మనీ డొనేట్ చేస్తే రివార్డ్‌గా ‘కరిటాస్ కాయిన్స్’

by Shyam |   ( Updated:2021-08-11 23:23:51.0  )
మనీ డొనేట్ చేస్తే రివార్డ్‌గా ‘కరిటాస్ కాయిన్స్’
X

దిశ, ఫీచర్స్ : సాయానికి మించిన పూజ ఉందా? దానానికి సాటివచ్చే సంపద ఉందా? మనిషికి మనిషే ఆసరా. చేయికి చేయే బలం. అందుకే చేతులెత్తి మొక్కే దేవుడి కన్నా చేయిచ్చి ఆదుకునే మానవుడే మిన్న. చేసే సాయం చిన్నదా, పెద్దదా కాదు. ఇచ్చే మనసుందా? లేదా అన్నదే ప్రశ్న. ఆకలితో ఉన్న ఓ మనిషికి గుప్పెడు మెతుకులు అందిస్తే.. ఆ క్షణం కలిగే అనుభూతి చిరకాలం గుర్తుండిపోతోంది. పేదరికంలో, ఆపదలో ఉన్నవారికి చేయూతనిస్తే మనిషి పుట్టుక సార్థకమవుతుంది. ఇలాంటి పనులు స్వయంగా చేయవచ్చు లేదా స్వచ్ఛంద సంస్థల ద్వారా చేయించవచ్చు. అయితే కొందరికి సాయం చేయాలని ఉన్నా.. ఎవరిని సంప్రదించాలి, ఎలా డొనేట్ చేయాలో తెలియదు. అలాంటి వారికోసమే న్యూఢిల్లీకి చెందిన 16ఏళ్ల రుహాన్ చోప్రా ‘కరిటాస్’ అనే ఓ వేదికను ప్రారంభించాడు. ఈ ప్లాట్‌ఫామ్‌లో మనకు తోచినంత విరాళమిస్తే, ఆయా ఎన్‌జీవోల ద్వారా అవసరమైన వారికి సాయం అందుతుంది.

‘కరోనా’ మహమ్మారి ఎన్నో కుటుంబాలను రోడ్డుపాలు చేయగా, పది లక్షలకుపైగా చిన్నారులను అనాథలను చేసింది. చేయడానికి పని, తినడానికి తిండి లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న సన్నివేశాలు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే ఓ కుర్రాడి సంకల్పాన్ని మరింత బలపరిచాయి. అందుకోసం ‘కరిటాస్’ అనే ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాడు. ఇందులో ప్రజలు ఈజీగా డబ్బు విరాళంగా అందించవచ్చు. అయితే ఈరోజుల్లో స్వచ్ఛంద సంస్థలు పుట్టగొడుగుల్ల పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. ఏవి న్యాయంగా పనిచేస్తాయో, అవసరమైన వారికి ఫండ్స్ చేరతాయో లేదో అనే అనుమానం ప్రజల్లో ఉంది. ఆ సందేహాలకు ఫుల్‌స్టాప్ పెడుతూ, విశ్వసనీయమైన స్వచ్ఛంద సంస్థలను అందించడం ద్వారా, ప్రజలు, కార్పొరేషన్ల డబ్బు సరైన మార్గంలో ఉపయోగించడానికి ‘కరిటాస్’ సాయం చేస్తుంది. అంతేకాదు దాతల అవసరాలు, కోరికలను దృష్టిలో ఉంచుకుని అందుకు తగిన ఎన్‌జీవోలను గుర్తించి, నావిగేట్ చేయడంలోనూ ఇది తోడ్పడుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి వరద బాధితులకు సాయం చేసేందుకు విరాళమందించాలనుకుంటాడు. అందుకు తగిన స్వచ్ఛంద సంస్థను ఎంపిక చేసి వారికి ఆ డబ్బులను చేరవేస్తుంది. కారిటాస్ అనే లాటిన్ పదం నుంచి దీనికి ‘కరిటాస్’ పేరు పెట్టారు. దీనికి అర్థం ‘చారిటీ’/‘లవ్ ఫర్ ఆల్’.

