కోర్టు సంచలన నిర్ణయం.. పట్టాభిరామ్‌ అప్పటి వరకు రిమాండ్ లోనే..

by srinivas |   ( Updated:2021-10-21 06:42:49.0  )
కోర్టు సంచలన నిర్ణయం.. పట్టాభిరామ్‌ అప్పటి వరకు రిమాండ్ లోనే..
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నేత పట్టాభిరామ్‌కు విజయవాడ మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రిని అసభ్యపదజాలంతో దూషించినట్లుగా గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అందడంతో అతనిపై సెక్షన్‌ 153 (ఎ), 505(2), 353, 504 రెడ్‌ విత్‌ 120(బి) కింద (క్రైం నంబర్‌.352/2021) కేసు నమోదైంది. తొలుత ఆయనను కృష్ణా జిల్లా తోట్లవల్లూరు తీసుకువచ్చిన పోలీసులు, గురువారం మధ్యాహ్నం అక్కడి నుంచి విజయవాడకు తరలించారు.

విజయవాడలోని జీజీహెచ్‌లో వైద్యపరీక్షలు చేయించారు. అనంతరం విజయవాడ మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టులో గురువారం పోలీసులు హాజరుపరిచారు. మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తికి పట్టాభి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటికే తన ఇంటిపై పలుమార్లు దాడిచేశారని వివరించారు. తాను సీఎంని గానీ ప్రభుత్వంలో ఉన్న వారిని గానీ వ్యక్తిగతంగా విమర్శించ లేదని చెప్పుకొచ్చారు. కేవలం ప్రభుత్వంలో ఉన్న లోపాలను మాత్రమే మీడియాలో ప్రస్తావించాను అంటూ న్యాయమూర్తికి వివరించారు.

తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ నుంచి పట్టాభిని తరలించే క్రమంలో టీడీపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పీఎస్ వద్ద ఓ మోస్తరు ఉద్రిక్తత ఏర్పడింది. ఎట్టకేలకు పటిష్ట బందోబస్తు నడుమ పట్టాభిని విజయవాడ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. నవంబర్ 2 వరకు కోర్టు రిమాండ్ విధించింది.

Advertisement

Next Story

Most Viewed