పీవీ జిల్లాపై ప్రభుత్వం కసరత్తు!

by Anukaran |   ( Updated:2021-06-15 00:07:06.0  )
manthani Movements
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: భారత ఆర్థిక పితామహుడు, దివంగత పీవీ నరసింహరావు పేరిట జిల్లా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. హుజురాబాద్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో స్థానికులు ఇటీవల ఉద్యమాలు చేశారు. పీవీ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు కూడా చేశారు. అయితే ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ హుజురాబాద్ లో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో పీవీ జిల్లా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వరంగల్ అర్బన్ జిల్లా స్థానంలో హుజురాబాద్ కేంద్రంగా పీవీ జిల్లాను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న సమాలోచనలు చేస్తున్నట్టుగా సమాచారం.

ఈటలకు చెక్…

హుజురాబాద్‌లో త్వరలో జగనున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆధిపత్యం సాధించాలంటే జిల్లా కేంద్రం ప్రకటించడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 28న పీవీ శత జయంతిని పురస్కరించుకుని జిల్లాను ప్రకటించేందుకు ఎలాంటి వ్యూహం రచించాలన్న విషయంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టుగా సమాచారం.

నాడు మంథని…

1991లో పీవీ నరిసంహరావు ప్రధానమంత్రి అయిన తరువాత మంథనిలో ఉద్యమాలు జరిగాయి. విద్యార్థి యువత ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. వాస్తవంగా పీవీ నరసింహరావు స్వస్థలం వంగెర అయినప్పటికీ రాజకీయంగా ఆయనను అక్కున చేర్చుకున్నది మంథనియే. 1957 నుండి నాలుగు సార్లు ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన పీవీ.. పలు శాఖలకు మంత్రిగా, ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు.

నిజాం విముక్తి కోసం చేసిన సాయుధ పోరాట సమయంలో మహారాష్ట్రలోని చాందా కేంద్రంగా క్యాంప్ నిర్వహించారు. ఈ సమయంలో పీవీ సాయుధులకు రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించారు. అప్పటి పరిచయాల అనుభందంతోనే ఆయన మంధని నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. దీంతో పీవీ జిల్లాగా మంథనిని ప్రకటించాలని అప్పట్లోనే డిమాండ్ చేశారు. అయితే నూతన జిల్లాల ఆవిర్భావ సమయంలో కూడా పీవీ నరసింహరావు పేరిట మంథనిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండ్ వినిపించినప్పటికీ లాభం లేకుండా పోయింది.

District Formation

వాస్తవంగా పెద్దపల్లి జిల్లా కేంద్రం కరీంనగర్ కు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మంథని సెగ్మెంట్ లోని మారుమూల గ్రామాలకు పెద్దపల్లికి రావాలంటే 100 కిలో మీటర్లకు పైనే దూరం ఉంటుంది. ఈ కారణంగా అప్పటి అధికారులు మహదేపూర్ పూర్వ తాలుకాలోని మండలాలను భూపాలపల్లి జిల్లాలో కలిపారు. శతాబ్దాలుగా మంథని ప్రాంతంతో ఉన్న అనుభందం నూతన జిల్లాల ఏర్పాటుతో మహదేవపూర్ ప్రాంత వాసులు తెగతెంపులు చేసుకోవల్సి వచ్చింది. భూపాలపల్లి కేంద్రంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల ద్వారా బొగ్గు వెలికి తీస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రానున్న కాలంలో భూపాలపల్లి కాలగర్భంలో కలిసి పోయే ప్రమాదం కూడా లేకపోలేదు.

భవిష్యత్తులో భూపాలపల్లి జిల్లా కేంద్రాన్ని మార్చాల్సిన అవసరం తప్పనిసరి అన్నది మాత్రం వాస్తవం. అటు పెద్దపల్లి కరీంనగ్ జిల్లా కేంద్రానికి సమీపాన ఉండడం, ఇటు భూపాలపల్లి సింగరేణి భూ సేకరణతో ఓసీపీల మాటున మాయం అయ్యే ప్రమాదం ఉన్నందున మంథని సమీపంలో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వారూ లేకపోలేదు. పరిపాలన సౌలభ్యం విషయంలో కూడా మంథనియే అన్నింటా బెటర్ అంటున్నారు మంథని ప్రాంత వాసులు.

హుస్నాబాద్ డిమాండ్…

మరో వైపు పీవీ స్వగ్రామం వంగెర హుస్నాబాద్ పాత తాలుకా పరిధిలోనే వస్తుందని హుస్నాబాద్ వాసులు అంటున్నారు. పీవీ పేరిట జిల్లా ఏర్పాటు చేస్తే హుస్నాబాద్ కేంద్రంగానే చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పీవీకి తమ ప్రాంతంతోనే ఎక్కువ అనుభందం ఉండేదని హుస్నాబాద్ ప్రాంత వాసులు అంటున్నారు. ఈ కారణంగా పీవీ జిల్లాను ఇక్కడే ఏర్పాటు చేయడం అన్నింటా సముచితం అని వ్యాఖ్యినిస్తున్న వారూ లేకపోలేదు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం హుజురాబాద్ కేంద్రంగా పీవీ జిల్లాను ప్రకటించేందుకు సమాయత్తం అవుతున్నట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed