గొర్రెలకు మురికి అంటిదని ఆ పని చేసిన గొర్రెల కాపరి.. చివరికి

by Shyam |
గొర్రెలకు మురికి అంటిదని ఆ పని చేసిన గొర్రెల కాపరి.. చివరికి
X

దిశ, ఆర్మూర్: మాక్లూర్ మండలం చిక్లీ శివారులోని పూలాంగ్ వాగులో ప్రమాదవశాత్తు పడి ఓ గొర్రెల కాపరి మృతిచెందాడు. వివరాలలోకి వెళితే.. చిక్లీ గ్రామానికి చెందిన పంగెర రామన్న (52), అతని కుమారుడు పంగెర నవీన్ తో పాటు మరో కుర్రాడు దూడ రూపేశ్.. ముగ్గురు రోజూలాగే సోమవారం ఉదయం గొర్రెలను మేతకు తీసుకుని వెళ్లారు. ఇటీవల కురిసిన వర్షం కారణంగా కొట్టం వద్ద తడిసిన గొర్రెలకు ఒళ్లంతా బురద అంటుకుందని, వాగునీటిలో కడిగి ఆవలి వైపు దాటిద్దామనుకున్నారు. వాగులో నుంచి ఆవలి వైపు దాటిన గొర్రెలను ఒకచోట ఆపడానికి పంగెర నవీన్ ముందుగానే సమీప డ్యామ్ వద్ద వాగు దాటి వెళ్లిపోయాడు. రామన్న ఒక్కో గొర్రెను కడుగుతూ వాగు దాటించాడు.

చివరగా ఓ పొట్టేలు కడుగుతుండగా అది ఒళ్లు జలదరించింది. ఒక్కసారిగా రామన్నపై ఒత్తిడి పడడంతో అదుపు తప్పి నీటిలో పడిపోయాడు. ఈత వచ్చినప్పటికి వాగులో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడం, రామన్న వయసు మళ్లిన వ్యక్తి కావడంతో వరద ధాటికి ఎదురీదలేక మృత్యువాత పడ్డాడు. ఈ విషయమై గ్రామస్తులు.. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ షఫీ ఘటనా స్థలిని పరిశీలించారు. గ్రామస్తుల సహాయంతో సోమవారం సాయంత్రం వరకు గాలించినా రామన్న జాడ దొరకలేదు. చీకటి పడడంతో గాలింపు చర్యలు నిలిపివేశామని ఆర్ఐ చెప్పారు. తిరిగి మంగళవారం ఉదయం గాలింపు కొనసాగించారు. జాలర్లు చేపలు పట్టేందుకు వినియోగించే వలల సహాయంతో నీటిలో వెతకగా, మృతదేహం లభించింది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి పంపారు.

Advertisement

Next Story