దూబేకు బెయిల్ ఇచ్చారా?.. ఇది వైఫల్యం కాక మరేంటీ?

by Anukaran |
supreme court notices to twitter
X

న్యూఢిల్లీ: వికాస్ దూబే ఎన్‌కౌంటర్, అతని అనుచరుల మరణాలకు సంబంధించిన పిటిషన్లను విచారిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడింది. కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌కు బెయిల్ ఇచ్చారనే వాస్తవం ఆందోళన కలిగిస్తోందని ఫైర్ అయింది. బెయిల్‌పై బయట ఉండే పోలీసులపై ఘాతుకానికి పాల్పడ్డాడని, ఇది వైఫల్యం కాక మరేంటని ఆగ్రహించింది. బెయిల్‌కు సంబంధించిన ఆదేశాలన్ని తమకు సమర్పించాలని ఆదేశించింది. రాష్ట్రంలో చట్టాన్ని ఎత్తిపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందని గుర్తుచేసింది. వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని దాఖలైన పిటిషన్లను సీజేఐ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తున్నది. ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న హంతకముఠా నాయకుడు, గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను పోలీసులు కస్టడీలోకి తీసుకున్న తర్వాత హతమైన సంగతి తెలిసిందే. తుపాకీతో పోలీసులపైకి కాల్పులకు దిగగా పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించాడని యూపీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తునకు హైకోర్టు రిటైర్డ్ జడ్జితో స్వతంత్ర ఏకసభ్య కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీపైనా సుప్రీంకోర్టు స్పందించింది. ఈ కమిటీలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీని, రిటైర్డ్ పోలీసు అధికారినీ చేర్చాలని సూచించింది. తెలంగాణ ‘దిశ’ ఎన్‌కౌంటర్‌కు దీనికి చాలా వ్యత్యాసమున్నదని పేర్కొంటూ ఈ సూచనలు చేసిది. కమిటీలో మరో ఇద్దరిని చేర్చడానికి యూపీ ప్రభుత్వం అంగీకరించింది. సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తినే కమిటీలో చేర్చితే ఇతర అప్పీళ్లను విచారించడానికి అవకాశముండదని కోర్టు అభిప్రాయపడింది.

Advertisement

Next Story

Most Viewed