంతరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు గోవర్ధన్, న్యాయవాదులు జితేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రాపోలు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed