మహబూబ్‌నగర్‌లో ‘హస్త’మయం

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోంది. పార్టీకి గతంలో ఉన్నంత క్యాడర్ ప్రస్తుతం కనిపించడం లేదు. ముఖ్యంగా ముందుండి నడిపే నాయకత్వం కరువవ్వడంతో కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. ఎంపీగా గెలుపొందిన రేవంత్‌రెడ్డి మల్కాజిగిరికే పరిమితమవుతున్నారే తప్ప జిల్లాపై దృష్టి పెట్టడం లేదు. ఇక స్థానికంగా ఉన్న నాయకులు సైతం పెద్దగా ప్రజలకు కనిపించడం లేదు.

ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ రోజురోజుకూ తగ్గిపోతోంది. కొన్నేండ్లుగా పాలమూరుపై పట్టు సాధించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు నాయకత్వం కరువవ్వడంతో నానాటికీ బలహీనపడుతోంది. 2018 ఎన్నికల ముందు జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఊపు ప్రస్తుతం కనిపించడం లేదు. గతంలో పార్టీలో ఉన్న కీలకనేతలందరూ ఇతర పార్టీల్లో చేరడంతో పార్టీని ముందుండి నడిపే నాయకత్వం కరువైంది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లాలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి డి.కె.అరుణ, రేవంత్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, సంపత్ కుమార్ వంటి వారితో ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలంగా కనిపించేంది. ఈ నాయకులు సైతం ప్రజలతో కలిసి పలు కార్యక్రమాలు నిర్వహించేవారు. ఎన్నికల సమయంలో సైతం నువ్వా? నేనా? అనే రీతిలో ప్రచారం నిర్వహించి అధికార పార్టీకి పోటీనిచ్చింది.

ఇతర పార్టీల్లోకి వలసలు..

ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరులో కేవలం కొల్లాపూర్ నియోజకవర్గం మినహా మిగతా చోట్ల కాంగ్రెస్ ఓటమిని చవిచూసింది. నాగర్‌కర్నూల్ నుంచి దామోదర్‌రెడ్డి టికెట్ ఆశించారు. అది దక్కకపోవడంతో ఎన్నికలకు ముందే టీఆర్‌ఎస్‌లో చేరారు. అదే సమయంలో డీకే అరుణ, జైపాల్‌రెడ్డిల మద్య వర్గ పోరు అసెంబ్లీ ఎన్నికల్లో తారాస్థాయికి చేరుకుంది.

జిల్లాలో పట్టు సాధించిన డికె.అరుణ.. ఇతర పార్టీలకు చెందిన పలువురు కీలక నాయకులను కాంగ్రెస్‌లోకి తీసుకురాగలిగారు. వారిలో కొంత మందికి అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని అధిస్టానాన్ని కోరారు. తాను సీనియర్ నాయకుడిని కాబట్టి తాను సూచించిన వారికే టికెట్లు ఇవ్వాలని జైపాల్‌రెడ్డి పట్టుబట్టి కొంత మందికి టికెట్లు ఇప్పించారు. అందులో ఒక్కరు సైతం గెలవలేదు.

దీంతో పార్టీ అనుసరిస్తున్న తీరు నచ్చక డీకే అరుణ బీజేపీలోకి చేరింది. కాంగ్రెస్ తరపున కొల్లాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన బీరం హర్షవర్దన్‌రెడ్డి కొద్ది రోజులకే గులాబీ గూటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఒటమిపాలైన రేవంత్‌రెడ్డి మల్కాజ్‌‌గిరి నుంచి ఎంపీ టికెట్ సాధించి ఎన్నికల్లో గెలుపొందారు. అప్పటి నుంచి ఆయన మల్కాజ్ గిరికే పరిమితమయ్యారే తప్పా కొడంగల్‌పై దృష్టి సారించలేకపోతున్నారు.

పెద్దదిక్కును కోల్పోయిన కాంగ్రెస్

సీనియర్ నాయకుడిగా, కేంద్ర‌మంత్రిగా సేవలందించిన జైపాల్‌రెడ్డి హఠాన్మరణంతో పార్టీ పెద్ద దిక్కును కోల్పోయింది. డీకే అరుణ పార్టీ వీడటం, జైపాల్‌రెడ్డి మృతి చెందడంతో పార్టీకి ఒకే సారి ఇద్దరు ముఖ్య నాయకులు దూరమయ్యారు. జిల్లా వ్యాప్తంగా పట్టున్న ఈ నాయకులు పార్టీలో లేకపోవడంతో కాంగ్రెస్ పరిస్థితి మరింత దారణంగా మారింది. ఇదే సమయంలో అయిన రేవంత్‌రెడ్డి కూడా మల్కాజిగిరికి పరిమితం కావడంతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ క్యాడర్ గందరగోళంలో పడింది.

స్థానిక ఎన్నికల్లో సైతం..

జిల్లాల విభజన నేపథ్యంలో ఆయా జిల్లాలకు నూతన నాయకులను అధిష్టానం నియమించడంతో ఉమ్మడి జిల్లాకు నాయకత్వం వహించిన నాయకులు కూడా కేవలం ఆయా జిల్లాలకే పరిమితమయ్యారు. ముందస్తు ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ తన సత్తా చాటలేకపోయింది. దీంతో పార్టీలో కొనసాగాలా? వద్దా? అని పలువురు కార్యకర్తలు నాయకుల్లో ఆలోచన మొదలైంది. పార్టీ బలహీనంగా మారిందని, మూడేండ్ల వరకు ఎలాంటి ఎన్నికలు ఉండవు కాబట్టి పార్టీలో కొనసాగినా ఎలాంటి ప్రయోజనం ఉండదని తమ దారి తాము చూసుకుంటే మంచిదనే భావన పలువురిలో మొదలైంది.

ప్రజల్లో కలవడం లేదు

ప్రస్తుతం సీనియర్ నాయకులు కాంగ్రెస్‌లో ఉన్నా.. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో వారు విఫలమవుతున్నారు. చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, వంశీచందర్‌రెడ్డి సైతం ప్రజలతో కలిసి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆసక్తి చూపడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మళ్లీ వస్తే అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రజలు కాంగ్రెస్‌ను మరిచిపోయే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Advertisement