ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక

by Shyam |   ( Updated:2020-07-28 11:14:22.0  )
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ప్రైవేటు విద్యా సంస్థల వేధింపులు, చదువుల ఒత్తిడి భరించలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని బాధితుల తరఫున ఒక విద్యార్థి తల్లిదండ్రులు రెండేళ్ళ క్రితం దాఖలు చేసిన పిటిషన్లపై ఇప్పటికే వరుస విచారణలు జరిగాయి. తాజాగా శుక్రవారం కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ జరిపి అలాంటి ప్రైవేటు విద్యా సంస్థలపై తీసుకున్న చర్యలు, అవి స్పందించిన తీరు తదితరాలపై నివేదిక సమర్పించడానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది. ఈ నివేదికను పిటిషనర్లకు కూడా పంపి వారి అభిప్రాయాలను కూడా తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్టు కార్యదర్శిని ఆదేశించింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వందలాది మంది ఇంటర్ విద్యార్థులు చదువుల ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని 2018 జనవరిలో మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శిని కమిషన్ ఆదేశించింది. అదే సంవత్సరం నవంబరులో నివేదిక సమర్పించడంతో అందులో పేర్కొన్న అంశాలు మొక్కుబడిగా ఉన్నాయంటూ పిటిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని అవి ఉల్లంఘించాయని, తగిన మౌలిక సౌకర్యాలు లేవని, చాలా ఇరుకైన స్థలాల్లో పనిచేస్తున్నాయని, కానీ ఇంటర్ బోర్డు మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైందంటూ సాకు చెప్పి కమిషన్ విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు ఈ నివేదిక ద్వారా అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. దీనికి సానుకూలంగా స్పందించిన కమిషన్ ప్రైవేటు విద్యా సంస్థల్లోని హాస్టళ్ళ నిర్వహణపైన ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా తెలంగాణ ఇంటర్ బోర్డును ఆదేశించింది.

కానీ నిర్దిష్ట సమయానికి నివేదిక ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించిన ఇంటర్ బోర్డు పలుమార్లు గడువు ఇవ్వాలని కోరుతో ఈ ఏడాది జనవరిలో నివేదిక సమర్పించింది. తెలంగాణలో నిబంధనలను ఉల్లంఘించిన 194ప్రైవేటు జూనియర్ కళాశాలలపై రూ. 1.66కోట్ల మేర జరిమానా విధించామని పేర్కొన్నారు. శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థల గుర్తింపు రద్దుకు సంబంధించి షోకాజ్ నోటీసులు జారీ చేశామని, పెనాల్టీ కట్టేవరకు కళాశాలలు పనిచేయకుండా ఆంక్షలు విధించామని ఇటీవల కమిషన్‌కు నివేదిక సమర్పించింది. అనుమతి లేకుండా నడుస్తున్న హాస్టళ్ళకు సంబంధించి కూడా నోటీసులు జారీ చేసినట్లు నివేదికలో ఇంటర్ బోర్డు కార్యదర్శి పేర్కొన్నారు. సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించినందుకు జరిమానా విధించామని, విద్యార్థులతో పాటు తల్లిదండ్రులతో ఒక ఓరియంటేషన్ క్యాంపు నిర్వహించామని పేర్కొన్నారు.

ఇప్పటివరకు ఆ ప్రైవేటు విద్యాసంస్థలపై తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో పొందుపరిచి పిటిషనర్‌కు కూడా అందజేసి వారి అభిప్రాయాలను కూడా సేకరించి నాలుగు వారాల్లోగా కమిషన్‌కు సమర్పించాలని ఆదేశించి తదుపరి విచారణను సెప్టెంబరు 4వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed