'ద్విచక్ర వాహన పరిశ్రమలపై కరోనా ప్రభావం తక్కువే'

by  |
ద్విచక్ర వాహన పరిశ్రమలపై కరోనా ప్రభావం తక్కువే
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 ప్రభావంతో ఆటోమొబైల్ రంగం దారుణంగా దెబ్బ తిన్నప్పటికీ, ద్విచక్ర వాహన పరిశ్రమ కొంతకాలమే సవాళ్లను ఎదుర్కొంటుందని, మొత్తంగా చూస్తే దీర్ఘ కాలంలో ద్విచక్ర వాహన పరిశ్రమ వృద్ధి పటిష్టంగా, సానుకూలంగా ఉంటుందని దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ వెల్లడించింది. 2019-20 వార్షిక నివేదికలో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్నటువంటి వృద్ధి అవకాశాలపై నివేదికను కంపెనీ వెల్లడించింది. ఈ సందర్భంగా హీరో మోటోకార్ప్ ఛైర్మన్ పవన్ ముంజల్ మాట్లాడుతూ..కరోనా వైరస్ తమ వ్యాపార భవిష్యత్తుపై స్వల్పకాలమే ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. మిగిలిన వాహన పరిశ్రమల కంటే ద్విచక్ర వాహన పరిశ్రమ బలంగా ఉందని పవన్ పేర్కొన్నారు. హీరో మోటోకార్ప్ గడిచిన ఐదేళ్లలో 40 దేశాలకు పైగా విస్తరించగలిగాం. అంతేకాకుండా ఆర్అండ్‌డీ విభాగంలో ఇతర కంపెనీల కంటే రెట్టింపు పెట్టుబడులను పెట్టగలిగాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 10 కోట్ల మోటార్ సైకిళ్లు, స్కూటర్ల విక్రయాలను సాధించిన రికార్డును సంపాదించాం. రానున్న రోజుల్లో ఇదే కృషితో ప్రపంచ రికార్డును నమోదు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పవన్ ముంజల్ తెలిపారు. భవిష్యత్తుల్లో తక్కువ సమయంలోనే కంపెనీని రుణ రహిత సంస్థగా మార్చబోతున్నామని, పటిష్టమైన బ్యాలెన్స్ షీట్‌తో దీన్ని సాధ్యం చేయబోతున్నామని పవన్ వివరించారు.


Next Story