- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కులమొద్దూ.. మతమొద్దూ
దిశ, న్యూస్ బ్యూరో: కుల, మతాలకు అతీతంగా బతుకున్న తమ ప్రేమ జంటకు రూపమైన బాబుకు కుల, మత రహితంగా ఉండేలా జీవితమంతా సర్టిఫికెట్లు జారీ చేయాలని ఓ ప్రేమజంట కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసింది. ఏడాదిగా పోరాడుతున్న ఈ జంట దాఖలు చేసిన పిల్ సోమవారం విచారణకు వచ్చింది.
హైదరాబాద్‌కు చెందిన ప్రేమ జంట రూప, డేవిడ్ దంపతులకు 2019 మార్చి 23 న ఓ బాబు పుట్టాడు. కొత్తకోటలోని రూప తల్లిదండ్రుల ఇంటి వద్ద బాబుకు జన్మ ఇవాన్ రూడే అని పేరు పెట్టుకున్నారు. రూప తల్లిగారి ఊరైన వనపర్తి జిల్లా కొత్తకోటలో బాబు జన్మించడంతో జనన ధృవీకరణ పత్రం కోసం అక్కడి మున్సిపాలిటీకి వెళ్లారు. నమోదు ఫారంలోని కుటుంబ ‘మతం’ కాలమ్‌ని నింపితే తప్ప బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని మున్సిపల్ సిబ్బంది తెగేసి చెప్పారు. కులం, మతం అనే కాలమ్‌లను నింపకుండా.. అవి లేకుండానే పత్రాలు జారీ చేయాలని రూప, డేవిడ్ కోరారు. తాము కులాంతర, మతాంతర వివాహం చేసుకున్నా తాము వాటిని విశ్వసించడం లేదు కాబట్టి అందులో ఉన్న ‘కుటుంబ మతం’ అనే కాలామ్ నింపడానికి నిరాకరించారు. ఆ కాలామ్ నింపితే తప్ప బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరని మున్సిపాలిటీ అధికారులు చెప్పడంతో 2019 ఏప్రిల్ 22న జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ కూడా తమ సమస్య పరిష్కారం కాకపోవడంతో జూన్ 2019లో హైకోర్టును ఆశ్రయించారు. టెక్నికల్ సమస్యలతో మూడు సార్లు పిటీషన్‌ను తిరస్కరించిన కోర్టు ఈ ఏడాది జనవరిలో విచారణకు స్వీకరించింది.
నాలుగు వారాల వాయిదా
జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎ. అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఆన్‌లైన్‌లో వాదనలు విన్నది. కౌంటర్ దాఖలు చేసేందుకు నాలుగు వారాల సమయం ఇచ్చింది. ప్రభుత్వం, మున్సిపల్ అడ్మినిస్ట్రేట్ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, జనన, మరణ ధృవీకరణ అధికారి, కొత్తకోట మున్సిపాలిటీ అధికారులను ప్రతివాదులుగా పేర్కొన్నది. నాలుగు వారాల గడువిస్తూ వీరందరికీ నోటీసులు జారీ చేసింది.
తమిళనాడులో మొదటి విజయం
తమిళనాడుకు చెందిన న్యాయవాది ఎం.స్నేహ తనకు ఇచ్చే సర్టిఫికెట్లో ‘ కులం, మతం లేదు’ అని ఆప్షన్ ఉండాలని సుదీర్ఘ పోరాటం నిర్వహించారు. స్థానిక కలెక్టర్ ఆమెకు ‘ నో క్యాస్ట్ – నో రిలీజన్’ సర్టిఫికెట్ జారీ చేశారు. అయితే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు నింపేటప్పుడు కులం, మతం కాలమ్స్ నింపకుండా ఫారాలు నింపే అవకాశం లేదు. ఈ విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయని రూప, డేవిడ్ దంపతుల తరపున న్యాయవాదులు ఎస్. వెంకన్న, డి. సురేష్ కుమార్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
హైదరాబాద్‌లో స్కూల్ అడ్మిషన్
ఇదే తరహాలో హైదరాబాద్‌కు చెందిన డివి. రామకృష్ణ రావు, ఎస్. క్లారెన్స్ కృపాళిని దంపతులు కూడా హైకోర్టును ఆశ్రయించారు. తమ పిల్లల అడ్మిషన్ సందర్భంగా మతం కాలమ్ నింపితే తప్ప అడ్మిషన్ ఇవ్వమని స్కూల్ యాజమాన్యం చెప్పడంతో కోర్టును ఆశ్రయించారు. మతం చెప్పడానికి నిరాకరించిన కారణంగా అడ్మిషన్ ఇవ్వకపోవడం సరైంది కాదని కోర్టు చివాట్లు పెట్టడంతో స్కూల్ యాజమాన్యం ఎట్టకేలకు అడ్మిషన్ ఇచ్చింది. కానీ, ఆన్‌లైన్ వ్యవహారాల్లో మతం, కులం అనే కాలం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది.
ఇవాన్ రూడే మొదటివాడవుతాడు..
మతాన్ని నమ్మే హక్కు ఎలాగైతే ఉందో, వాటిని నమ్మకుండా ఉండే హక్కు కూడా రాజ్యాంగమే కల్పించింది. మా అబ్బాయి పుట్టి 13 నెలలు అయింది. దేశంలో కొన్నిచోట్ల సర్టిఫికెట్లు జారీ చేశారు కానీ, ఆన్‌లైన్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దేశంలో కులాన్ని, మతాన్ని వదులుకొని బతుకుతున్నవారు లక్షల్లో ఉన్నారు. మా కేసులో విజయం సాధించుకుంటే ఈ దేశంలో పుట్టుకతో మతాన్ని, కులాన్ని వదులుకున్న మొట్టమొదటి వ్యక్తిగా ఇవాన్ రూడే చరిత్రలో నిలిచిపోతాడు అని రూప, డేవిడ్ అన్నారు.
tags: Telangana, National, court, Religion, Love, Hyderabad, Law