అదో లాంగెస్ట్ వైఫై పాస్‌వర్డ్!

by  |
అదో లాంగెస్ట్ వైఫై పాస్‌వర్డ్!
X

దిశ, వెబ్‌డెస్క్: మనమంతా డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం. మన చుట్టూ కరోనా ఉందో లేదో తెలియదు గానీ.. నెట్ సిగ్నల్స్ మాత్రం ఉన్నాయి. ఒకప్పుడు ఇంట్లో ఉప్పు, పప్పు లేదా పంచదార నిండుకుంటే పక్కింట్లో కాస్త పెట్టమని అడిగేవాళ్లం. ట్రెండ్ మారింది కదా.. ఇప్పుడు ఇంటర్నెట్ డేటాను అడుక్కుంటున్నాం. ఎదురింట్లో లేదా పక్కింట్లో నెట్ కనెక్షన్ ఉంటే చాలు.. సరదాగా అలా మాట్లాడుతూ, మాటల మధ్యన కాస్త మీ వైఫై ఐడీ, పాస్‌వర్డ్ చెబుతారా! అంటూ అడిగేస్తున్నారు. అసలే కరోనా టైమ్.. నెట్ అవసరం బాగా పెరిగిపోయింది. చిన్నపిల్లల చదువులు, పెద్దోళ్ల కోర్సులు, ఇంటికి కావాల్సిన వస్తువులు, సరుకులు అన్నీ ఆన్‌లైన్‌లోనే కానిచ్చేస్తున్న రోజులివి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన చుట్టుపక్కల వాళ్ల కోసం ‘ఫ్రీ వైఫై’ అని ఓ పోస్టర్ అతికించాడు. దాని ఐడీ, పాస్‌వర్డ్ కూడా చెప్పేశాడు. కానీ అందులో చిన్న మెలిక ఉంది. కాగా, ఆ పోస్టర్‌ ఆన్‌లైన్‌లో వైరల్‌గా నిలిచింది.

డిజిటల్ ఎరాలో.. వైఫై ఇచ్చిపుచ్చుకోవడం సర్వ సాధారణం. అయితే, చాలా మంది తమ చుట్టుపక్కల వాళ్లకు నెట్ వైఫై ఇవ్వడానికి అంతగా ఇష్టపడరు. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ‘పబ్లో రోచత్’ కూడా అంతే. ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసే పబ్లో.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘మా నైబర్స్ నా వైఫైని వాడుకోవచ్చు’ అంటూ తన ఇంటి ఆవరణలో అతికించిన ఓ పోస్టర్‌ను షేర్ చేశాడు. దీంతో నెట్ ప్రియులు అక్కడికి పరుగెత్తికెళ్లి పోస్టర్‌ను చూస్తే.. ఐడీ ‘గుడ్ ‌లక్’ అని ఉంది. ఇక పాస్‌వర్డ్ విషయానికొస్తే.. ఇంగ్లీష్‌లోని ఆల్ఫాబెట్స్‌తో సహా నెంబర్లు, సింబల్స్ అన్నీ వాడేసి ఓ పొడవాటి పాస్‌వర్డ్ రాసిపెట్టాడు. దాంతో నెటిజన్లు ఆ పోస్ట్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. ‘ఇది చాలా తెలివైన పని’ అని, ‘మీరు జీనియస్’, ‘మెమొరబుల్ పాస్‌వర్డ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరి చుట్టుపక్కల వాళ్లు ఇంటికొచ్చి వైఫై పాస్‌వర్డ్ అడిగితే.. మొహమాటానికో లేదా ఇంటికొచ్చి అడిగాడన్న కర్టసీ వల్లనో వారికి నో చెప్పకుండా ఉండలేం. తీరా ఇచ్చిన తర్వాత వాళ్లు నెట్‌ను ఎడాపెడా వాడేసుకుంటే.. ఆ తర్వాత బాధపడినా ప్రయోజనం ఉండదు. చాలా మంది విషయంలో ఇలానే జరుగుతుంది. అందుకే పబ్లో ఐడియాను అందరూ మెచ్చుకుంటున్నారు. ఆ పోస్టర్‌ను చూసి.. మళ్లీ ఏ ఒక్కరూ కూడా వైఫై పాస్‌వర్డ్ కావాలంటూ ధైర్యం చేసి అడగరంటే నమ్మండి.

సాధారణంగా పాస్‌వర్డ్ 8 అక్షరాల వరకు పెట్టొచ్చు, లాంగెస్ట్ పాస్‌వర్డ్ అయితే 63 క్యారెక్టర్స్ పెట్టొచ్చు.


Next Story