నెల గడిచినా.. నేల మీదే..!

by  |
నెల గడిచినా.. నేల మీదే..!
X

దిశ, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మక్క రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలు సకాలంలోనే ప్రారంభమైనప్పటికీ, కొనుగోలు చేసిన మక్కలను తరలించడంలో జాప్యం జరుగుతోన్నది. దీంతో లక్ష్యంలో 60 శాతం మాత్రమే కొనుగోలు పూర్తయింది. ఇంకా 40 శాతం మక్కలు కొనుగోలు చేయాల్సి ఉండగా పూర్తి కాకముందే మార్కెట్ కు వడ్లు పోటెత్తుతున్నాయి. దీంతో రైతుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా తయారవుతోన్నది.

తరలింపులో తీవ్ర జాప్యం…

మక్కల తరలింపులో జరుగుతున్న తీవ్ర జాప్యమే నిల్వలు పేరుకుపోవడానికి కారణం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మార్చి నెల చివరి వారంలో ప్రారంభమైన మక్కల కొనుగోలు ఇప్పటికే ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. నిర్మల్ జిల్లాలో ఎనిమిది లక్షల క్వింటాళ్ల మక్కలు కొనుగోలు చేయాలన్న లక్ష్యం ఉండగా… ఇప్పటివరకు 4.66 లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు పూర్తయ్యాయి. 9510 మంది రైతుల నుంచి ఈ కొనుగోళ్లు చేపడుతున్నారు. మొత్తం 104 సెంటర్లలో కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ, మక్కల తరలింపు విషయంలో మాత్రం జాప్యం జరుగుతోన్నది. దీనికి ప్రధాన కారణం లారీల కొరతగా అధికారులు చెబుతున్నారు. కరోనా కారణంగా డ్రైవర్లు, క్లీనర్లు విధులు నిర్వహించేందుకు ముఖం చాటేస్తున్నారని, దాని వల్లనే సకాలంలో లారీలను పంపలేక పోతున్నామని లారీల యజమానులు చెబుతున్నారు. అటుఇటుగా 40 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల వద్దనే మక్కల రాశులు దర్శనమిస్తున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోపక్క రోజు వర్షం వచ్చే సూచనలు కనిపిస్తుండడంతో రైతుల్లో ఆందోళన మరింత పెరుగుతోన్నది. ఇప్పటికే రెండుమూడు సార్లు వర్షాలు రావడం, మక్కలు తడిసిపోవడం జరిగాయి.

కూలీల కొరత మరో కారణం…

మక్కల తరలింపులో జాప్యానికి కూలీల కొరత కూడా ఒక కారణమని అధికారులు చెబుతున్నారు. లారీలో మక్కలు లోడ్ చేయడం, అన్ లోడ్ చేయడం వంటి పనులు ప్రత్యేకించి బీహార్ కూలీలే ఎక్కువగా చేస్తుంటారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా వీరంతా తిరిగి వెళ్లిపోయారని.. ఈ కారణంగా సమస్య పెరిగిందని లారీల యజమానులు చెబుతున్నారు. అయితే కొందరు లారీ యజమానులు డబ్బులు అడుగుతున్నారని రైతులతో గొడవలు జరుగుతున్నాయి.

ఆ వెంటే వడ్లు…

ఒకవైపు మక్కల కొనుగోలు పూర్తికాకముందే వడ్లు కల్లాలకు వస్తున్నాయి. దీంతో సమస్య మరింత పెరిగేలా కనిపిస్తోన్నది. మక్కల కొనుగోళ్లు పూర్తి కాకముందే వడ్లు పెద్ద మొత్తంలో వస్తే సమస్య తీవ్రంగా మారుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గోదాముల కొరత ఏర్పడి పొరుగున ఉన్న మహారాష్ట్ర, ధర్మాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో గోదాములను గుర్తించి అక్కడ నిల్వ చేసే పరిస్థితి నెలకొన్నది.

నెల రోజులుగా ఎదురుచూస్తున్నా..: భూమారెడ్డి, రైతు, మేడిపల్లి

మక్కలు అమ్ముదామని సెంటర్ కు తెచ్చి నెల రోజులు దాటింది. ఇంకా కొందరు నా కన్నా ముందే తెచ్చారు. వాళ్లవే కొనలేదు. అధికారులను ఎన్నిసార్లు అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు. లారీల కొరత అని చెబుతున్నారు. లారీల ఓనర్లు ఎక్కువ డబ్బులు ఇస్తే తీసుకువెళతామని చెబుతున్నారు.

Tags: Adilabad, Makkalu, Farmers, sweet corn, Problems, Purchases, Lorries



Next Story

Most Viewed