దళితబస్తీ భూములపై ఆ నలుగురి అక్రమాల వరద

by Aamani |   ( Updated:2021-03-31 04:15:01.0  )
ruling party leaders
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: అధికార పార్టీ నేతలు, నాయకులే అక్రమార్కులు. ఆ నలుగురే అన్నీ తామై దళితబస్తీ భూముల కథ నడిపిస్తుండగా. స్థానిక సర్పంచిని కలుపుకుని ముందుకు సాగుతున్నారు. అనుకూలంగా ఉన్న అధికారులతో భూపంపిణీలో అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు.. భూముల ఎంపిక నుంచి పంపిణీ. చివరికి పెట్టుబడి సాయం వరకు అంతా వారి కనుసన్నల్లోనే సాగుతోంది. ముధోల్ సెగ్మెంటులోని పలు గ్రామాల్లో రైతులను మచ్చిక చేసుకుని. తక్కువ ధర పలికే భూములను ఎక్కువ ఇస్తామని ఆశ పెడుతున్నారు. ముందే ధర మాట్లాడి అగ్రిమెంట్ చేసుకుని సర్కారుకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.. రైతులు, సర్కారును మోసం చేసి డబ్బులు కాజేస్తున్నారు.. ముందే చెక్కులు, వోచర్లపై సంతకాలు చేసుకుని. రైతుల ఖాతాల్లో డబ్బులు పడిన రోజే తమ ఖాతాకు మళ్లిస్తుండటం గమనార్హం.

ముధోల్ సెగ్మెంటులోనే అక్రమాల వరద..

దళిత బస్తీ పథకంలో అక్రమాలు ఎక్కువగా ముధోల్ నియోజకవర్గంలోనే జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 123.13ఎకరాల భూమిని రూ.54.90కోట్లతో కొనుగోలు చేసి.. 524మందికి పంపిణీ చేశారు. ఒక్క ముధోల్ సెగ్మెంటులోనే 1005.05ఎకరాల భూమిని రూ.42.08 కోట్లతో కొనుగోలు చేసి.. 439మంది లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఇప్పటికే రూ.39.66కోట్ల విలువైన 939.02 ఎకరాల భూమి 418మంది లబ్దిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. మరో 21మంది లబ్దిదారులకు 61.04ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉండగా.. రూ.2.38కోట్లు వెచ్చిస్తున్నారు. నిర్మల్, ఖానాపూర్ సెగ్మెంట్లలో కలిపి 224.58ఎకరాల భూమిని 85మందికి పంచగా.. ఇందుకు రూ.11.85కోట్లు మాత్రమే వెచ్చించారు. ఖానాపూర్లో 27మందికి 79.28ఎకరాలను పంచగా.. రూ.3.09కోట్లు వెచ్చించారు. నిర్మల్లో 58మందికి 145.30ఎకరాలు పంచగా.. రూ.8.76కోట్లు మాత్రమే వెచ్చించారు.

మూడు మండలాల్లోనే భూమాయ

సెగ్మెంటులో ఏడు మండలాలుండగా.. ఒక్క బాసర మినహా మిగతా అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. తానూరు, కుభీర్, భైంసా మండలాల్లోనే పెద్ద ఎత్తున దందా చేస్తున్నారు. ఈ మూడు మండలాల్లోనే 841ఎకరాల భూమిని కొనుగోలు చేసి.. పంపిణీ చేశారు. భైంసా మండలంలో రూ.19.43కోట్లతో 445.23ఎకరాలు 178మందికి, కుభీర్ మండలంలో రూ.9.30కోట్లతో 248.37ఎకరాలు 114మందికి, తానూర్ మండలంలో రూ.6.97కోట్లతో 146.20ఎకరాల భూమిని 92మంది లబ్దిదారులకు పంపిణీ చేశారు. ముఖ్యంగా తానూరు, కుభీర్ మండలాలు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండగా.. గుట్టలతో కూడిన భూములు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ధరలు తక్కువ ఉండటం.. అంత సారవంతమైనవి కాకపోవటంతో దళితబస్తీ దళారులు ఈ మండలాలనే ఎంచుకున్నారు. కుభీర్, తానూరు మండలాల్లో తక్కువ ధర పలికే వాటికి కొంచెం ఎక్కువ ఇస్తామనటంతో రైతులు ఇచ్చేస్తుండగా.. దళారులు, నాయకులు సర్కారుకు ఎక్కువ ధరకు విక్రయించి ఎకరానికి రూ.1.50లక్షల నుంచి రూ.2లక్షల వరకు వెనకేసుకుంటున్నారు.

