త్వరలో రెండో ఉద్దీపన ప్యాకేజీ!

by  |
త్వరలో రెండో ఉద్దీపన ప్యాకేజీ!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 ( kovid-19) సంక్షోభం కారణంగా కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ(Economy)ను కాపాడేందుకు ప్రభుత్వం మరోసారి ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఈసారి మధ్య తరగతి, చిరు వ్యాపారులకు ఊరటనిచ్చేలా రెండో ప్యాకేజీ ఉండనుందని తెలుస్తోంది. ఇటీవల రెండవసారి ఆర్థిక ప్యాకేజీ ఉండొచ్చని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి సుబ్రమణియన్ చెప్పిన సంగతి తెలిసిందే.

లాక్‌డౌన్ ముగిసిన నేపథ్యంలో రెండో ఉద్దీపన ప్యాకేజీ వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక భేటీలను నిర్వహించడం మరో ఉద్దీపన ప్యాకేజీపై సానుకూల సంకేతాలనిస్తోంది. అదేవిధంగా తాజా జీడీపీ గణాంకాల్లో ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోవడంతో రెండో ప్యాకేజీ ( second package) ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎదురైన సవాళ్లే మిగిలిన ఆర్థిక సంవత్సరంలోనూ ఉండొచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది.

ఈ నేపథ్యంలోనే తదుపరి ప్యాకేజీ రూపకల్పనపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. అంతేకాకుండా పండుగ సీజన్ వస్తుండటంతో ప్యాకేజీ ప్రకటించడం ద్వారా డిమాండ్ పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. దారుణంగా పడిపోయిన డిమాండ్‌ను పెంచే విధంగా చర్యలుండాలని వ్యాపార వర్గాలు సైతం ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాయి. అయితే, ప్యాకేజీ ఎప్పుడు ప్రకటించాలనే అంశంపై ప్రభుత్వం చర్చిస్తోంది. మధ్యతరగతితో పాటు చిన్న వ్యాపారులకు ఊరటనిచ్చేలా ప్యాకేజీ ఉండేలా ఆర్థిక శాఖ, ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి అధికారులు, నీతి అయోగ్ అంగీకరించినట్టు తెలుస్తోంది.


Next Story

Most Viewed