చిన్నారుల్లో మహమ్మారి రెండు విధాల్లో వ్యాప్తి .. త్వరలోనే గైడ్‌లైన్స్

by Shamantha N |
చిన్నారుల్లో మహమ్మారి రెండు విధాల్లో వ్యాప్తి .. త్వరలోనే గైడ్‌లైన్స్
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి థర్డ్ వేవ్‌ చిన్నారులపై పంజా విసరవచ్చన్న ఆందోళనలు వెలువడుతున్న తరుణంలో పిల్లల్లో కరోనా కేసులను నిశితంగా పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. ఇప్పటి వరకు ఈ వాదనలను కొట్టేస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం వైఖరికి భిన్నంగా కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని నిపుణుల బృందం చీఫ్, నీతి ఆయోగ్(ఆరోగ్య) సభ్యుడు డాక్టర్ వీకే పాల్ స్పందించారు. పిల్లల్లో కరోనా ఉధృతంగా వ్యాపించే అవకాశముందన్న అంచనాలను కొట్టిపారేయలేమని వివరించారు. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రెస్ బ్రీఫింగ్‌లో ఆయన మాట్లాడుతూ, పిల్లల్లో కరోనా సోకినా లక్షణాలు చాలా మందిలో కనిపించవని చెప్పారు. వాళ్లు హాస్పిటల్ చేరాల్సిన పరిస్థితులూ స్వల్పంగా ఉంటాయని వివరించారు. కానీ, వ్యాప్తి విధానంలో, వైరల్ బిహేవియర్‌లో మార్పులు సంభవించవచ్చునని, ఈ కారణంగా పిల్లల్లోనూ కరోనా వ్యాప్తి పెరిగే అవకాశముంటుందన్న వాదనలను కాదనలేమని అన్నారు. ఇప్పటి వరకు కరోనా సోకిన పిల్లలతో ఆరోగ్య వ్యవస్థలో అదనపు ఒత్తిడి ఏర్పడలేదని తెలిపారు. భవిష్యత్‌లోనూ కరోనా కారణంగా కేవలం 2 నుంచి 3శాతం పిల్లలు మాత్రమే హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చని వివరించారు. కరోనా సోకిన పిల్లలకు చికిత్స కోసం వైద్యారోగ్య వసతుల్లో లోటు ఉండబోదని స్పష్టం చేశారు. పిల్లల్లో కరోనా అంశం తమ దృష్టికి వచ్చిందని, దీనితోపాటు ఇతర మార్పులను క్షుణ్ణంగా పరిశీలించడానికి కొత్తగా నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్‌ను ఏర్పాటుచేశామని వివరించారు. ఈ బృందం అందుబాటులో ఉన్న సమాచారం, క్లినికల్ ప్రొఫైల్, దేశ అనుభవం, డిసీజ్ డైనమిక్స్, వైరస్ లక్షణం, మహమ్మారి తీరును గమనించి గైడ్‌లైన్స్ రూపొందించిందని తెలిపారు. త్వరలోనే వీటిని విడుదల చేస్తామని అన్నారు.

ఆరు వారాల తర్వాత లక్షణాలు

చిన్నారుల్లో వైరస్ రెండు విధాల్లో వ్యాపించే అవకాశముందని డాక్టర్ వీకే పాల్ వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం, కొందరిలో కరోనా వ్యాప్తి చెందగానే లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, దగ్గు, న్యూమోనియా లాంటి లక్షణాలు వస్తాయి. రెండో విధానంలో వైరస్ వ్యాప్తి చెందిన తర్వాత లక్షణాలు కనిపించవు. ఇందులోనూ కొందరిలో కనీసం ఆరు వారాల తర్వాతే లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, దగ్గు, కళ్లల్లో మంటలు, శ్వాస సమస్యలు, డయేరియా, వాంతులు ఇలా ఒక వ్యవస్థకు లోబడి ఉండవు. కేవలం ఊపిరితిత్తుల సమస్య దగ్గరే ఆగిపోవు. ఇతర అవయవాలకు పాకుతుంది. దీన్నే మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ అంటారు. ఇది పోస్ట్ కొవిడ్ సింప్టమ్. అంటే కొవిడ్-19 సోకి నయమైన తర్వాత వచ్చే లక్షణం. ఈ సమయంలో ఆర్‌టీ-పీసీఆర్ టెస్టు ద్వారా నెగెటివ్ వస్తుంది. కానీ, యాంటీబాడీ టెస్టు ఫలితం ఆధారంగా సదరు చిన్నారి కరోనా బారినపడినట్టు గ్రహించవచ్చు. ఇలా అరుదుగా కొందరిలో కనిపించే లక్షణాలూ ఎమర్జెన్సీ సిచువేషన్‌కు తీసిపోవని, అయితే, దీనికీ చికిత్స అందించవచ్చునని డాక్టర్ పాల్ తెలిపారు. చికిత్స కష్టమేమీ కాకపోయినా, సమయానికి అందించడం కీలకమని వివరించారు

Advertisement

Next Story

Most Viewed