టీఆర్ఎస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు.. ఎమ్మెల్యే ముందే..

by Sridhar Babu |
kantarao
X

దిశ, బూర్గంపాడు: బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మధ్య వర్గ విభేదాలు రాజుకున్నాయి. మంగళవారం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో పర్యటించిన పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సమక్షంలో.. నాగినేనిప్రోలు గ్రామ సర్పంచితో పాటు మరో 20 కుటుంబాలు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంలోనే తన వర్గ ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చారని.. మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వలేదని, ఆపదలో ఫోన్ చేసినా కూడా ఎమ్మెల్యే స్పందించలేదని ఓ టీఆర్ఎస్ కార్యకర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఆ కార్యకర్తను పక్కకు తీసుకెళ్లి నచ్చచెప్పేందుకు కొందరు టీఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేశారు. మొదటి నుంచి టీఆర్ఎస్ లో ఉన్నామని.. నిన్నకాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో సర్పంచ్ తన స్వలాభం కోసమే చేరారని కొంత మంది గ్రామస్తులు ఆరోపించారు. ఒకవైపు స్థానిక ఎమ్మెల్యే ప్లెక్సీలు దర్శనమిస్తుంటే మరో వర్గం టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ల అభిమాన నాయకుడి ప్లెక్సీలను ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed