- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇచ్చినట్టే ఇచ్చి నొక్కేస్తున్నారు
దిశ, తెలంగాణ బ్యూరో/జవహర్ నగర్: ‘వరద సాయం చేస్తామంటూ అధికార పార్టీ నేతలు శేరిలింగంపల్లి నియోజకవర్గం చింతల్ పరిధిలోని ఓ ఇంటికి చేరారు. ఇంటిలో రెండు కుటుంబాలు అద్దెకు ఉంటుండగా, మొదటి ఫ్లోర్‌లో యజమాని ఉంటున్నాడు. కింద ఉన్న రెండు కుటుంబాలకు వరద సాయం వచ్చిందంటూ ఆధార్ కార్డు, ఓటరు కార్డు తీసుకుని, ఫోన్ నెంబర్‌తో ఓటీపీ తీసుకుని రెండు కుటుంబాలకు చేరో రూ. 5 వేలు చేతిలో పెట్టారు. అదేంది.. ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ. 10 వేలు ప్రకటించింది కదా అని అడిగితే.. అంతే రూ. 5వేలే ఇస్తున్నామంటూ వారిని మాట్లాడకుండా ఎదురు తిరిగారు. దీంతో చేసేదేమీలేక ఇచ్చింది తీసుకున్నారు..’ ఇలా వరద సాయం పంపిణీలో కూడా టీఆర్ఎస్ నేతలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. చాలాచోట్ల సగం సగమే పంపిణీ చేశారు. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కొన్నిచోట్ల ఇప్పించి మిగిలిన ప్రాంతాల్లో పార్టీ నేతలకు అప్పగించారు. ఇదే వారికి కలిసి వస్తోంది. ఇచ్చేదాంట్లో సగం కోత పెడుతున్నారు. స్థానికంగా ఉండే కార్పొరేటర్ల అనుచర వర్గమే ఈ బాధ్యతలను చూస్తోంది. ప్రతిరోజూ వరద సాయాన్ని పంపిణీ చేసి, సగం సొమ్మును కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నేతలకు లెక్కలు చూపిస్తున్నారు.
ఓటరు కార్డుందా? లేదా..?
వరదలతో నగరమంతా అస్తవ్యస్తమైంది. లక్షల విలువ చేసే విలువైన సామగ్రి పనికిరాకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన సాయంలో సగం సగం తింటున్నా… స్థానిక నేతలు చాలా తిరకాసు పెడుతున్నారు. ప్రభుత్వం అడగని ఆధారాలు చూపించాలని పట్టుబడుతున్నారు. కచ్చితంగా ఓటరు కార్డు చూపించాలని, పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల నుంచి తీసుకువచ్చే ఓ ప్రత్యేక ఫార్మాట్‌లో పేరు, ఇంటి నెంబర్, ఆధార్ కార్డు, ఓటరు కార్డు వివరాలు రాసుకుంటూ వరద సాయం పంపిణీ చేస్తున్నారు. అయితే కచ్చితంగా ఓటరు కార్డు ఉండాలని చెప్పుతున్నారు. సదరు కార్పొరేటర్ పరిధిలో ఓటరు కార్డు లేకుంటే వారికి వరద సాయం ఇవ్వడం లేదు. ఇప్పుడు వరద లేదు ఇవ్వకుంటే ఏం చేస్తారంటూ బాధితులను బెదిరిస్తున్నారు. దీనిపై మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఓ మున్సిపల్ కమిషనర్ బహిరంగంగా విమర్శలు చేస్తే.. ఓ ఎమ్మెల్యే సదరు కమిషనర్‌ను బెదిరించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో సదరు మున్సిపల్ కమిషనర్ దీనిపై నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. అయినప్పటికీ వరద సాయం పంపిణీలో నీకేం అవసరం లేదని, పార్టీ నేతలు చూసుకుంటారని సదరు కమిషనర్‌కు తిరుగు సమాధానం పంపించారు.
రూ. 10వేలు ఇచ్చినట్టే ఇచ్చి…
గ్రేటర్ పరిధిలోని ఏఎస్ రావు నగర్, రెండవ డివిజన్ లోని బస్తీలలో వరద ముంపు సాయం పేరుతో టీఆర్ఎస్ నేతలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ముంపునకు గురైన ఇళ్లకు పరిహారం అందించకుండా.. నష్టం జరగని ఇళ్లను గుర్తించి వారికి పదివేల చొప్పున ఇస్తున్నారు. ఆ తర్వాత వారి వద్ద రూ. 300 నుంచి రూ. 1000 వరకు ఉంచి మిగతా సొమ్మును దండు కుంటున్నారని ఆయా కాలనీల వాసులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. డివిజన్ లోని మారుతీ నగర్, బీజే ఆర్ కాలనీ, శివ సాయినగర్, శ్రీ విరాట్ నగర్, జై కిసాన్ కాలనీల బాధితులు వారికి జరుగుతున్న అన్యాయ పై ‘దిశ’తో చెప్పుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు తమ పేర్లను నమోదు చేసి అందరి ముందు సీఎం రిలీఫ్ ఫండ్ 10,000 అందించి సంతకాలు తీసుకుంటున్నారని, ఆ తర్వాత వచ్చి 9700 తీసుకుంటు జేబులు నింపుకుంటున్నారని వాపోయారు. ఇదేంటని ప్రశ్నించగా, 300 రూపాయలు మాత్రమే వస్తాయని.. ఇవే తీసుకోవాలని.. లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకాలూ మీకు రావని బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు.
రూ. 9700 తీసుకుంది..
ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఇంట్లోకి నీరు చేరి నిత్యవసర వస్తువులు మొత్తం తడిసి ముద్దయ్యాయి.. కాలనీలో సర్వే చేసి, ఆధార్ నెంబర్ నమోదు చేసి, సంతకం తీసుకొని నష్ట పరహారం అందించారు. మారుతీ నగర్ వార్డు సభ్యురాలు శిరీష రెడ్డి కార్పొరేటర్ పేరు చెప్పి 9700 తీసుకొని తనకు మూడు వందలు మాత్రమే ఇచ్చింది..
-పసనాది వెంకటమ్మ బాధితురాలు
ఇదెక్కడి అన్యాయం..
ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఇంట్లోకి నీరు చేరి నిత్యవసర సరుకులు మొత్తం తడిసి ముద్ద వడంతో సీఎం రిలీఫ్ ఫండ్ కింద పదివేల రూపాయలు పరిహారం ఇచ్చి సంతకం తీసుకున్నారు. ఆ తర్వాత వార్డు సభ్యులు శిరీష రెడ్డి 9700 తీసుకొని తనకు మూడు వందలు మాత్రమే ఇచ్చింది.. ఇదెక్కడి అన్యాయం..
– గొరికే రేణుక, బాధితురాలు