అధికారం అండగా.. నాయకులకు పండగ

ఈ వ్యవహారం పూర్తిగా టీఆర్ఎస్‌కు చెందిన తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధుల భర్తలే మధ్యవర్తులుగా ఉండి నడిపిస్తున్నారు. ఓ జెడ్పీటీసీ సభ్యురాలి భర్త, స్థానిక సంస్థల్లో కీలక పదవిలో ఉన్న ఆమె భర్త, ఓ కీలక ప్రజాప్రతినిధికి ‘ఆత్మ’గా చెప్పుకునే నాయకుడు, ఓ మాజీ జెడ్పీటీసీ సభ్యురాలి కుమారుడు దళిత బస్తీ భూముల క్రయవిక్రయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నలుగురు కలిసి స్థానిక సర్పంచిని ఒప్పించి. మెప్పిస్తున్నారు. తీర్మానం ఇచ్చినందుకు ఆయన వాటా ముందే మాట్లాడుకుని కథ నడిపిస్తున్నారు. ఏమైనా లబ్దిదారుల నుంచి సమస్యలు వస్తే. స్థానిక సర్పంచితో పాటు మండల నేతలు చూసుకుంటున్నారు. మీరు నేరుగా వెళ్తే కొనుగోలు చేయరని.. చేసినా.. తాము అడ్డుకుంటామని బెదిరిస్తున్నారు. అధికారులు కూడా దళారులు చెప్పిందే వింటున్నారు. నేరుగా వచ్చిన వారిని ప్రోత్సహించటం లేదు. వివిధ రకాల నిబంధనల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు. చెక్కులు, వోచర్లతో దందా చేస్తుండగా.. ముందే సంతకాలు తీసుకుంటున్నారు. మహాలింగిలో దళిత బస్తీకి భూములు ఇచ్చిన వారి బెల్తరోడా గ్రామీణ బ్యాంకు ఖాతా నుంచి ఓ తాజా మాజీ ప్రజాప్రతినిధి ఖాతాకు వోచర్లపై రూ.లక్షల్లో బదలాయింపు కావటం కొసమెరుపు.

తాజాగా గుట్ట భూములకు ఎసరు

ముధోల్ నియోజకవర్గంలోని మరికొన్ని గ్రామాల్లో దళిత బస్తీ పథకం కింద దళితులకు భూములు కేటాయించడానికి నిధులు భారీగా కేటాయించారు. ఇప్పటికే కొనుగోలు చేసిన తానూరు మండలం కోలూరు, మహాలింగితో పాటు కొత్తగా మొగ్లీ, హిప్నెల్లి, బెల్తరోడ గ్రామాల్లో భూముల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ భూములను అధికారులు పరిశీలించగా.. కొనుగోలుకు రంగం సిద్ధమవుతోంది. ఇక్కడ కూడా కొండలు, గుట్టలపై ఉన్న రాళ్లు, రప్పల భూములను కొనేందుకు రెడీ అయ్యారు. ఇందులోనూ ముందే మధ్యవర్తులైన రాజకీయ నాయకులు రైతులకు తక్కువ ధరకు ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. మొగ్లీలో 42ఎకరాలు, హిప్నెల్లిలో 14ఎకరాలు, మహాలింగిలో 18ఎకరాలు, కోలూరులో 34ఎకరాలు తక్కువ ధరకు ఒప్పందం చేసుకుని.. సర్కారుకు అధిక ధరలకు విక్రయించేందుకు రంగం సిద్ధమైంది. సర్పంచ్‌లు అనుకూలంగా లేని చోట విక్రయదారులు, లబ్దిదారులు రెండు గ్రూపులుగా విభజించి ఆట ఆడుతున్నారు. తానూరు మండలం బెల్తరోడాలో ప్రస్తుతం దళితబస్తీ భూముల వ్యవహారం వివాదంగా మారింది. ఎవరికి వారు వచ్చి విక్రయించేందుకు వస్తే.. డాక్యుమెంటేషన్ చేయటం వారి వల్ల కాదని ఎస్సీ కార్పొరేషన్ అధికారులు చెప్పటం గమనార్హం. దళారులు, అధికారులు కలిసి దందా చేయటంతో.. అటు సర్కారు లక్ష్యం.. ఇటు తమ లక్ష్యం చేరుకోవటంతో ఇదే బాగుందని బహిరంగంగా అధికారులు చెప్పటం విచారకరం.

Advertisement

Next Story