అంధులకు వెలుగునిచ్చే ‘ఆర్టిఫీషియల్ కార్నియా’

by Anukaran |   ( Updated:2021-01-26 08:34:50.0  )
అంధులకు వెలుగునిచ్చే ‘ఆర్టిఫీషియల్ కార్నియా’
X

దిశ, వెబ్‌డెస్క్: వైద్యశాస్త్రంలో ఇదివరకు చూడని ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమవుతుండగా, సృష్టికి ప్రతిసృష్టి చేస్తూ రూపొందిన మెకానికల్ హార్ట్స్, బ్రెయిన్ కంట్రోల్డ్ ప్రొస్థెసిస్, 3డీ ప్రింటెడ్ ఆర్గాన్స్ వంటి కృత్రిమ అవయవాలు ఎంతోమందికి మరో జన్మను ప్రసాదిస్తున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు సింథటిక్ కార్నియా సృష్టించి అంధుడి కళ్లలో వెలుగు నింపారు. ఇక చూపు లేదని బాధపడే రోజులకు గుడ్‌బై చెప్పాల్సిన రోజులు త్వరలోనే రాబోతున్నాయి.

ప్రపంచంలోనే తొలి ఆర్టిఫిషియల్ కార్నియా ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీని విజయవంతంగా పూర్తిచేసి రాబిన్ మెడికల్ సెంటర్‌ వైద్యులు చరిత్ర సృష్టించారు. ఇజ్రాయెల్‌కు చెందిన 78 సంవత్సరాల వ్యక్తి, దశాబ్ద కాలం కిందట కంటిచూపును కోల్పోగా, అతడికి ఈ నెల 11న పెటా టిక్వాలోని రాబిన్ మెడికల్ సెంటర్ ఆప్తాల్మజీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఇరిత్ బహార్ ఆధ్వర్యంలో సింథటిక్ ‘కార్నియా’ను అమర్చి చూపు తెప్పించారు. సర్జరీ అనంతర ఆ వ్యక్తి అందర్నీ గుర్తుపట్టడంతో పాటు, అక్షరాలను చదవగలిగాడు. ఈ ‘సింథటిక్ కార్నియా’ను ఇజ్రాయెల్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ కార్నెట్(CorNeat) రూపొందించగా, గతేడాది జూలై‌లో క్లినికల్ ట్రయల్స్‌‌కు ఆమోదం లభించింది.

‘ఈ విజయం ఎంతోమంది అంధులకు శుభవార్త. ఎన్నో సంవత్సరాల శ్రమకు వచ్చిన ఫలితం ఇది. ఇవి ఉద్విగ్నభరితమైన క్షణాలు, ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఇది మిలియన్ల జీవితాలను తప్పకుండా ప్రభావం చేస్తుంది. ఈ కార్నియాను ఇంప్లాంట్ చేయడం చాలా సులభం. కేవలం గంటలో సర్జరీ పూర్తవుతుంది’ అని కార్నియా సృష్టికర్త, కార్నెట్ విజన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గిలాడ్ లిట్విన్ తెలిపాడు. నేత్రదానం చేస్తున్న వారి సంఖ్య వందల్లో ఉంటే కార్నియా అవసరం ఉన్న వారి సంఖ్య లక్షల్లో ఉంటోంది. కంటి చూపును పునరుద్ధరించడానికి కార్నియా మార్పిడి చేస్తుంటారు. ఇది సాధారణమే కానీ, ఎవరైనా కార్నియా డోనేట్ చేస్తేనే ఈ సర్జరీలు చేయొచ్చు. కార్నియాలో మూడు పొరలు ఉంటాయి. కార్నియా మార్పిడి చేయాల్సి వచ్చినపుడు ఈ మూడు పొరల్లో ఒక పొర మార్చడం లేక రెండు పొరలూ మారుస్తారు. ఎవరికి ఏ పొర అవసరమైతే ఆ పొర మార్చే సౌలభ్యం ఆధునిక టెక్నాలజీతో సాధ్యమవుతోంది. ఒక డోనర్‌ నుంచి సేకరించిన కార్నియాను ఇద్దరికీ ఉపయోగించొచ్చు. కొన్నిసార్లు ముగ్గురికీ ఉపయోగించవచ్చు. అయితే భవిష్యత్తులో సింథటిక్ కార్నియా అందుబాటులోకి వస్తే, ఇక డోనర్ కోసం ఎదురు చూసే అవసరం ఉండదు.

Advertisement

Next Story

Most Viewed