ఆస్తులు, డబ్బులు నాకు ఇవ్వండి.. మా నాన్న శవాన్ని మీరే తగలపెట్టండి

by Anukaran |   ( Updated:2021-05-24 05:57:29.0  )
ఆస్తులు, డబ్బులు నాకు ఇవ్వండి.. మా నాన్న శవాన్ని మీరే తగలపెట్టండి
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి గతేడాది నుండి ప్రపంచంపై దండయాత్ర చేస్తోంది. ఈ మహమ్మారి వలన రక్త సంబంధాలు మరుగున పడిపోతున్నాయి. సొంత తల్లిదండ్రులను.. పిల్లలు, కన్నబిడ్డలను.. తల్లిదండ్రులు రోడ్డుమీద వదిలేసి వస్తున్న దుస్థితి దాపురించింది. కరోనా వచ్చిందని తల్లిదండ్రులను బయటికి గెంటేసిన కొడుకు… కరోనా సోకిందని తండ్రి అంత్యక్రియలకు కూడా రాని బిడ్డలు .. ఇలా రోజుకో వార్త ఎక్కడోచోట వింటూనే ఉన్నాం. కానీ ఇక్కడ ఓ వ్యక్తి అంతకన్నా అమానుషంగా ప్రవర్తించాడు. కరోనా తో చనిపోయిన తన తండ్రి మృతదేహం అయితే అవసరం లేదుకానీ.. తండ్రి సంపాదించిన ఆస్తి మాత్రం కావాలంటూ పరుషంగా మాట్లాడాడు. ఈ దారుణ ఘటన మైసూరులో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే

మైసూరు హెబ్బాళలో ఉన్న సూర్య బేకరి వద్ద ఓ వృద్ధుడు నివసిస్తున్నాడు. అతని కుమారుడు పక్కనే ఉన్న కువెంపు నగర శాంతి సాగర్‌ కాంప్లెక్స్‌ వద్ద నివసిస్తుంటాడు. అయితే వృద్ధుడు ఇటీవలే కరోనా బారిన పడి చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరాడు. ఆదివారం చికిత్స పొందుతూ వృద్ధుడు మృతిచెందాడు. అయితే, ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది కొడుకుకు తెలియజేశారు. కానీ ఆ కొడుకు మాత్రం తన తండ్రి మృతదేహం తనకు అవసరంలేదని, దాన్ని మీరే తగులుపెట్టుకోండని పొగరుగా మాట్లాడాడు. అంతేకాకుండా స్థానిక కార్పొరేటర్‌ కేవీ శ్రీధర్‌కు ఫోన్‌ చేసి తన తండ్రి అంత్యక్రియలను పూర్తిచేసి, అతనివద్ద ఉన్న రూ. 6 లక్షల డబ్బులు, ఆస్తి పత్రాలను మాత్రం తనకు తెచ్చి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అతనిమాటలకు విస్తుపోయిన కార్పొరేటర్‌ వృద్ధుడి అంత్యక్రియలను కార్పొరేటర్‌ సిబ్బందితో కలిసి ముగించారు. తండ్రి కన్నా డబ్బే ముఖ్యం అంటున్న ఈ కొడుకును ఏం చేసినా పాపం లేదని చుట్టుపక్కలవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed