- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీఆర్సీపై సస్పెన్స్.. పదోన్నతులపై నో క్లారిటీ!
దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగులు భయపడినట్టుగానే జరుగుతోంది. సీఎం కేసీఆర్ ప్రకటించినా.. అమలు ఎప్పుడవుతుందో అనే అనుమానాలు ముందు నుంచే ఉన్నాయి. వాటికి అనుగుణంగానే పీఆర్సీ నివేదిక ఇవ్వాళ.. రేపు.. అంటూ సాగుతూనే ఉంది. కనీసం ఇంకా సీల్ కూడా ఓపెన్ కావడం లేదు. అటు సీఎం కేసీఆర్ అప్పాయింట్‌మెంట్ దొరకడం లేదు. సీఎంను కలిసి కాపీ ఇచ్చిన తర్వాతనే సీల్ ఓపెన్ చేస్తామంటూ సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ భీష్మించుకుని కూర్చుంది. మరోవైపు ఎప్పుడైనా పిలుపు వస్తుందనే ఆశతో ఉద్యోగ సంఘాల నేతలు ఎదురుచూస్తున్నారు. జిల్లా పర్యటనలన్నీ రద్దు చేసుకుని సీఎస్ నుంచో, సీఎం నుంచో ఆహ్వానం వస్తుందేమోనంటూ ఉంటున్నారు. జిల్లాల్లో డైరీ ఆవిష్కరణలను రద్దు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు, అప్పుడు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అంటూ చెప్పినట్టుగానే చెప్పి ఏం లేదని అధికారులు చెబుతుండటంతో ఉద్యోగ సంఘాలతో పాటుగా ఉద్యోగుల్లో కూడా నిర్లిప్తత ఆవరించింది.
ఆదివారంలోగా చాన్స్?
పీఆర్సీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. డిసెంబర్ 31 వరకే ఉన్న బిస్వాల్ కమిటీ గడువు కూడా ముగిసింది. ఇప్పుడు కమిటీ ఉన్నదా.. లేదా అనేది వారికే తెలియడం లేదు. పీఆర్సీ అంశంపై కమిటీ గడువు ముగిసిందని, ఇతర అంశాలపై మాత్రం కొనసాగుతుందని చెబుతున్నారు. ఈ కమిటీపై పీఆర్సీ అంశమే కాకుండా ఉద్యోగుల విభజన వంటి బాధ్యతలు కూడా పెట్టిన విషయం తెలిసిందే. గత నెల 30న సీల్డ్ కవర్‌లో నివేదిక ఇవ్వగా.. ఎప్పుడు ఓపెన్ చేస్తారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం సీఎం కేసీఆర్ అధికారులతో, జేఏసీ నేతలతో సమావేశమవుతారనే ప్రచారం జరిగింది. కానీ అది ఉత్తిదేనని తేలిపోయింది. తాజాగా శనివారం సాయంత్రం లేదా ఆదివారం చాన్స్ ఉందంటూ వార్తలొస్తున్నాయి. కానీ సరైన సమాచారం ఎవరి వద్దా లేదు.
ఏం సమాధానం చెప్తాం
మరోవైపు ఉద్యోగ వర్గాల్లో ఉత్కంఠ తీవ్రస్థాయికి చేరింది. ఫిట్‌మెంట్అంశంపై ఎటూ తేలడం లేదు. గతంలో అనధికారికంగా ఎంతో కొంత సమాచారం వచ్చేది. కానీ ఇప్పుడు చిన్న విషయం కూడా బయటకు పొక్కడం లేదు. ఈ నెల 6,7 తేదీల్లో సమావేశం నిర్వహించాలని సీఎంవో ఆదేశించినా కనీసం చిన్న పురోగతి లేదు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు అయోమయంలో పడ్డారు. 9వ తేదీ వచ్చినా.. పీఆర్సీ నివేదిక అందలేదు. సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారో తేదీని కూడా చెప్పడం లేదు. అధికారులను అడిగితే.. ప్రగతి భవన్ వైపు చూపిస్తున్నారు. అక్కడి నుంచి రిప్లై ఉండటం లేదు.
మార్గదర్శకాలు ఇవ్వరా..?
మరోవైపు పదోన్నతులు కల్పిస్తామని చెబుతున్నా… అధికారుల ప్రకటనలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఈ నెల 31లోగా పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించినా కనీసం మార్గదర్శకాలు కూడా జారీ చేయలేదు. మూడేండ్ల సర్వీసు అంశంలో కీలక నిర్ణయం తీసుకుంటామని సీఎస్ వెల్లడించారు. రెండేళ్లను పరిగణనలోకి తీసుకుంటే ఎక్కువ మందికి పదోన్నతులు లభిస్తాయని, ఖాళీలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుందని వివరించారు. రెండేడ్ల సీనియారిటీ ఫైలును సిద్ధం చేసి సీఎం ఆమోదం కోసం పంపించామని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. కానీ అటు నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదంటున్నారు.
ఉపాధ్యాయ పదోన్నతులపై పీటముడి
ఉపాధ్యాయ పదోన్నతులపై చాలా అంశాలు గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఇదివరకు 10 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా పదోన్నతులు కల్పించగా.. ఇప్పుడు ఏ ప్రాతిపదికన తీసుకోవాలనే ప్రశ్న ఎదురవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలుండగా.. ఉపాధ్యాయ పోస్టులన్నీ జిల్లా కేడర్ పోస్టులే. అయితే జిల్లాను యూనిట్‌గా తీసుకుని సీనియారిటీని పరిగణిస్తున్నారు. ఇప్పుడు జిల్లాల పునర్విభజన నేపథ్యంలో సర్వీస్ రూల్స్‌ను మార్చాల్సిందే. ఈ నేపథ్యంలో ఒక జిల్లాలో పని చేస్తున్న ఉపాధ్యాయుడిని ఏ జిల్లా స్థానికుడిగా పరిగణించాలో స్పష్టం చేయడం లేదు. దీనిపై చాలా క్లారిటీ తీసుకోవాల్సి ఉంది. స్థానికత సర్వీసు రూల్స్‌ను మారుస్తూ పదోన్నతుల మార్గదర్శకాలను జారీ చేయాలని, అప్పుడే జిల్లాల వారీగా ఏర్పడే ఖాళీలు, పదోన్నతులు తేలుతాయని ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. మరోవైపు భాషా పండితులు, పీఈటీల వివాదం మెడపై ఉంది. రాష్ట్రంలో 10,479 భాషా పండితులు, పీఈటీ ఉపాధ్యాయ పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేయడంతో వీరితో పాటుగా ఎస్జీటీల మధ్య వివాదం కొన్నేండ్లుగా సాగుతోంది. దీనిపై మార్గదర్శకాలు రావాల్సి ఉంది. మార్గదర్శకాలు లేకుండా ఈ అంశాన్ని ముట్టుకుంటే ఆజ్యం పోసినట్టే.