వెయ్యేళ్ల నాటి శివాలయం.. మొత్తం గ్రానైటే!

by  |
వెయ్యేళ్ల నాటి శివాలయం.. మొత్తం గ్రానైటే!
X

భారత సంస్కృతిలో దేవాలయాల పాత్ర ప్రధానమైనది. ఉత్తరాన పర్వతాల మీది నుంచి దక్షిణాన సముద్ర తీరాల వరకు దేశవ్యాప్తంగా అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. నిర్మాణశైలిలో దేనికవే ప్రత్యేకం. అలాంటి దేవాలయాల్లో తమిళనాడు రాష్ట్రం తంజావూరులోని బృహదీశ్వరాలయం ఒకటి. వెయ్యేళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో నటరాజ స్వామి కొలువై ఉన్నాడు.

దేవాలయ చరిత్ర

క్రీస్తు పూర్వం 1003-1010ల మధ్య తమిళ రాజు మొదటి రాజ రాజ చోళుడు ఈ ఆలయాన్ని కట్టించాడు. గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్ అంటూ యునెస్కో గుర్తించిన ప్రపంచ హెరిటేజ్ సైట్లలో ఈ దేవాలయం కూడా ఉంది. శైవం, వైష్ణవం శాసనాలతో పాటు శక్తి శాసనాలు కూడా ఈ దేవాలయం మీద ఉన్నాయి. అప్పట్లో దీన్ని రాజరాజేశ్వర దేవాలయమని పిలిచే వాళ్లు. తర్వాత నాయక వంశస్థులు, మరాఠాలు ఆక్రమించుకుని బృహదీశ్వరాలయంగా పేరు మార్చారు.

మతిపోగొట్టే నిర్మాణశైలి

అన్ని హిందూ దేవాలయాల్లాగే ఇక్కడ కూడా చాలా నిర్మాణ ప్రత్యేకతలు ఉన్నాయి. ఎత్తైన గోడలు, పూర్తిగా గ్రానైట్ తో నిర్మించిన గుడి ఇంకా మరెన్నో కళాకృతులు ఇక్కడ ఉన్నాయి. 130000 టన్నుల గ్రానైటు ఉపయోగించి కట్టిన ఈ గుడి ప్రపంచంలో పూర్తిగా గ్రానైటుతో నిర్మించిన మొదటి దేవాలయం. 216 అడుగుల ఎత్తు, 80 టన్నుల బరువు ఉండే గోపురం, ఉత్తర పశ్చిమ వరండాల్లో ప్రతిష్టించిన 108 శివలింగాలు, గోడల మీద శివుని లీలలు తెలిపే కథలకు సంబంధించిన 64 చిత్రలేఖనాలు అత్యద్భుతంగా అనిపిస్తాయి.

ఎలా వెళ్లాలి?

బృహదీశ్వరాలయానికి సమీపంలో తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అక్కడి నుంచి ఒక గంటలో క్యాబ్ ద్వారా ఆలయాన్ని చేరుకోవచ్చు. లేదంటే తంజావూరు రైల్వే స్టేషన్ వెళ్లి అక్కడి నుంచి 6 కి.మీ.లు ప్రయాణిస్తే ఆలయం వస్తుంది.



Next Story

Most Viewed