జోష్‌లో కాంగ్రెస్.. రేవంత్ సమక్షంలో చేరనున్న కీలక నేత!

by Shyam |   ( Updated:2021-09-22 01:47:07.0  )
Congress party, TPCC chief Revanth Reddy
X

దిశ, భూపాలపల్లి: ఏఐబీఎఫ్‌(ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్) రాష్ట్ర నాయకులు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈనెల 30న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్‌లో చేరడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం గత నాలుగు రోజుల క్రితం మాజీ మంత్రి శ్రీధర్ బాబును కలిసి సంప్రదింపులు జరిపి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని అధిష్టానం ప్రకటించిన నాటినుంచే గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లో కలిసి కాంగ్రెస్‌లో చేరేందుకు తన సుముఖతను సైతం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు తెలుగుదేశం పార్టీలో కలిసి పని చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే వారు అత్యంత సన్నిహితులు కావడంతో పార్టీలో చేరడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.

Gandra-Satyanarayana-Rao

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు ఇద్దరూ ఒకేసారి తెలుగు దేశం పార్టీ తరపున జెడ్పీటీసీగా గెలుపొందారు. గండ్ర సత్యనారాయణ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామానికి చెందిన వ్యక్తి. మొదటసారిగా గణపురం జెడ్పీటీసీగా గెలిచారు. అనంతరం ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత భూపాలపల్లి నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. మొదట బీజేపీ పార్టీ నుంచి, రెండోసారి స్వతంత్ర అభ్యర్థిగా, మూడోసారి ఏఐబీఎఫ్ పార్టీ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యాడు. చివరిసారి పోటీ చేసినప్పుడు రెండో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అతనికి కాంగ్రెస్ పార్టీతో పాటు ఏఐబీఎఫ్ కార్యకర్తలు, స్వతంత్రులు మద్దతు తెలిపే అవకాశముంది.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed