కోటి రూపాయలు కేటాయిస్తే.. ఒక్కొక్కరికి రూ.9.55 పైసలే వస్తున్నాయి

by Shyam |   ( Updated:2020-06-07 20:48:30.0  )
కోటి రూపాయలు కేటాయిస్తే.. ఒక్కొక్కరికి రూ.9.55 పైసలే వస్తున్నాయి
X

దిశ, న్యూస్ బ్యూరో: వికలాంగుల సంక్షేమాన్ని సర్కారు గాలికొదిలేసింది. తెల్లరేషన్ కార్డులు లేని వికలాంగులకూ ఉచిత రేషన్ బియ్యం, నగదు అందని పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది. కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్‌లో ప్రజలను పస్తులుంచకుండా చూస్తామని చెబుతున్న ప్రభుత్వం వికలాంగులపై మాత్రం చిన్న చూపే చూస్తున్నది. విపత్కర పరిస్థితులలో అంగవైకల్యంతో ఇబ్బందులు పడుతున్న వారికి సర్కారు చేదోడు వాదోడుగా ఉండాలని చట్టాలు చెబుతున్నాయి. కానీ, సర్కారు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నది. ఇటీవల హైకోర్టు వికలాంగులను అన్ని విధాలా ఆదుకోవాలని ఆదేశించింది. అయినా ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టడం లేదు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1 కోటి కేటాయించి చేతులు దులుపుకుంది. ఈ కోటి రూపాయాలను ఒక్కో వికలాంగుడికి పంపిణీ చేస్తే రూ.9.55పైసలు మాత్రమే వస్తున్నాయి. దీన్ని బట్టి వికలాంగులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఎంతో అర్థమవుతుంది.

వికలాంగులను ఆదుకునే వారేరి?

కరోనా వైరస్ (కొవిడ్-19) కట్టడికి విధించిన లాక్ డౌన్‌తో దేశంలో జనమంతా ఎక్కడికక్కడ లాక్ పోయారు. జీవన వ్యవస్థ స్తంభించిపోయింది. సామాన్యులు, వలస కూలీలు ఆపసోపాలు పడుతున్నారు. వికలాంగుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. డయాలిసిస్ పెషెంట్లు, కండరాల క్షీణత, తలసేమియా వ్యాధులతో బాధపడుతున్నవారు వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక నానా అవస్థలు పడుతున్నారు. వికలాంగులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి వారిని ప్రభుత్వాలు ఆదుకోవాలని వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 2016 చెబుతున్నది. కానీ, ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది.

రూ.1 కోటి కేటాయింపు..

లాక్ డౌన్‌లో వికలాంగుల వైద్య ఖర్చుల నిమిత్తం సర్కారు రూ.ఒక కోటి కేటాయించింది. ఇవి ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఉన్న 10,46,827 మంది వికలాంగులకు పంపిణీ చేస్తే మనిషికి రూ.9.55పైసలు మాత్రమే వస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పందించి ప్రభుత్వానికి చురకలంటించిన విషయం తెలిసిందే. అయినా సర్కారు వికలాంగులను ఆదుకునే దిశగా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని వికలాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులకు అందిస్తున్న ఉచిత రేషన్ బియ్యం 12 కిలోలు, ఆర్థిక సాయం రూ.1,500 కూడా తెల్లరేషన్ కార్డు లేని వికలాంగులకు అందడం లేదు. లాక్‌డౌన్‌లో ప్రభుత్వ సేవలు అందుకోవడం కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ కేటాయించారు. వికలాంగుల కోసం కూడా ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఉందన్న సంగతి వికలాంగులకు తెలపడంలో అధికారులు విఫలమయ్యారు. అయినా కొందరు నెంబర్ తెలుసుకుని కాల్ చేసినప్పటికీ స్పందించేవారే లేకుండా పోయారు. రాష్ట్రంలో సుమారు 25లక్షల మంది అంగవైకల్యంతో బాధపడుతున్న వికలాంగులు ఉంటే ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పెన్షన్ మాత్రం 4,93,000 మందికి మాత్రమే అందుతున్నది. కేంద్రం కూడా వికలాంగులకు మొండి చేయే చూపింది. ఆత్మ నిర్భర్ ప్యాకేజీలో వికలాంగుల వాటా లేదనీ, వికలాంగులకు ఇస్తామన్న రూ.1,000 సాయం జాడే లేదని వికలాంగులు చెబుతున్నారు. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం 7 రకాల అంగవైకల్యంతో బాధపడుతున్న వారిని వికలాంగులుగా గుర్తించేవారు. ఆ నిబంధనల ప్రకారం 2011 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రంలో 10,46,827 మంది వికలాంగులున్నారు. అయితే, వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 2016లో అంగవైకల్యాల సంఖ్యను 7 నుంచి 14 రకాలకు పెంచారు. ఈ యాక్ట్ ఆధారంగా ప్రస్తుతం రాష్ట్రంలో 25 లక్షల మంది వికలాంగులున్నారని వికలాంగుల సంఘాలు చేసిన సర్వేలు చెబుతున్నాయి. వీరందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని ఆ సంఘాలు కోరుతున్నాయి.

మమ్మల్ని పట్టించుకునే దిక్కు లేదు: కిరణ్ కుమార్, చంద్ర సుప్రియా

మేమిద్దరం గుడ్డివాళ్లం. మాకు ఒకరి సాయం ఉంటే తప్ప బయటకు వెళ్లలేని పరిస్థితి. అడ్వకేట్లుగా పని చేస్తూ జీవిస్తున్నాం. మూడు నెలలుగా ప్రాక్టిస్ లేకపోవడంతో గతంలో చేసిన డబ్బులతో కాలం వెల్లదీస్తున్నాం. కరోనా వైరస్ భయంతో మాకు సహాయం చేసేవారు కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు. మేము ఎవరినైనా ముట్టుకోవాలన్న.. మమ్మల్ని ఎవరైనా పట్టుకోవడాకైనా భయం వేస్తుంది. మాకు రేషన్ కార్డు లేదు. దాంతో ప్రభుత్వం అందించే ఉచిత బియ్యం, ఆర్థిక సాయం కూడా అందలేదు. సర్కారు వికలాంగులకు ఆదుకోవాల్సిన బాధ్యతను మరిచింది. ఇప్పటికైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మా బాధలను గుర్తించి అంగవైకల్యంతో బాధపడుతున్నవారిని ఆదుకోవాలి.

వికలాంగులను ఆదుకోవాలి: వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహా
లాక్‌డౌన్‌లో వికలాంగులు ఇంట్లోనే ఉంటూ మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు ఆసరా పెన్షన్ మూడు నెలలు ముందస్తుగా ఇవ్వాలి. 35 కిలోల ఉచిత బియ్యం, నిత్యావసర వస్తువులు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలి.

Advertisement

Next Story

Most Viewed