- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చరిత్రలో నిలిచిన యుద్ధం.. శత్రువుల సంఖ్యాబలానికి వెరవని ధీర సైనికులు
దిశ, ఫీచర్స్ : చరిత్ర గతిని పరిశీలిస్తే.. అధికార వాంఛ, సామ్రాజ్య విస్తరణ కాంక్షతో పొరుగు దేశాలపై దండెత్తి, రాజ్యాలను హస్తగతం చేసుకున్న కథలు చాలా విన్నాం. శత్రువు బలవంతుడైతే సంధి చేసుకోవడం, బలహీనుడైతే యుద్ధం పేరుతో బెదిరించి మోకరిల్లేలా చేసుకోవడం తెలిసిందే. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన వెనుక ఇలాంటి ఎత్తుగడలే ఉండగా.. చరిత్రలో నిలిచిపోయిన కొన్ని యుద్ధాల వెనకున్న నేపథ్యం తెలిస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఓటమి అంచుల్లోనూ శత్రువుకు వెన్నుచూపని వీరుల ధీరత్వం, చివరి రక్తపు బొట్టు వరకు ప్రదర్శించిన పోరాటతత్వం గురించి వింటే కళ్లు చెమరుస్తాయి. అలాంటి బ్యాక్‌డ్రాప్ స్టోరీతో చరిత్రలో నిలిచిన యుద్ధమే ‘సరాగఢీ’. 1897లో ఇండియాలో భాగంగా ఉన్న పాకిస్థాన్, ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్స్‌లోని సమన వ్యాలీలో 10వేల మంది అఫ్ఘాన్లపై బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ తరఫున 21 మంది సిక్కు సైనికులు చేసిన పోరాటం చిరస్మరణీయం. ఈ యుద్ధం చరిత్రలో నిలిచిపోగా, 124వ వార్షికోత్సవం సందర్భంగా మరొక్కసారి వారి త్యాగాలను స్మరించుకుందాం..
సరాగఢీ ఎక్కడ ఉంది?
సమన రేంజ్(ప్రస్తుత పాకిస్థాన్), కోహట్ జిల్లాలోని ఒక చిన్న గ్రామమే సరాగఢీ. తిరుగుబాటుదారులైన పష్టూన్ల నుంచి దాడులు ఎదుర్కొన్నప్పటికీ, బ్రిటిష్ వారు ఖైబర్ పఖ్తున్వా ప్రాంతంపై నియంత్రణ సాధించడంలో విజయం సాధించారు. ఈ సమయంలో నార్త్ వెస్టర్న్ రీజియన్‌లో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి హెడ్ క్వార్టర్స్‌గా సేవలందించిన ఫోర్ట్ లాక్‌హార్ట్, ఫోర్ట్ గుల్లిస్తాన్ మధ్య సరాగఢీ గ్రామం కమ్యూనికేషన్ పోస్ట్‌గా వ్యవహరించింది. ఈ రెండు కోటలు కొన్ని మైళ్ల దూరంలోనే ఉన్నా ఒకదానికొకటి కనిపించనందున ఈ ఏర్పాటు చేయబడింది.
గ్రేటెస్ట్ లాస్ట్ స్టాండ్ ఇన్ హిస్టరీ!
బాలీవుడ్ మూవీ ‘కేసరి’ చూసినవారికి ‘సరాగఢీ’ యుద్ధంలో 21 మంది సిక్కు సైనికుల ధీరత్వం గురించి తెలిసే ఉంటుంది. 1897 ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు పష్టూన్లు.. పటిష్టమైన బ్రిటిష్ కోటలపై దాడిచేసేందుకు ప్రయత్నించారు. కానీ కల్నల్ హాటన్ నేతృత్వంలోని 36వ సిక్కు రెజిమెంట్ ప్రతీసారి వారి ప్రయత్నాలను తిప్పికొట్టింది. ఈ క్రమంలో సరాగఢీ, ఫోర్ట్ లాక్‌హార్ట్ మధ్య కమ్యూనికేషన్ హెలియోగ్రాఫిక్ ప్రాసెస్‌లో జరిగింది. దీంతో ఈ రెండు కోటల మధ్య కమ్యూనికేషన్‌ను విచ్ఛిన్నం చేసేందుకు దాదాపు 10వేల మంది పష్టూన్లు సెప్టెంబర్ 12, 1897న సరాగఢీపై దాడి చేశారు. ఈ క్రమంలోనే 21 మంది సిక్కులు తాము బుల్లెట్ గాయాలకు బలవడానికి ముందు 600కు పైగా శత్రువులను మట్టుబెట్టారు. ఈ హిస్టారికల్ వార్‌లో ‘36వ సిక్కు రెజిమెంటల్ లీడర్’ ఇషార్ సింగ్ ఒక్కడే 20కి పైగా శత్రువులను హతమార్చాడు. అందుకే ఈ యుద్ధాన్ని చరిత్రలో నిలిచిన గొప్ప యుద్ధాల్లో ఒకటిగా పేర్కొన్నారు.
