అక్కడ.. తొలి త్రిపుల్ తలాక్ కేసు నమోదు

by Shyam |
అక్కడ.. తొలి త్రిపుల్ తలాక్ కేసు నమోదు
X

దిశ, ఎల్బీనగర్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొదటి త్రిపుల్ తలాక్ కేసు నమోదైంది. ఆదివారం ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు వివరాలను వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం మల్లెపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్ సమీ, రాజేంద్రనగర్‌లోని పీహెచ్సీ టీబీ డిపార్ట్‌మెంట్‌లో లాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి హస్తినాపురం ఓంకార్‌నగర్‌కు చెందిన హసీనా(24)తో సెప్టెంబర్ 7, 2017న పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు జన్మించాడు. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సాఫీగానే కాపురం సాగింది. కొన్ని రోజులకు భార్య హసీనాను ఇంట్లోనే ఉంచి బయట తాళం వేసి సమీ వెళ్లివచ్చేవాడు. ఇదేంటని నిలదీసిన బాధితురాలిని ఆడపడుచు పర్వీన్, అత్త అన్వరీ బేగంతో భర్త కలిసి కొడుతూ అదనపు కట్నం తీసుకురావాలని తరచుగా వేధించసాగారు. దీంతో విసుగు చెందిన బాధితురాలు హసీనా, 2019 సెప్టెంబర్‌లో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భార్యభర్తలిద్దరికీ పెద్దల సమక్షంలో సఖీ కేంద్రంలో కౌన్సిలింగ్ నిర్వహించగా డిసెంబర్ నెల నుంచి భార్యభర్తలిద్దరూ బాబుతో కలిసి హస్తినాపురంలో నివాసముంటున్నారు. మే 23న అర్ధరాత్రి భార్యతో గొడవ పెట్టుకుని కొట్టిన సమీ, తలాక్ అని చెప్పి అత్తింటి వద్ద హసీనాను వదిలి వెళ్లాడు. దీనిపై జూన్ 26న వనస్థలిపురం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీచేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ నెల 13న ఎల్బీనగర్ పోలీసులు త్రిపుల్ తలాక్ కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed