గుంతలో పడ్డాడని.. హెచ్ ఆర్సీలో ఫిర్యాదు

by Shyam |
గుంతలో పడ్డాడని.. హెచ్ ఆర్సీలో ఫిర్యాదు
X

దిశ, శేరిలింగంపల్లి : మహనగరాన్ని గుంతలు లేని నగరంగా మారుస్తామని, హైదరాబాద్ లో ఒక్క గుంత చూపించినా వెయ్యి రూపాయలు ఇస్తామంటూ ప్రకటనలు చేసింది టీఆర్ ఎస్ సర్కార్. కానీ ఎక్కడికక్కడ గుంతలు కనిపిస్తున్నాయి. ఇలాంటి గుంతల్లో పడి, నా వెన్నుముకకు గాయం అయ్యిందంటూ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాడు ఓ సామాజిక కార్యకర్త.


వివరాల్లోకి వెళితే.. మియాపూర్‌కు చెందిన సామాజిక కార్యక‌ర్త వంగ‌ల విన‌య్ 2020 డిసెంబ‌ర్ 3 న‌ త‌న ద్విచ‌క్ర వాహ‌నంపై మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్ వైపు వెళుతున్నాడు. గంగారం వ‌ద్దకు రాగానే రోడ్డుపై ఉన్న ఓ గుంతలో బైక్ ప‌డి అత‌డి వెన్నెముక‌కు గాయ‌మైంది. దీంతో చికిత్స తీసుకున్న వినయ్ కుమార్ డిసెంబ‌ర్ 6న ఇదే విషయంపై పోలీస్‌ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ర‌హ‌దారి ప‌ర్యవేక్షణ లోపం వ‌ల్లే త‌న‌కు గాయ‌మ‌య్యింద‌ని అందుకు భాద్యులైన‌ సంబంధిత అధికారుల‌పై చ‌ర్యలు తీసుకోవాల‌ని తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతం చందాన‌గ‌ర్ పోలీస్‌ స్టేష‌న్ ప‌రిధిలోకి వ‌స్తుందంటూ మియాపూర్ పోలీసులు ఫిర్యాదును చందాన‌గ‌ర్‌ కు పీఎస్‌కు బ‌దిలీ చేశారు. అయినా వినయ్ కుమార్ కేసును మాత్రం గాలికి వదిలేశారు పోలీసులు. దీంతో బాధితుడు ఈ ఏడాది జనవరిలో మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు.

వినయ్ కుమార్ ఫిర్యాదుపై స్పందించిన మానవ హక్కుల కమిషన్ శుక్రవారం చందాన‌గ‌ర్ ఇన్స్ పెక్టర్ కు నోటీసులు జారీచేసింది. విన‌య్ చేసిన ఫిర్యాదులోని స‌మ‌స్య ఏ శాఖ ప‌రిధిలోకి వ‌స్తుంది..? భాద్యుల‌పై చ‌ర్యలు తీసుకున్నారా..? లాంటి పూర్తి వివ‌రాల‌తో జూన్ 21న ఉద‌యం 11 గంట‌ల‌కు క‌మిష‌న్ ముందు హాజ‌రు కావాల‌ని ఇన్స్ పెక్టర్ ను ఆదేశించింది. ఈ సంద‌ర్భంగా వంగ‌ల విన‌య్ మాట్లాడుతూ.. న‌గ‌రంలో రోడ్లు ఎక్కడికక్కడ దెబ్బతిని వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని, గుంత‌ల కార‌ణంగా ప‌లువురు మృతి చెందిన సంఘ‌ట‌నలు ఉన్నాయ‌న్నారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వ‌ల్ల సామాన్యుల‌ ఆరోగ్యం దెబ్బతిని, ఆర్ధికంగా న‌ష్టపోవ‌డంతో పాటు విలువైన స‌మ‌యం వృధా అవుతుంద‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు.

Advertisement

Next Story