- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతా మా ఇష్టం.. మా వెనక ఎవరున్నరో తెలుసా..?
దిశ, శేరిలింగంపల్లి: ఓవైపు కేసులు.., మరోవైపు విమర్శలు. అయినా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారుల తీరుమారడం లేదు. అధికారులు, కిందిస్థాయి సిబ్బంది పనితీరుపై విమర్శలు గుప్పుమంటున్నా.. లైట్ తీసుకుంటున్నారు. నాయకులకు వత్తాసు పలుకుతూ.. అక్రమ నిర్మాణాలను వదిలేస్తూ జేబులు నింపేసుకుంటున్నారు. అనేవాళ్లు అంటూనే ఉంటారు.. మనం చేసే పని చేసుకుందాం అంటూ జీహెచ్ఎంసీ పెద్దసార్ ఇటీవల ఓ మేడం పోలీసు కేసు విషయంపై స్పందిస్తూ ఈ మాట చెప్పారట. ఇంకేముంది సారే అంతమాట అన్నాక మనకెదురేముంది అని రెచ్చిపోతున్నారు సిబ్బంది. ఉన్నతస్థాయి అధికారుల నుంచి మొదలు బిల్ కలెక్టర్లు, చైన్ మన్ల వరకూ అందరిదీ ఇదే దారి.
కూకట్ పల్లి, చందానగర్, శేరిలింగంపల్లి సర్కిళ్లలో జరుగుతున్న అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులే దగ్గరుండి మరీ నిర్మాణాలు కొనసాగేలా చూసుకుంటున్నారట. ఇందుకు గట్టిగానే ముడుపులు ముడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. అదీగాక ఎవరైనా అక్రమం అని వేలెత్తి చూపితే డైరెక్ట్ గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని అధికార పార్టీ పెద్దలు సైతం బిల్డర్లకు సూచించారట. ఇంకేముంది చేస్తున్న తప్పుడు పనులకు ఆఫీసర్లు, అధికార పార్టీ పెద్దలే వత్తాసు పలుకుతుండడంతో కబ్జారాయుళ్లు, అక్రమ నిర్మాణదారులు రెచ్చిపోతున్నారు. నాలాలపై కట్టడాలు కట్టేస్తున్నారు. ఈ తరహా కట్టడాలకు శేరిలింగంపల్లి నియోజకవర్గం కేరాఫ్ అడ్రస్ గా మారింది.
మా వెనక ఎవరున్నరో తెలుసా..?
నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి, చందానగర్, కూకట్ పల్లి సర్కిళ్లలో అడ్డగోలుగా వెలుస్తున్న బహుళ అంతస్తుల భవనాల విషయంలో అనేకసార్లు అధికారులపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ మండిపడ్డారు. అయినా ఎక్కడా ఏ కట్టడం ఆగలేదు.. సరికదా ఇంకా ఎక్కువయ్యాయి. అదేంటి అంటే బహుళ అంతస్తుల నిర్మాణాలు సాగుతుంటే స్టార్టింగ్ స్టేజీలో కూల్చకుండా ఐదు అంతస్తులు కట్టే వరకూ చైన్ మెన్ల నుంచి డీసీ స్థాయి అధికారుల వరకు ఎటు వెళ్లారు..? అప్పుడు కూల్చకుండా ఇప్పుడు ఎలా కూలుస్తారు..? అని ఎమ్మెల్యే గట్టిగానే క్లాస్ ఇచ్చారు జీహెచ్ఎంసీ సిబ్బందికి. అక్రమకట్టడాలు అని తెలిసినా ఇప్పుడు సిబ్బంది చోద్యం చూస్తున్నారు. అటు బిల్డర్లు కూడా జీహెచ్ఎంసీ అధికారులకు, సిబ్బందికి నయానో భయానో ముట్టచెప్పి ఆ వైపు కన్నెత్తి చూడకుండా సర్దుబాట్లు చేసేస్తున్నారని వినికిడి.
అధికార పార్టీ నేతలైతే ఓకే..
అక్రమ కట్టడాల నిర్మాణంలో అధికార పార్టీ పెద్దలు ముందు వరుసలో ఉన్నారు. అనునిత్యం ప్రభుత్వ విప్ వెన్నంటే ఉండే ఓ డివిజన్ అధ్యక్షుడు పలుచోట్ల అక్రమ కట్టడాలకు పునాదులు వేశారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్నిచోట్ల అయితే వివాదాస్పద భూముల్లోనే బహుళ అంతస్తుల భవనాలు కట్టేస్తున్నారు. అయినా జీహెచ్ఎంసీ సిబ్బందికి, రెవెన్యూ అధికారులకు ఇవేమీ పట్టడంలేదు. అసలే అధికార పార్టీ నాయకుడు, మాకెందుకు ఈ గొడవ అని లైట్ తీసుకుంటున్నారు. చాలా డివిజన్లలో జరుగుతున్న అక్రమ కట్టడాల వెనక అధికార పార్టీ నాయకులు, ప్రత్యక్షంగా, లేక పరోక్షంగా కీలకంగా వ్యవహరిస్తున్నారని, తాము చెప్పిందే చేయాలి అన్నట్లుగా హుకుం జారీ చేస్తున్నారని, అందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఉడతా భక్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మేమేం తక్కువ కాదు
జీహెచ్ఎంసీ అధికారుల పనితీరు, వ్యవహార శైలిపై వస్తున్న విమర్శలను వారు లైట్ తీసుకుంటున్నారనే చెప్పాలి. అంతేకాదు చాలాచోట్ల గ్రేటర్ బల్దియా అధికారులు తమ చేతి వాటాన్ని గట్టిగానే ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరైనా అక్రమ కట్టడం గురించి ప్రశ్నిస్తే మాఇష్టం.. మీకు చేతనైంది చేసుకోండి అని మొహం మీదే చెప్పేస్తున్నారు. హై కోర్ట్ ఆర్డర్ అంటూ ఇటీవల కొన్ని ఇళ్లను సీజ్ చేసిన టీపీఎస్ అధికారి ఆ తర్వాత మిన్నకుండి పోయారు. ఇక హైదర్ నగర్ సర్వే నెంబర్ 172లో సెట్విన్ స్థలంలో ఉన్న నిర్మాణానికి సంబంధించి భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయని సమాచారం. గూగుల్ మ్యాప్ లో క్లియర్ గా సెట్విన్ స్థలమే అని కనిపిస్తుంది. అది ప్రభుత్వ భూమి అని తెలిసే అనుమతులు ఇచ్చిన అధికారులు దానిపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. సదరు బిల్డర్ వెనకా అధికార పార్టీ పెద్ద నాయకుడు ఉన్నాడని, ఆయన కనుసన్నల్లోనే ఈతతంగం అంతా నడుస్తుందన్న విమర్శలు ఉన్నాయి.
బిల్ కలెక్టర్ వసూళ్లు..
వీరందిరిది ఒక ఎత్తయితే కూకట్ పల్లి సర్కిల్ పరిధిలోని బిల్ కలెక్టర్ ది మరో ఎత్తు. ఈయనగారు జీహెచ్ఎంసీ నిబంధనలు పాటించడాన్ని పక్కన పెట్టి, తన సొంత నిర్ణయాలకే ఎక్కువ ప్రియార్టీ ఇస్తారు. సెట్విన్ కాలనీలో ఉన్నతాధికారుల ఆర్డర్ ను బేఖాతరు చేసి తన ఇష్టానుసారంగా పీటీఐ నెంబర్లు, ఇంటి నెంబర్లు కేటాయించారు. అక్కడే మరో నిర్మాణానికి అనుమతి కూడా రాకముందే అప్లై చేశారని అత్యుత్సాహంతో ముందే పీటీఐ నెంబర్లు, ఇంటి నెంబర్లు ఇచ్చేశాడు. అలాగే హైదర్ నగర్ లో ఓ వ్యక్తి 130 గజాల ఇంటి స్థలంలోపు నిర్మాణానికి అప్లై చేసిన వెంటనే తానే వారసులకు ఒక్కోరికి షేర్ డివైడ్ చేసి, తలా 30 గజాల లోపు ఇంటి నిర్మాణం చేసుకోవచ్చని పీటీఐ నెంబర్లు, ఇంటి నెంబర్లు ఇచ్చేశాడు. ఇందుకోసం సదరు నిర్మాణదారుడి వద్ద భారీ ఎత్తున డబ్బులు లాగాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ బిల్ కలెక్టర్ అసిస్టెంట్ గా వచ్చి అతి తక్కువ కాలంలోనే అందనంత స్థాయికి ఎదిగి పోయారట, ఇంటి నెంబర్ల కేటాయింపు పేరున నిర్మాణదారులను ముక్కుపిండి మరీ వసూళ్లు చేస్తాడని పేరుంది. ఇలా జీహెచ్ఎంసీలో ఎవరికి వారే నేనే రాజు నేనే మంత్రి అనే రేంజ్ లో రెచ్చిపోతున్నారు. వీరికి విధి నిర్వహణకంటే ఆమ్యామ్యాలపైనే మమకారం ఎక్కువని వేరే చెప్పాల్సిన పనిలేదు.