అంతరిక్ష వాసనలు.. అలా భూమ్మీదకు

దిశ, వెబ్‌డెస్క్: వర్షపు చినుకులు భూమిని తడపగానే.. నేలంతా ఓ రకమైన వాసన గుభాళిస్తుంది. ఎంతోమంది ఆ మట్టి పరిమళాన్ని ఇష్టపడుతుంటారు. బొగ్గులపై కాలుస్తున్న మొక్కజొన్న పొత్తులు, విరగబూసిన మల్లెలు, అత్తరు ఘాటు.. ఇవన్నీ భిన్నమైన వాసనల్ని వెదజల్లుతాయి. అలానే భూమిని వీడి అంతరిక్షంలో అడుగుపెడితే.. అక్కడ పరిమళం వేరేలా ఉంటుంది. మరి అక్కడి వాసన ఎలా ఉంటుందో తెలుసా? ఆ వాసన ఇక్కడ సృష్టించవచ్చా?

గన్ పౌడర్, సీరెడ్ స్టీక్, రాస్ప్ బెర్రీస్, రమ్.. వీటి వాసనలు విడివిడిగా ఎలా ఉంటాయో.. కొందరికే తెలిసుంటుంది. కానీ వీటన్నింటినీ మిక్స్ చేస్తే.. ఎలాంటి వాసన వస్తుందో.. అలాంటే వాసనే అంతరిక్షంలో ఉంటుందని కొంతమంది ఆస్ట్రోనాట్స్ అభిప్రాయపడ్డారు. ‘కాల్చిన వెంటనే తుపాకీ నుంచి వచ్చిన వాసన లాగా ఉంటుందని.. పొగ, కాలిపోయిన వాసన, చేదుల కలయికగా ఇది ఉంటుంది’ అని పెగ్గి విట్సన్ అనే ఆస్ట్రోనాట్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

స్పేస్‌లో ఉండేటువంటి పరిమళాలను.. ఇక ఇక్కడ కూడా మనం ఆస్వాదించవచ్చు. ఆస్ట్రోనాట్స్‌కు ఉపయోగపడేలా.. పుడమి మీదే అంతరిక్ష వాసనలు అందించేందుకు ‘ఈ యూ డీ స్పేస్’ను కెమిస్ట్, ఓమెగా ఇన్‌గ్రీడియన్స్ ఫౌండర్ స్టీవ్ పియర్స్ అభివృద్ధి చేశారు. నాసాతో అంతరిక్ష వాసనను తయారు చేయడానికి 2008లోనే పియర్స్ ఒప్పందం కుదుర్చుకున్నారు. స్పేస్‌లోకి వెళ్ళే ఆస్ట్రోనాట్స్ అక్కడ ఉండే వాసనలు డిఫరెంట్‌గా అనిపించకుండా ఉండటానికి ‘స్మెల్ ఆఫ్ స్పేస్’ను తయారు చేయాల్సిందిగా నాసా పియర్స్‌ను కోరింది. పియర్స్ ఆనాటి నుంచి ఎన్నో ప్రయోగాలు చేసి.. చివరకు అంతరిక్ష వాసనలను భూమ్మీదకు తీసుకొచ్చారు. అంతేకాదు ఆ వాసనలను త్వరలోనే సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇలాంటి ప్రయోగాలు ఇంటర్ విద్యార్థుల్లో.. స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథమేటిక్స్) లెర్నింగ్‌పై ఆసక్తిని రేకెత్తిస్తాయని పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మిగతా శాస్త్రవేత్తలు వీటి గురించి పెద్ద ఎత్తున చర్చిస్తారని ఈ యూ డీ స్పేస్ ప్రొడక్ట్ మేనేజర్ మాట్ రిచ్‌మండ్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఈ ప్రయోగం ఇచ్చిన ఉత్సాహంతో.. ‘స్మెల్ ఆఫ్ ది మూన్’ కూడా త్వరలోనే అభివృద్ది చేస్తామని వెల్లడించారు.

Advertisement