అతను చనిపోవడానికి కారణం వ్యాక్సిన్ కాదు: శ్రీనివాసరావు

by Shyam |
అతను చనిపోవడానికి కారణం వ్యాక్సిన్ కాదు: శ్రీనివాసరావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిర్మల్ జిల్లాలోని హెల్త్ కేర్ వర్కర్ చనిపోడానికి కారణం వ్యాక్సిన్ కాదని, గుండెపోటు రావడం వల్ల జరిగిన సహజ మరణమేనని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 11.30గంటలకు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అరగంటపాటు అబ్జర్వేషన్‌లో ఉన్నారని, ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటల వరకు విధుల్లోనే ఉన్నారని వివరించారు. అర్ధరాత్రి 2.30గంటలకు గుండెపోటు వచ్చిందని, తెల్లవారుజామున 5.30 గంటలకు ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే మరణించారని, ఇది సహజ మరణమే తప్ప వ్యాక్సిన్‌తో ముడిపెట్టాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు. ఆంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేసే ఆ వ్యక్తి వ్యాక్సిన్ తీసుకున్న వయల్‌ నుంచే మరో తొమ్మిది మంది కూడా టీకాలు ఇచ్చామని, వారంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మామూలుగానే ఉన్నారని గుర్తుచేశారు.

వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్టులు వైద్య చికిత్స అవసరమయ్యే అనారోగ్యానికి దారితీస్తాయే తప్ప ప్రాణం తీసే పరిస్థితికి దారితీయదని మీడియాతో మాట్లాడే సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరావు వివరించారు. ఒకవేళ వ్యాక్సిన్ లోపం ఉన్నట్లయితే మూకుమ్మడిగా ఇలాంటి వైపరీత్యాలు జరిగి ఉండేవని, కానీ కేవలం ఒక వ్యక్తి మాత్రమే చనిపోవడానికి టీకాతో ముడిపెట్టడం సమంజసం కాదన్నారు. పోస్టుమార్టంలో సైతం గుండెపోటు కారణమని నిర్ధారణ అయినట్లు తెలిపారు. దీనికి తోడు జిల్లా స్థాయి ఏఈఎఫ్ఐ (ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్) కమిటీకి చెందిన పదిహేను మంది వైద్యులు సైతం వెంటనే ఈ సంఘటనపై అప్రమత్తమై మొత్తం కేస్ హిస్టరీని అధ్యయనం చేశారని, వ్యాక్సిన్ లోపం ఏమీ లేదని నిర్ధారించారని పేర్కొన్నారు. ఈ నివేదికను రాష్ట్రస్థాయిలోని ఏఈఎఫ్ఐ కమిటీ కూడా అధ్యయనం చేయనుందని తెలిపారు.

వ్యాక్సిన్ కారణం అని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, హెల్త్ కేర్ సిబ్బంది నిర్భయంగా టీకాలను తీసుకోవచ్చునని డాక్టర్ శ్రీనివాసరావు నొక్కిచెప్పారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది వ్యాక్సిన్ తీసుకున్నారని, కానీ ఉత్తరప్రదేశ్‌ (మొరాదాబాద్)లో ఒకరు, కర్నాటక (బళ్ళారి)లో ఒకరు చనిపోయారని, తాజాగా నిర్మల్ జిల్లాలో మరొకరు చనిపోయారని గుర్తుచేశారు. భవిష్యత్తులో యాభై ఏళ్ళు దాటినవారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందని, అప్పుడు కూడా ఇలాంటి మరణాలు చోటుచేసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతీరోజు తెలంగాణలో అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులు, గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు లాంటి వివిధ కారణాలతో సగటున 800 మంది చనిపోతున్నారని, ఇందులో వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా ఉంటే ఆ మరణాలకు కారణం ఇదేనంటూ టీకాతో ముడిపెట్టడం సహేతుకం కాదని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించారు.

Advertisement

Next Story