వామ్మో.. నేను రాను సర్కార్ దవాఖానకు

దిశ ప్రతినిధి. నిజామాబాద్: నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్ ఆసుపత్రి పేరు చెబితేనే జనం బెంబేలెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో వైరస్ కేసులు వెయ్యి దాటడం.. ప్రభుత్వ ఆస్పత్రిలో పట్టించుకోవట్లేదన్న ఆరోపణలతో ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఓ కరోనా పేషెంట్ సెల్ఫీ వీడియోలో డాక్టర్లు పట్టించుకోవట్లేదని చెప్పడం.. జూలై 30వ తేదీన ఐదుగురు వైరస్ కారణంగా చనిపోవడం.. గతంలో నలుగురు ఆక్సిజన్ అందక మృత్యువాత పడడంతో ఆస్పత్రి వైపు ఎవరూ వెళ్లడం లేదు.

పర్యవేక్షణ కరువైందా?

వైరస్ కారణంగా ఆసుపత్రిపై అధికారుల పర్యవేక్షణ కరువైందని పలువురు ఆరోపిస్తున్నారు. కొవిడ్ ఆసుపత్రిలో వైద్యం సంగతి పక్కన పెడితే.. కొత్తగా రోగాలు అంటుతాయేమోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రోగులకు పౌష్టికాహరం అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొవిడ్ వార్డు ప్రారంభమైన వారం రోజులకే ఒకే రోజు నలుగురు కరోనా పేషెంట్లు ఆక్సిజన్ అందక.. జూలై 30న సైతం ఆసుపత్రిలో ఐదుగురు వివిధ కారణాలతో చనిపోయారు. ఓ వ్యక్తి ఆసుపత్రిలో ఎవరూ పట్టించుకోవట్లేదని, కనీసం ట్యాబ్లెట్లు కూడా ఇవ్వడం లేదని తీసిన సెల్ఫీ వీడియో వైరల్‌ కావడంతో జనంలో ఆందోళన నెలకొంది.

ర్యాపిడ్, ల్యాబ్ టెస్టుల్లో తేడా!

కొవిడ్ ఆసుపత్రి అనుబంధంగా ఉన్న వైరాలజీ ల్యాబ్‌లో పరీక్షల నిర్వహణలో అలసత్వం నెలకొందన్న ఆరోపణలు ఉన్నాయి. ర్యాపిడ్ టెస్టులకు, ల్యాబ్ పరిక్షలకు తెడా ఉంటుందని పేషెంట్లు మొత్తుకుంటున్నారు. పరీక్షలను నిర్వహించుకున్న ఫలితాలకు కనీసం ఐదు రోజులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ కరోనా వైరస్ పై సమీక్ష నిర్వహించినా పరిస్థితులు మారకపోవడంతో ఆసుపత్రి పేరు చెబితేనే సామాన్యులు వెనకడుగు వేస్తున్నారు.

డాక్టర్లు రారు..!

కొవిడ్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించాల్సిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు ముందుకు రావడం లేదు. 180 బెడ్లతో ఉన్న ఆసుపత్రిని 250 కి పెంచాలన్న ప్రతిపాదన, 24 బెడ్‌లు ఉన్న ఐసీయూ బెడ్లను 100కు పెంచాలన్న ప్రతిపాదనలు ఇప్పట్లో కార్యరూపం దాల్చే పరిస్థితి లేదు. 224 పోస్టులు ఉన్న వైద్య కళాశాలలో 104 మంది రెగ్యూలర్, 29 మంది కాంట్రాక్ట్ సిబ్బంది ఉండగా, 91 ఖాళీలు ఉన్నాయి. ట్యూటర్, ఎస్ఆర్‌లు, జూనియర్ వైద్యులపై భారం మోపుతున్నారు. వచ్చిన వారు కేవలం జనరల్ ఆసుపత్రి వైపు వస్తున్నారు తప్పితే కొవిడ్ ఆసుపత్రి మెట్లు ఎక్కడం లేదు. దానితో జిల్లా కొవిడ్ ఆసుపత్రిలో వైద్యానికి గ్యారంటీ లేదనే పరిస్థితి నెలకొంది.

పౌష్టికాహారం ఏదీ?

ఆసుపత్రిలో రోగులకు పౌష్టికాహారం అందడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. జనరల్ ఆసుపత్రిలో రోగులకు పెట్లే ఆహారాన్ని పెడుతున్నారని రోగులు మొత్తుకుంటున్నారు. ఆసుపత్రిలో పాత బకాయిలు రూ.55 లక్షల బకాయిలు ఉన్నాయని, అందుకే ఫుడ్ కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వైరాలజీ ల్యాబ్‌లో పరీక్షల నిర్వహణ అస్తవ్యస్థంగా ఉండడంతో అక్కడ ర్యాపిడ్ టెస్టులను తిరిగి చేస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు.

Advertisement