Supreme Court: రఘురామ ఎముక విరిగింది నిజమే.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

by Anukaran |   ( Updated:2021-05-21 02:33:01.0  )
supreme court
X

దిశ, వెబ్‌డెస్క్: తన తండ్రి అక్రమ అరెస్టు, కస్టడీలో పోలీసులు పెట్టిన హింసపై సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)తో దర్యాప్తు జరిపించాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కుమారుడు భరత్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు పర్యవేక్షణలో ఈ విచారణ జరిపించాలంటూ గురువారం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం దీనిపై విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పందిస్తూ.. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి మెడికల్ రిపోర్టు అందిందనీ, రఘురామ కాలి ఎముక విరిగిందని సుప్రీం స్పష్టం చేసింది. అంతేగాకుండా.. రఘురామ కాళ్లపై ఇతర గాయాలు కూడా ఉన్నాయని వెల్లడించింది.

రఘురామ తరపు లాయర్ కోర్టుకు వివరాలు వెళ్లడిస్తూ.. పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు రఘురామను కొట్టారన్నది నిజమైందని అన్నారు. ఒక ఎంపీకే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. దీనిపై సీబీఐ ఎంక్వైరీ వేయించాలని సుప్రీంకోర్టును కోరారు. దీనిపై అభ్యంతరం చెప్పిన సీఐడీ తరపు న్యాయవాది ఆ గాయాలు తనకు తానే చేసుకున్నాడేమో అని అన్నారు. దీనిపై విచారణ మంగళవారానికి వాయిదా వేయాలని సీఐడీ తరపున న్యాయవాది కోర్టును టైమ్ అడిగారు. దీనికి అభ్యంతరం చెప్పిన రఘురామ లాయర్.. ఇవాళే విచారణ పూర్తి చేసి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోర్టును కోరారు. తమకు ఎవరైనా ఒకటే అని స్పష్టం చేసిన సుప్రీం తదుపరి విచారణ మధ్యాహ్నం 2 :30 గంటలకు వాయిదా వేసింది.

Advertisement

Next Story