విద్యాశాఖ మంత్రి ఇల్లు ముట్టడి

by  |
విద్యాశాఖ మంత్రి ఇల్లు ముట్టడి
X

దిశ, న్యూస్​బ్యూరో: ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 5నెలలుగా జీతాలు లేక దుర్భర జీవితం గడుపుతున్నారని, జీవో 45 ప్రకారం వారందరికీ జీతాలు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఇంటిని ఉపాధ్యాయులు సోమవారం ముట్టడించారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ పలుమార్లు మంత్రి గారిని కలిసి విజ్ఞప్తి చేసినా ఫలితం రాకపోవడంతో తెలంగాణ ప్రైవేట్​ టీచర్స్​ ఫోరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. లాక్​డౌన్ సమయంలోనూ ప్రైవేట్ ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 45ని పాటించని యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ షబ్బీర్ అలీ, ఉపాధ్యక్షులు బయ్య శివరాజ్ విమర్శించారు. 12నెలల జీతాలను చెల్లించాలని జీఓలున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సమీక్షా సమవేశంలో ఈ అంశాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు మంత్రి వివరించారు. త్వరలో విద్యావ్యవస్థ ప్రక్షాళనకు ఒక కమిటీ వేసి ప్రైవేట్ ఉపాధ్యాయుల తరుపున భాగస్వామ్యం కల్పిస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో రంగినేని ప్రవీణ్ రావు, రాష్ట్ర కోశాధికారి నవీన్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు వెంకన్న, మేడ్చల్ జిల్లా కమిటీ సభ్యులు సుధాకర్, పాపారావు, మహాదేవ్ కోహ్లీ, తేజ, కళ్యాణ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.



Next Story