కాజ్ :

కొవిడ్-19, ఎడ్యుకేషన్, ఫండ్‌రైజింగ్, హెల్త్, సోషల్ ఇష్యూస్, వైల్డ్‌లైఫ్, ఎన్విరాన్‌మెంట్, లెస్ -ఎబిలిటీ వంటి కేటగిరీలున్నాయి. ఇందులో ఆయా విభాగాల వారీగా సాయాన్ని అందించే స్వచ్ఛంద సంస్థలున్నాయి. ‘ద బిగ్గర్ పిక్చర్’ అనే ఎన్‌జీవో పేదలకు రేషన్, మెడికల్ సప్లయిస్, హాట్ మీల్స్ సమకూరుస్తుండగా, ఎల్‌జీబీటీక్యూల అవసరాలను ‘ద హమ్‌సఫర్ ట్రస్ట్’ తీరుస్తోంది. ఎయిడ్స్, అక్రమ రవాణా, లైంగిక హింస, పేదరికం ద్వారా ప్రభావితమైన మహిళలు, పిల్లలు, LGBT కమ్యూనిటీలకు మద్దతు ఇవ్వడంలో ‘స్నేహాలయ’ తోడ్పడుతుంది. అయితే ఎవరైనా నగదు రూపంలో విరాళాలు ఇవ్వాలనుకున్నప్పుడు, వారు తమ డబ్బును దేనికోసం ఖర్చు పెడుతున్నారన్న విషయాన్ని ‘కరిటాస్’ నిర్వాహకులు తెలుసుకుంటారు. ఒకవేళ మీకు కాజ్ తెలియకపోతే, సైట్‌లోని క్విజ్ ఆధారంగా సదరు డోనర్ ఎవరికీ హెల్ప్ చేయాలనుకుంటున్నాడో డిసైడ్ చేస్తారు.

ప్రూఫ్ :

కరిటాస్‌లో విరాళాలు అందివ్వడానికి ‘ఇండివిడ్యువల్స్’ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కంపెనీలు మాత్రమే కరిటాస్‌లో నమోదు చేసుకోవాలి. ఇక విరాళమందించిన డబ్బులు సరైన పనికోసం ఉపయోగపడుతుందా లేదా అనే సందేహానికి, వారు చేస్తున్న పనికి సంబంధించిన కొన్ని వీడియోలు, చిత్రాలను సదరు వ్యక్తికి పర్సనల్‌గా పంపిస్తారు. అంతేకాదు కరిటాస్ మొట్టమొదటి సారిగా వివిధ డిజిటల్ పేమెంట్స్ యాప్‌లతో కొలాబరేట్ కాగా, అందులో లిస్ట్ చేయబడిన స్వచ్ఛంద సంస్థలకు మనీ డోనేట్ చేసినందుకు గానూ రివార్డ్‌గా ‘కరిటాస్ కాయిన్స్’ పొందుతారు. అలా డోనేట్ చేసిన ప్రతిసారి రివార్డ్స్‌గా నాణేలు రాగా, అన్‌లాక్ స్థాయి చేరుకున్న తర్వాత ఆ రివార్డ్ కాయిన్స్‌తో ప్రయోజనాలు పొందవచ్చు.

‘ఇప్పటి వరకు దాదాపు 150-200 మంది వివిధ దాతలు విరాళాలు అందించారు. వరదల సమయంలో దాదాపు 300 మందికి తగినంత టార్పాలిన్‌లను అందించాం. ఇప్పటి వరకు ఆర్థిక సహాయం కోసం పెట్టుబడిదారులను సంప్రదించలేదు. డిజిటల్ చెల్లింపు వలె డోనేషన్ కూడా సింపుల్‌గా చేసే వ్యవస్థను తీసుకువస్తున్నాం. త్వరలోనే ఓ యాప్‌ను ప్రారంభించి మరింత విస్తృతంగా సాయమందిస్తాం. ఇది కేవలం కోవిడ్ బాధితులకే పరిమితం కాలేదు. చిన్నారుల నుంచి పెద్దల వరకు, ప్రకృతి చర్యల నుంచి వైల్డ్ లైఫ్ యానిమల్స్‌ను కాపాడుకునే వరకు వివిధ రకాలుగా మా సేవలు కొనసాగుతాయి. మనం సంపాదించిన దాని ద్వారా జీవనం సాగిస్తాం. మనం ఇచ్చే దాని ద్వారా మనం జీవితాన్ని సాధిస్తాం అన్న విన్‌‌స్టన్ చర్చిల్ మాటలే మా కరిటాస్ సూత్రం.
– రుహాన్ చోప్రా

Advertisement

Next Story