ఆల్ టైమ్ హిస్టరీ..
ఈ యుద్ధం ఎందుకంత ప్రత్యేకమైందంటే.. 21 మంది సైనికులు తమ దేశం కోసం ప్రాణ త్యాగం చేశారు. అదనపు బలగాలు మోహరించే వరకు ఒక రోజు మొత్తం పదివేల మంది శత్రువులను నిలువరించగలిగారు. ముందుగా లండన్‌లోని బ్రిటిష్ పార్లమెంట్‌కు చేరిన ఈ న్యూస్‌కు స్టాండింగ్ ఒవేషన్ లభించినా 36వ సిక్కు రెజిమెంట్ సైనికులు గుర్తించబడలేదు. అయితే ఆ 21 మంది సైనికుల పోరాటపటిమను గుర్తించిన తర్వాత వారి పేర్లతో ఒక స్మారక ఫలకాన్ని ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వ చొరవతోనే ఈ 21 మంది నాన్-కమిషన్డ్ ఆఫీసర్స్, బెంగాల్ పదాతిదళానికి చెందిన 36వ సిక్కు రెజిమెంట్ టీమ్ జ్ఞాపకార్థంగా శిలాఫలకం ఏర్పాటు చేయబడింది. 12 సెప్టెంబర్ 1897న సరాగఢీ కోట రక్షణలో అమరులైన సైనికులు చూపిన వీరత్వానికి ప్రతీకగా శాశ్వత రికార్డులుగా పేర్లు చెక్కబడ్డాయి. శత్రువుల సంఖ్యా బలాన్ని పట్టించుకోకుండా తమ సార్వభౌమాధికారి భారత రాణి చక్రవర్తికి తమ విధేయత, భక్తిని చాటుకున్న సిక్కులు.. యుద్ధ రంగంలో శత్రువుకు వెన్నుచూపరనే ఖ్యాతిని నిలబెట్టుకున్నారు.
యూనిట్ మొత్తానికి అవార్డులు..
యుద్ధానంతరం.. కల్నల్ హాటన్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులకు సరాగఢీ యుద్ధం వెనకున్న హృదయ విదారక కథను వివరించాడు. ఫలితంగా, మొత్తం 21 మంది సైనికులకు ప్రతిష్టాత్మక ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ క్లాస్ III అవార్డు లభించింది. యూనిట్‌లో ప్రతి ఒక్కరూ ఒకే యుద్ధానికి శౌర్య పురస్కారాలను గెలుచుకోవడం కూడా చరిత్రలో ఇదే మొదటిసారి.
స్మృతిపథంలో.. వారసత్వంగా
సరాగఢీ యుద్ధంలో సిక్కు సైనికుల శౌర్యం, త్యాగాన్ని వివరిస్తూ చుహార్ సింగ్ అనే కవి ‘ఖల్సా బహదూర్’ పేరుతో ఒక పద్యాన్ని రాశారు. పంజాబీలో రాయబడిన ఈ పద్యం 55 పేజీలు ఉండటం విశేషం. ఇక ఈ యోధుల జ్ఞాపకార్థం బ్రిటిష్ వారు.. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం సమీపంలో ఒకటి, ఈ సైనికుల సొంత జిల్లాలోని ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్‌లో మరొక గురుద్వారాను నిర్మించారు. కాగా ఆ 21 మంది సైనికుల త్యాగాలకు గౌరవార్ధంగా నేటికీ సెప్టెంబర్12ను ‘సరాగఢీ రోజు’గా జరుపుకుంటారు. దీన్ని సిక్కు సైనిక స్మారక దినంగానూ పిలుస్తుంటారు.