దూసుకెళ్తోన్న టీఎంసీ.. హాట్రిక్ కొట్టబోతున్న దీదీ

by Shamantha N |
CM Mamata Banerjee
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఎనిమిది దశల్లో సుదీర్ఘంగా జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. మొత్తంగా అధికార టీఎంసీ అభ్యర్థులు పైచేయి సాధించినా.. నందిగ్రామ్ నియోజకవర్గంలో మాత్రం సీఎం మమతా బెనర్జీకి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మాత్రం చుక్కలు చూపిస్తున్నాడు. రౌండ్ రౌండ్‌కు ఫలితాలు తారుమారు కావడంతో అభ్యర్థులతో పాటు పార్టీల్లో కూడా తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటి గంట వరకూ అందిన సమాచారం ప్రకారం.. అధికార పార్టీ టీఎంసీ 208 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. బీజేపీ 80 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

ఇప్పటివరకూ అందిన ఫలితాలను బట్టి చూస్తే.. మమతా బెనర్జీ మరోసారి సునాయాసంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా అనిపిస్తోంది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో పైచేయి సాధించి, అధికారం చేజిక్కించుకోవాలని చేసిన ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఈ ఎన్నికల ఫలితాలు పెద్ద దెబ్బే అని చెప్పాలి. దాదాపు 100 స్థానాలైనా దక్కించుకోవాలని బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఏకంగా ప్రధాన మంత్రి, మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం జరిగింది. కాగా, ఈ ఎన్నికల ప్రచారంలో బీజేపీ మంతనాలు ఏమాత్రం పనిచేయలేదని స్పష్టం అవుతోంది. 292 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 148 సీట్లు కావల్సి ఉండగా, టీఎంసీ భారీగా 208 స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తోంది. దీంతో పశ్చిమ బెంగాల్‌లో వరుసగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు దిశగా టీఎంసీ పయనిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed