ప్రగతి భవన్ గోడ దాటని వ్యక్తి హెల్త్ మినిస్టరా..?

by Ramesh Goud |
Dasoju Sravan
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి డా.దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కు సోమవారం బహిరంగ లేఖ రాశారు. అనంతరం గాంధీ భవన్‌లో టీపీసీసీ ఫిషర్‌మెన్ చైర్మన్ మెట్టు సునీల్ కుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని తొలగించడం ద్వారా సీఎం కేసీఆర్ తన క్షుద్ర రాజకీయాలకే పాధాన్యత ఇస్తున్నారు తప్పితే ప్రజల ప్రాణాలపై బాధ్యతగా వ్యవహరించడం లేదనేది స్పష్టమైందని విమర్శించారు. కరోనా వైద్యానికి సంజీవనిలా పని చేస్తున్న రెమిడిసివిర్, టోసిలిజుమాబ్ వంటి మందులు కావాలంటే కేటీఆర్ సిఫార్సు కావాల్సి వస్తుందని ఆరోపించారు. ఈటెల ఆరోగ్య శాఖ మంత్రిగా కనీసం ప్రజలకు అందుబాటులో ఉండేవారని, కానీ కరోనా బాధితుడైన సీఎం కేసీఆర్ ఆ శాఖను తీసుకొని ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటాని వెనకడుగు వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ కోట గోడ దాటని కేసీఆర్ ప్రజలకు కల్పించే భరోసాఏంటని ప్రశ్నించారు.

ఆసుపత్రులలో బెడ్స్ లేక, సకాలంలో ఆక్సిజన్ అందక అనేక మంది మృత్యువాత పడుతున్నారని, ప్రజలు సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రెమిడిసివిర్, టోసిలిజుమాబ్ వంటి మందులను అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్నేషనల్ ఫార్మా హాబ్ గా పిలువబడుతున్న హైదరాబాద్‌లో కోవాక్సిన్ కొరత ఏర్పడటం దురదృష్ట కరమన్నారు. హెల్త్ కేర్ ప్రొఫెషనల్‌ను ఆరోగ్య మంత్రిగా నియమించాలని, కరోనాను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని, ఖాళీగా ఉన్న పోస్టులలో వైద్య సిబ్బందిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed